అమ్మ మనసంటే అదేనేమో!
ఆదర్శం
క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం లేదంటారు. తప్పు చేసిన వాడిని క్షమించమని మహా పురుషులు ఎందరో కూడా సెలవిచ్చారు. అయినా మనిషి భావోద్వేగాల ముందు క్షమాగుణం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. మనల్ని బాధపెట్టినవారిని క్షమించి వదిలేద్దామంటే మనసు ఎదురు తిరుగుతుంది. నీ బాధ అవతలివారిని కూడా రుచి చూడనివ్వమంటూ పోరు పెడుతుంది. కానీ ఆ తల్లి విషయంలో అలా జరగలేదు. తన కొడుకుని చంపినవాడిని సైతం ఆమె క్షమించింది. క్షమాగుణానికి, తల్లి మనసుకి మారుపేరుగా నిలిచింది.
ఏడేళ్ల క్రితం ఇరాన్‌లోని మజాందరన్ ప్రావిన్‌సలో అబ్దుల్లా అనే యువకుడిని నడిరోడ్డు మీద పొడిచి చంపాడు బలాల్ అనే వ్యక్తి. విచారణలు, వాదోపవాదాలు జరిగిన తరువాత అతడిని బహిరంగంగా ఉరి తీయమని న్యాయస్థానం ఆదేశించింది. ఎట్టకేలకు అతడిని ఉరితీసే సమయం ఆసన్నమయ్యింది. పోలీసులు బలాల్‌ని తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఉరికొయ్య వద్ద అతడిని నిలబెట్టారు. కళ్లకు గంతలు కట్టారు. మెడకు ఉరి బిగించారు. కొద్ది క్షణాల్లో అతడిని ఉరి తీసేవారే. కానీ అంతలోనే జరిగింది ఓ ఊహించని సంఘటన!
జరిగేది చూడడానికి వచ్చిన జనంలో నుంచి ఓ మహిళ ముందుకు వచ్చింది. ఉరికొయ్య దగ్గరకు వెళ్లి ఓ కుర్చీ కావాలని పోలీసును అడిగింది. అతడు కుర్చీ ఇచ్చాక, దాని మీదకు ఎక్కి బలాల్‌ని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టింది. ‘‘నిన్ను క్షమించాను’’ అనేసి వెళ్లిపోయింది. ఆమె ఎవరో కాదు... బలాల్ చేతిలో హత్యకు గురైన అబ్దుల్లా తల్లి మర్యామ్. కొద్ది రోజుల క్రితం అబ్దుల్లా కలలో కనిపించి, ‘నేను బాగున్నాను, నువ్వు బాధపడొద్దు’ అని తల్లితో చెప్పాడట. దాంతో ఆమె బలాల్‌ని క్షమించింది. అతడిని చంపొద్దు, వదిలేయమంటూ అధికారులను కోరింది. బిడ్డను కోల్పోయి తాను అనుభవించిన కడుపుకోత మరో తల్లికి కలగకూడదని ఆశించింది. తల్లి మనసంటే ఏంటో చూపించింది.
మనల్ని బాధపెట్టినవాళ్లని క్షమించాలంటే గొప్ప మనసుండాలి. ఆ మనసు మర్యామ్‌కి ఉంది. ఆమెకి హ్యాట్సాఫ్!