పాడకు తీయగా
ఇళయరాజా పాట తియ్యగా ఉంటుంది. బాలూ పాడితే ఇంకా తియ్యగా ఉంటుంది. కానీ, టికెట్టు పెట్టి పాడే వేదికల మీద తన పాటలు అనుమతి లేకుండా పాడేందుకు వీలులేదని ఇళయరాజా బాలూకి నోటీసులు పంపడతో ఈ వ్యవహారం చేదుగా మారింది.
‘మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు... అందాలన్ని పల్లవించి ఆలకించే పాటలు’... ‘ఓ పాప లాలి’ సినిమాలో బాలూ ఉగ్గబట్టి ఒక్క దమ్ములో పాడిన పాట ఇది. గుక్క తిరగనివ్వని పాట. తాజాగా ఇళయరాజా ఇచ్చిన నోటీసు బాలూకు బహుశా ఇలాగే గుక్క పెట్టనివ్వని షాక్ ఇచ్చి ఉండవచ్చు. ‘లాభాపేక్ష కలిగిన కచేరీలలో తన పాటలు పాడటం కాపీరైట్ చట్ట ప్రకారం నేరమనీ కనుక పాడటం ఆపి వేయమని’ ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తన లాయర్ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు ఇచ్చినవాడు స్నేహితుడు. పుచ్చుకున్నవాడూ స్నేహితుడే. అనేక విషయాలలో ఇరువురికీ స్నేహం ఉండవచ్చు. కాని ప్రొఫెషనలిజమ్‌లోకి వచ్చేసరికి బహుశా పంతాలూ పట్టింపులూ కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఇక్కడ అదే జరిగి ఉండవచ్చు.
ఇద్దరూ స్నేహితులు
బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజాల స్నేహం ఇప్పటిది కాదు. 1970ల నుంచి ఉంది. అప్పట్లో దర్శకుడు భారతీరాజా బాలసుబ్రహ్మణ్యం మొదటగా స్నేహితులయ్యారు. తన ప్రాంతానికే చెందిన ఇళయరాజాను భారతీరాజా బాలూకు పరిచయం చేశారు. బాలూకు సొంత ఆర్కెస్ట్రా ఉండేది. అందులో ఇళయరాజాను టీమ్‌మేట్‌గా తీసుకున్నారు బాలూ. 1975లో ఇళయరాజా సంగీతదర్శకుడు అయ్యాక ఆ స్నేహాన్ని మర్చిపోలేదు. తన సంగీత దర్శకత్వంలో దాదాపు అన్ని పాటలూ బాలూ చేతనే పాడించారు. ఇతర గాయకులు పాడింది తక్కువ. బాలూ, ఎస్.జానకి, చిత్రల గళ సంపద ఇళయరాజా స్వర సంపదకు తోడై సంగీత ప్రియులను అలరించింది. అలరిస్తూనే ఉంది.
తకిట తథిమి తందానా...
ఇళయరాజా సంగీతంలో బాలూ పడిన పాటలన్నీ హిట్టే. ఇళయరాజా తొలిరోజుల్లో చేసిన ‘వయసు పిలిచింది’ సినిమాలో ‘మబ్బే మసకేసిందిలే’, ‘ఇలాగే.. ఇలాగే’.... పాటలు ఆదరణ పొందాయి. తమిళం నుంచి డబ్ అయిన ‘ఎర్రగులాబీలు’ వంటి సినిమాల నుంచి కూడా బాలూ పాడిన ‘ఎదలో తొలి వలపే’ పెద్ద హిట్. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై ఇళయరాజా చేసిన సినిమాలు బాలు గొంతులో హుషారు రేపాయి. ‘సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది’ (అభిలాష), ‘ఇందువదన కుందరదన’ (ఛాలెంజ్), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘సరిగమ పదనిస రస నస’ (మరణ మృదంగం)... ఇవన్నీ హిట్.
