చక్కెర వ్యాధి ఒకసారి వస్తే.. జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలని చాలామంది చెబుతూంటారు. అయితే ఇందులో వాస్తవం కొంతే. న్యూక్యాసల్, గ్లాస్‌గౌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాయ్‌టేలర్, మైక్ లీన్‌లు మధుమేహం శాశ్వతమేమీ కాదని ఇటీవల ఒక అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ప్రఖ్యాత వైద్య పరిశోధనల మ్యాగజైన్ ‘ద లాన్‌సెట్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. వైద్యుల సహకారంతో తగిన విధంగా బరువు తగ్గడం ద్వారా దాదాపు సగం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ పరిస్థితిని పూర్తిగా మెరుగుపరచుకోగలిగారు. మూడు నుంచి ఐదు నెలలపాటు అతితక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్న వారిలో 45.6 శాతం మంది తమ మధుమేహం మందుల వాడకాన్ని నిలిపివేయగలిగారని, జనరల్ ప్రాక్టీషనర్ సిబ్బంది సహకారంతో బరువును అదుపులో ఉంచుకోవడం ఇందులో కీలకంగా ఉందని రాయ్ టేలర్ తెలిపారు.
శరీర బరువు గణనీయంగా తగ్గినప్పుడు కాలేయం, క్లోమ గ్రంథుల్లోని కొవ్వు చాలావరకూ కరిగిపోయి. వాటి పనితీరు సాధారణ స్థితికి రావడం వల్ల ఇలా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్తంలోని హెచ్‌బీఏ1సీ మోతాదు దాదాపు 12 నెలలపాటు 6.5 శాతం కంటే తక్కువ ఉండటం.. రెండు నెలలపాటు మందులు వాడకున్నా ఈ పరిస్థితి కొనసాగడాన్ని మధుమేహం నుంచి బయటపడినట్లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. మధుమేహంతో బాధపడుతన్న రెండు గుంపుల ప్రజలపై తాము పరిశోధనలు నిర్వహించామని.. ఒక గుంపులోని వారికి మధుమేహ మందులు అందించగా.. రెండో వర్గానికి సమతుల ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గేందుకు ఏర్పాట్లు చేశామని.. ఐదు నెలల తరువాత దాదాపు 57 శాతం మందిలో మధుమేహం మాయమైనట్లు తెలిసిందని రాయ్ టేలర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment