Newcastle University scientist
-
పొట్టలో పెరుగుతున్న ప్లాస్టిక్
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి సగటున వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్‌ను పొట్టలోకి పంపించేస్తున్నాడు. అంటే క్రెడిట్ కార్డుతో సమానమైన ప్లాస్టిక్‌ను వారంవారం మనిషి పలు రూపాల్లో తినేస్తున్నాడు. అంటే మనిషి తినే, తాగే పదార్థాల ద్వారా ప్లాస్టిక్ భూతం పొట్టలో పేరుకుపోతోంది. ఇదే విషయమై ఎంత పరిమాణంలో ప్లాస్టిక్‌ను తింటున్నామో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూకాసిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. దీనిలో భాగంగా తాగునీరు, షెల్ ఫిష్, తేనే వంటి ఆహార పదార్థాల్లో ఎంతమేర సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ కణాలు ఉన్నాయో పరిశీలించారు. దీని ప్రకారం మనిషి వారంలో 5 గ్రాముల మేర ప్లాస్టిక్‌ను మింగేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇదే ఫైనల్ అయ్యే అవకాశం లేదని, ఇంతకంటే ఎక్కువే ప్లాస్టిక్‌నే మనిషి తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఎందుకంటే కేవలం కొన్ని పదార్థాల్లోని ప్లాస్టిక్‌ను మాత్రమే తాము పరిశీలించామని, ప్యాకేజి ఆహారం, ఇతర మార్గాల్లో తీసుకునే పదార్థాలను తాము అధ్యయనం చేయలేదని తెలిపారు. కేవలం వారంలోనే 5 గ్రాములు తింటుంటే.. నెల, సంవత్సరం, దశాబ్దం.. ఇక జీవిత కాలంలో ఎంత మేర ప్లాస్టిక్‌ను తినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. -
మధుమేహం శాశ్వతం కాదు!
చక్కెర వ్యాధి ఒకసారి వస్తే.. జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలని చాలామంది చెబుతూంటారు. అయితే ఇందులో వాస్తవం కొంతే. న్యూక్యాసల్, గ్లాస్గౌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాయ్టేలర్, మైక్ లీన్‌లు మధుమేహం శాశ్వతమేమీ కాదని ఇటీవల ఒక అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ప్రఖ్యాత వైద్య పరిశోధనల మ్యాగజైన్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. వైద్యుల సహకారంతో తగిన విధంగా బరువు తగ్గడం ద్వారా దాదాపు సగం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ పరిస్థితిని పూర్తిగా మెరుగుపరచుకోగలిగారు. మూడు నుంచి ఐదు నెలలపాటు అతితక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్న వారిలో 45.6 శాతం మంది తమ మధుమేహం మందుల వాడకాన్ని నిలిపివేయగలిగారని, జనరల్ ప్రాక్టీషనర్ సిబ్బంది సహకారంతో బరువును అదుపులో ఉంచుకోవడం ఇందులో కీలకంగా ఉందని రాయ్ టేలర్ తెలిపారు. శరీర బరువు గణనీయంగా తగ్గినప్పుడు కాలేయం, క్లోమ గ్రంథుల్లోని కొవ్వు చాలావరకూ కరిగిపోయి. వాటి పనితీరు సాధారణ స్థితికి రావడం వల్ల ఇలా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్తంలోని హెచ్‌బీఏ1సీ మోతాదు దాదాపు 12 నెలలపాటు 6.5 శాతం కంటే తక్కువ ఉండటం.. రెండు నెలలపాటు మందులు వాడకున్నా ఈ పరిస్థితి కొనసాగడాన్ని మధుమేహం నుంచి బయటపడినట్లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. మధుమేహంతో బాధపడుతన్న రెండు గుంపుల ప్రజలపై తాము పరిశోధనలు నిర్వహించామని.. ఒక గుంపులోని వారికి మధుమేహ మందులు అందించగా.. రెండో వర్గానికి సమతుల ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గేందుకు ఏర్పాట్లు చేశామని.. ఐదు నెలల తరువాత దాదాపు 57 శాతం మందిలో మధుమేహం మాయమైనట్లు తెలిసిందని రాయ్ టేలర్ చెప్పారు. -
కేలరీలు కరిగిస్తే.. మధుమేహాన్ని గెలవచ్చు!
‘మధుమేహం వస్తే వదలదు.. జీవితాంతం భరించాల్సిందే’ ఇదీ మనం తరచూ వినే విషయం. అయితే టైప్–2 మధుమేహాన్ని పూర్తిగా వదిలించు కోవడం అసాధ్యమేమీ కాదని న్యూక్యాసిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాయ్ టేలర్ అంటున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న రాయ్ చెబుతున్న దాని ప్రకారం.. టైప్ –2 మధుమేహాన్ని అరికట్టాలంటే శరీరానికి అందే కేలరీలు తగ్గాలి అంతే! ఈ మేరకు లిస్బన్లో జరిగే యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ సదస్సులో తన సుదీర్ఘ పరిశోధన వివరాలను డాక్టర్ రాయ్ వెల్లడించనున్నారు. అధిక కేలరీల కారణంగా మన కాలేయంలో కొవ్వు ఎక్కువగా చేరడంతో మధుమేహం మొదలవుతుంది. అధిక కొవ్వు వల్ల కాలేయం ఇన్సులిన్‌కు పెద్దగా స్పందించదు. పైగా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కాలేయంలోని అధిక కొవ్వు.. క్లోమ గ్రంధిలోకి చేరి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా మధుమేహం వస్తుంది. అయితే ఈ పరిస్థితిని అధిగమిం చడం చాలా సులువని రాయ్ సూచిస్తున్నారు. కాలేయంలోని కొవ్వు ఒక గ్రాము కరిగినా పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటున్నారు. అయితే వ్యాధి వచ్చిన తర్వాత పదేళ్ల లోపు మాత్రమే దాన్ని నియంత్రించేందుకు అవకాశముంటుంది. ఈ విషయాన్ని తాము రుజువు చేశామని.. చాలా మంది స్వచ్ఛందంగా కేలరీలను నియంత్రించడం ద్వారా రక్తంలోని చక్కెరను తగు మోతాదులో ఉంచుకోగలిగారని రాయ్ అంటున్నారు.