అలాగే దర్శకుడు వంశీ ఇళయరాజా పాటలతోనే ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బాలూకు మరిన్ని మంచి పాటలు దక్కాయి. ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ’ (లేడీస్ టైలర్), ‘సుమం ప్రతి సుమం సుమం’... ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘నిరంతరమూ వసంతములే’, ‘వయ్యారి గోదారమ్మ వొళ్లంత ఎందుకమ్మ’ (ప్రేమించు పెళ్లాడు) ఇప్పటికీ ప్రతి కచేరీలో వినిపిస్తుంటాయి. ఇక కె.విశ్వనాథ్ సినిమాల్లో ఇళయరాజా– బాలూల పాటలు ప్రత్యేకం. ‘తకిట తథిమి తకిట తథిమి తందానా’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ (స్వాతిముత్యం) పాటలను ప్రేక్షకులు ఎలా మర్చిపోగలరు.
బాలూ కచ్చేరీలు...
సినీ గాయకుడు కాక మునుపు నుంచే బాలసుబ్రహ్మణ్యం కచ్చేరీలు చేసేవారు. నెల్లూరు చుట్టపక్కల అనేక ప్రాంతాలలో సినీ పాటలు పాడేవారు. ఇప్పటికీ పాడుతున్నారు. పాత కొత్త పాటలు బాలూయే కాదు ఏ ఆర్కెస్ట్రా అయినా పాడటం మనవారికి ఆనవాయితీగా వస్తోంది. ఒక్క ఇళయరాజా పాటలే కాదు చక్రవర్తి, కె.వి.మహదేవన్‌ల మొదలు నేటి కీరవాణి, ఏ.ఆర్.రహమాన్‌ల వరకు ఏ సంగీతకర్త చేసిన పాట అయినా ఏ ఆర్కెస్ట్రా అయినా ఎవరి అనుమతి అక్కర్లేకుండా పాడటం మన దేశంలో ముందు నుంచీ ఉంది. కాని ఈ తాజా నోటీసుల వల్ల ఒక అయోమయం ఏర్పడినట్టయ్యింది
కాపీరైట్...
సంగీతరంగంలో కాపీరైట్‌దీ, రాయల్టీది కీలకమైన పాత్ర. ఒక పాటను ఒక ఆడియో కంపెనీ కొనుక్కుంటే దాని మీద వచ్చే రాబడిలో సంగీతదర్శకుడికీ, గాయనీ గాయకులకీ రాయల్టీ ఇవాల్సి ఉంటుంది. హెచ్‌ఎంవి వంటి పెద్ద సంస్థలు ఈ రాయల్టీని చెల్లించేవి. గతంలో మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్‌లు ఈ రాయల్టీ విషయంలో ఒక కాంట్రవర్సీని లేపారు. ఒకసారి పాట పాడేశాక, దానికి రెమ్యునరేషన్ పుచ్చుకున్నాక ఆ తర్వాత రాయల్టీ అక్కర్లేదు అనేది రఫీ వాదన అయితే రాయల్టీ ఉండాలి అనేది లతా వాదన. దీని వల్ల కొంతకాలం పాటు వారిద్దరు కలిసి పాడలేదు కూడా. పాత పాటలను కొత్త సినిమాలలో వాడుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. కొన్ని పాత పాటలను ఉపయోగించి యాడ్స్ చేయడం చూస్తుంటాము. వాళ్లు కూడా ఆ పాటలను సొంతదారుల నుంచి కొనుక్కుని ఉపయోగించాల్సిందే. ఏవో మూడు సెకన్లు ఆరు సెకన్లకు అనుమతులు అక్కర్లేదు కాని మొత్తం పాటను ఉపయోగించాలంటే డబ్బు కట్టక తప్పదు. ఇప్పుడు ఇళయరాజా చెబుతున్నది కూడా అదే.
లాభాపేక్ష కలిగిన కచ్చేరీలు..
