తిండి గోల ఇలాచీ! అమోఘమైన రుచి...
సువాసనతోబాటు భిన్నమైన రుచిని తేవడంలో ఘనాపాటి యాలక్కాయ. సుగంధ ద్రవ్యాలలో రారాణిగా పేరొందిన ఇలాచీ వంటింటి షెల్ఫ్‌లో లవంగంతో చేరి గాజు సీసాలో ఘాటుగా జోడీ కట్టినా నా రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. యాలకులను ప్రాచీనకాలంలోనే మనవారు సుగంధ ద్రవ్యంగా వాడినట్టు చరిత్ర చెబుతోంది. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరకసంహితలోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలోనూ యాలకుల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది. ‘కార్డమమ్’ అని పిలిచే ఆంగ్లేయులూ యాలకుల పంటలో ఘనాపాటిగానే పేరుతెచ్చుకున్నారు. దీని శాస్త్రీయ నామం ఎలెట్టరియా. మన దేశంలో యాలకుల ఉత్పత్తిలో అగ్రస్థానం సిక్కిం కొట్టేసినప్పటికీ దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండలు యాలకుల జన్మస్థానంగా చెబుతారు.
శ్రీలంక, బర్మా, చైనా, టాంజానియా... ప్రపంచంలో ఎన్ని చోట్ల యాలకులు పండినా, భారతదేశపు యాలకులు అత్యుత్తమమైనవిగా పేర్గాంచాయి. అంతేకాదు ప్రపంచంలో యాలకులను అత్యధికంగా పండించేది మన దేశమే. కుంకుమపువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరున్న యాలకులను గ్రీకులు, రోమన్లు అత్తరు తయారీలో వాడేవారట. అరేబియన్ దేశాలలో యాలకులను కాఫీతోను, మిగిలిన దేశాలలో తేయాకుతోనూ కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయి, కేక్, పేస్ట్రీలలోనే కాదు మన దేశంలో ఘాటైన వంటల్లో మసాలా దినుసుగానూ యాలకులను వాడుతారు. యాలకులను సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడుతారు. అజీర్తి, మలబద్ధకం, అల్సర్లు, ఆస్తమా, జలుబు, సైనస్, కలరా, తలనొప్పి, చెడు శ్వాస.. వంటి ఎన్నో ఆరోగ్యసమస్యలకు యాలకులు దివ్యౌషధం.