బాలూ ఇటీవల బాలూఎట్‌ఫిఫ్టీ పేర ప్రపంచ యాత్ర చేస్తున్నారు. దేశదేశాలలో కచ్చేరీలు ఇస్తున్నారు. ఆ కచ్చేరీలలో అందరి పాటలను పాడుతున్నారు. ఇళయరాజా ఏమంటారంటే ఇవన్నీ ఏ ప్రజాహిత కార్యక్రమం కోసమో ఉచితంగానో చేయడం లేదు కదా... కనుక వీటిలో నేను చేసిన పాటలు మీరు పాడి డబ్బు సంపాదించుకోవడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా ఎంతో హుందాగా ఇలాంటి చట్టం ఉందని తనకు తెలియదనీ ఇక మీదట చట్టాన్ని గౌరవించి ఇళయరాజా పాటలు పాడనని తన ఫేస్‌బుక్ ద్వారా తెలియచేశారు. అయితే ఇళయరాజా కేవలం ఇది బాలూ కోసమే చేయలేదని మనం గుర్తు చేసుకోవాలి. సంవత్సరం క్రితం ఆయన అనేక ఎఫ్‌ఎం చానెల్స్, మ్యూజిక్ చానల్స్‌కు కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారు. చెప్పా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా తన బాణీలు, అంతర స్వరాలు ఉచితంగా వాడుకుంటున్నారనీ అనుమతి లేకుండా అలాంటి పనులు చేయవద్దనీ ఆయన నోటీసులు ఇచ్చారు. బాలూకు నోటీసు అందుకు కొనసాగింపే.
రెండు వైపులా...
ఇళయరాజా పాటలు బాలూ గొంతున వినాలి. వినకుండా ఎలా? కచ్చేరీలలో బాలూ ఇళయరాజా పాటలు పాడకుంటే అందం ఉండదు. ప్రజలలోకి వచ్చిన పాటను బాలూ పాడటంలో తప్పు లేదని ఒక వర్గం అంటుంటే తన మేధో హక్కులను కాపాడుకునేందుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడం తప్పు కాదని మరో వర్గం అంటోంది. ఇద్దరి వైపూ పాయింట్ ఉండొచ్చు. సంగీత అభిమానులకు ఇద్దరూ కావాలి. దీనికి కాపీరైట్ చట్టం అడ్డు కాకూడదు. ఇళయరాజా పాటలు పాడటానికి ఆయన అనుమతి స్నేహపూర్వకంగానో ఆర్థికపరంగానో తీసుకుని బాలూ ఇళయరాజా పాటలు పాడాలి... ఇళయరాజా కూడా పట్టువిడుపులు పాటించి తన పాటను బాలూ నోట ముందుకు తీసుకెళ్లాలి అని ఎక్కువమంది అభిమానులు కోరుకుంటున్నారు.
నందికొండ వాగుల్లోన....
ఇళయరాజా బాలసుబ్రమణ్యం గొంతుతో అనేక ప్రయోగాలు చేశారు. బాలు కూడా ఆ ప్రయోగాలను సవాలుగా తీసుకుని స్వాగతించేవారు. ‘గీతాంజలి’ సినిమాలో ‘నందికొండ వాగుల్లోన’ పాట భూతం పాడినట్టు బొంగురుగా పాడాలని ఇళయరాజా ఆశించి రికార్డు చేసిన పాటను తిరిగి రికార్డ్ చేయగా బాలూ ఆయన ఆశించినట్టుగా పాడి మెప్పించారు. దాని వల్ల వారం రోజుల పాటు బాలు ఇతర పాటలు రికార్డ్ చేయలేకపోయారని అంటారు. అలాగే ‘ఇంద్రుడు–చంద్రుడు’ సినిమాలో ‘నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు’ పాట కోసం బాలు కమల్‌హాసన్‌లాగా బొంగురు గొంతుతో పాడి ఆ ప్రయోగాన్ని ఇళయరాజా ఆధ్వర్యంలో సక్సెస్ చేశారు. ఇటీవల ‘శ్రీరామరాజ్యం’లో ఇళయరాజా కాంబినేషన్‌లో పాడిన ‘జగదానంద కారకా’ పెద్ద హిట్. ఈ జోడీలో మరిన్ని పాటలు రావాల్సి ఉంది. మరి ఈ నోటీసు దరిమిలా ఏమవుతుందో చూడాలి!
ఈ రాయల్టీ గొడవలు ముంబైలో, చెన్నైలో చాలా ఎక్కువ. ఇళయరాజాగారి పాటలు లేకుండా ప్రపంచంలో ఎక్కడా తమిళ, తెలుగు సంగీత విభావరిలు జరగడం లేదు. ఇప్పుడు బాలుగారికి మాత్రమే నోటీసులు వచ్చాయి. మిగతా గాయనీగాయకులు అందరికీ భవిష్యత్తులో నోటీసులు వెళతాయా? ఏమో చూడాలి మరి! రాజాగారు చేసినట్టు మిగతా సంగీత దర్శకులు కూడా చేస్తే గాయనీగాయకుల భవిష్యత్తు అంధకారమే.
– గాయని సునీత
సమస్య కనిపించేంత చిన్నదేం కాదు. దాని మూలాలు వేరే ఉన్నాయి. మన కళ్ల ముందు బాలు, ఇళయరాజాలు కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. రాజాగారి పాట అయినప్పటికీ గేయ రచయితలు, నిర్మాతలకూ వాటా ఉంటుంది. వాళ్ల అనుమతి కూడా తీసుకోవాలి కదా. అలాగే, గాయకులకు కూడా ఏవో హక్కులు ఉన్నాయి. ఎవరూ హర్ట్ కాకుండా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అభిమానులతో పాటు నేను కూడా కోరుకుంటున్నా.
– రామజోగయ్య శాస్త్రి
సంగీతం అనగానే నాకు గుర్తొచ్చే రెండు పేర్లు... ఇళయరాజా, ఎస్పీబీ. ఈ లీగల్ గొడవలు వీలైనంత త్వరగా సమసిపోయి వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్లిద్దరూ లెజెండ్స్. నా చిన్నప్పట్నుంచి ఒకరు వాయిస్తుంటే.. మరొకరు పాడుతుంటే... చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశా. ఆ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయి. వీరిద్దరూ 40 ఏళ్లుగా అత్యంత ఆత్మీయులు. ఇప్పుడు ఇద్దరూ 70 ఏళ్ల వయసు దాటారు. ఈ వయసులో ఈ ఎడబాటు ఎందుకు? ఇద్దరి అభిమానులు ఎంతో బాధపడుతున్నారు.
– నాగూర్‌బాబు
వనీవన న్యాయమని ఒకటుంది. అదేంటంటే... అడవిలో జంతువులకు చెట్టూపుట్టలు రక్ష. చెట్టూపుట్టలకు జంతువులు రక్ష. ఒకరికి మరొకరు తోడు లేకపోతే మనుగడ కష్టమని దీనర్థం. రెండూ కలసి ఉంటేనే ఆ గొప్పదనం. రాజాగారి బాణీకి బాలుగారు గొంతుతో సహాయం చేశారు. బాలుగారి గొంతుకు రాజాగారు తన బాణీతో న్యాయం చేశారు. ఇప్పుడిలాంటి సమస్య రావడం బాధాగా ఉంది. పాలు–నీళ్లను వేరు చేయమంటే ఏమని వేరు చేస్తాం చెప్పండి! అలాగే, వారిద్దరి పాట కూడా!
– ఎం.ఎం. శ్రీలేఖ
కాపీరైట్ యాక్ట్ 2012 ప్రకారం ఒకపాట రాయల్టీలో యాభై శాతం నిర్మాతకి, 25 శాతం పాట రచయితకి, 25 శాతం స్వరకర్తకి దక్కాలి. పాటను కమర్షియల్ వేదికల మీద ఉపయోగిస్తే న్యాయపరంగా ఈ రాయల్టీ ఇవ్వాల్సిందే. అందుకనే ఇళయరాజా ఈ నోటీసు ఇచ్చి ఉంటారు. ఏమైనా రెండు సంగీత శిఖరాల మధ్య వచ్చిన ఈ అభిప్రాయభేద మేఘాలు కరిగిపోవాలని కోరుకుంటున్నా.
– అనంత్ శ్రీరామ్
ఏమైనా ఇది టీ కప్పులో తుఫాన్ కావచ్చు. లేదంటే హటాత్తుగా జారిన అపస్వరం కావచ్చు. బాలూ ఇళయరాజాల స్నేహం, వారి యుగళగీతం కొనసాగాలని కోరుకుందాం.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి