ఆగమశాస్త్రానికి లోబడి కైంకర్యాలు సాగితేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. భక్తులపై తన దివ్యకాంతులు ప్రసరింపజేస్తారు. అందుకే స్వామి కైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూడాలి. దానితో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ పద్ధతిగా జరిపించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే స్వామివారి అనుగ్రహం వుంటే అన్నీ వాటంతట అవే జరుగుతాయి అంటారు అనిల్‌కుమార్ సింఘాల్. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అనిల్‌కుమార్ సింఘాల్ అనుభవాలు, అభిప్రాయాలివి ...
∙టీటీడీ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టడం మీకు ఎలా అనిపిస్తోంది.
ధర్మకర్తల మండలిలో సభ్యకార్యదర్శిగా కొంతమేర మాత్రమే సేవ చేయగలిగేవాణ్ణి. కానీ ఇప్పుడు పూర్తికాలం భగవంతుడికి, భక్తులకు సేవ చేసే అదృష్టం కలిగింది.
∙తిరుమలకు మీరు ఈవోగా రావాలనుకున్నారా?
తిరుమల ఈవోగా వస్తే అదృష్టమని భావించాను. ఎప్పుడూ ఎవరిని అడగలేదు. భగవంతుడి ఆశీర్వాదంతో తిరుమలకు రావాలని మనస్సులో ఎప్పుడూ వుండేది. అదృష్టవశాత్తు అది ఇప్పుడు నాకు దక్కింది.చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నేనే మొదటిగా రావడం చాలా ఆనందం. చిత్తూరు జిల్లాలో జేసీగా పనిచేశాను. చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అపారమైన భక్తి. ఆ భక్తే నన్ను ఇలా నడిపించింది.
∙మీరు వారం వారం తల నీలాలు ఇవ్వడం మొక్కుబడేనా లేదా తిరుమలకు వచ్చారని ఇస్తున్నారా?
మొదటి నుంచే స్వామివారంటే అపారమైన భక్తి. ఏడాదికి నాలుగుసార్లు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నాను. వచ్చిన ప్రతిసారీ తలనీలాలు సమర్పిస్తా. తిరుమలకు ఈవోగా వచ్చినప్పటి నుంచి ప్రతి శుక్రవారం అభిషేక దర్శనంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శిస్తున్నా. అందులో భాగంగా ముందురోజు గురువారం స్వామివారికి తలనీలాలు ఇస్తుంటాను. ఇలా ప్రతివారం ఇవ్వడమే ఆనవాయితీగా పెట్టుకున్నా.
∙సాధారణ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీవారి ఆలయంలో క్యూలైన్లను క్రమబద్ధీకరించి తోపులాట లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. కాలినడక భక్తుల కోసం అలిపిరి మార్గంలో 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు మంజూరు చేసి నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. సర్వదర్శనం భక్తులు ఎక్కువసేపు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టైమ్ స్లాట్ టోకెన్లు ప్రవేశపెట్టాం. తిరుమలలో కౌస్తుభం, సీఆర్‌వో, నందకం ప్రాంతాల్లో, తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయాలు, రైల్వేస్టేష¯Œ వెనుకవైపు గల చౌల్ట్రీలు, ఆర్‌టీసీ బస్టాండు, అలిపిరి బస్టాండ్ వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకె¯Œ కౌంటర్లు ఉన్నాయి.
∙దేవస్థానంలో మీ అనుభవం ఎలాంటిది?
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ. పాలనలో పారదర్శకత వుంది. ఏటా 450కి పైగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పటికే కొన్నింటిలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నాను. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యం, ఆ స్వామి లీలలు ప్రత్యక్షంగా అనుభూతి చెందాను. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థను నడిపించే బాధ్యతను శ్రీవారే నాకు అప్పగించారనిపిస్తోంది.
∙ధర్మకర్తల మండలి, ధార్మికసంస్థకు వారధిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టానికి లోబడి టీటీడీ పనిచేస్తోంది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యుల అభిప్రాయాలను స్వీకరిస్తాను. అవసరమైతే ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా తీసుకుంటాను.
∙మీరు ఎంచుకున్న ప్రాధాన్యతాంశాలేమిటి?
ప్రాధాన్యత అంశాలనడం కంటే వాటిని బాధ్యతలనడం సరైనమాట. తిరుమల ఆలయంలోను, ఇతర అనుబంధ ఆలయాల్లోను వందల సంవత్సరాలుగా కైంకర్యాలన్నీ నిర్దిష్టంగా జరుగుతున్నాయి. ఈ పూజాకైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూస్తాను. ఆగమశాస్త్ర నిబంధనలు విధిగా అమలు జరిపిస్తా. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, బస సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, ప్రతి భక్తుడి ఆకలే అర్హతగా రుచికరమైన భోజన సదుపాయాలు కల్పించేందుకు సంయుక్తంగా కృషి చేస్తా. సప్తగిరుల ప్రకృతి సంపదను పరిరక్షించేందుకు సభ్యులందరినీ కలుపుకుని పనిచేస్తా. ప్రతి భక్తుడు తిరుమల కొండపై కాలుష్య రహిత పదార్థాలు వాడే విధంగా ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపడతాను. భక్తుల భద్రతపై కూడా దృష్టి పెడుతున్నాం. అలాగే ధర్మప్రచారం, వేద పరిరక్షణ మరింత ముందుకు తీసుకెళతాం. శ్రీనివాస వైభవాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి భక్తితత్వాన్ని, «ధార్మిక చింతనను విస్తరిస్తూనే శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటుతాం.
∙సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు మీ దగ్గర కొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ఉన్న నిబంధనలు సమర్థవంతంగా అమలు పరిస్తే చాలు. కొత్తవి అవసరం లేదని నా అభిప్రాయం. టీమ్ మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్‌తో మరింత సమర్థవంతంగా దర్శన సౌలభ్యం కల్పించే ప్రయత్నం చేయాలి. ఆధునిక సాంకేతిక ప్రయోగాలకు ఆలయ ఆగమాలు అనుమతించవు. కాబట్టి అందుబాటులో వున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఆ పని చేయాలి. ఓవర్ బ్రిడ్జిని కొంచెం విశాలంగా చేస్తున్నాం. క్యూలో వుండే భక్తులకు ధార్మిక కథాకాలక్షేపాలు, దైవస్మరణకు అనుకూల వాతావరణం కల్పించడం, పిల్లలకు పాలు అందించడం, అన్న ప్రసాదాలు అందించడం వంటివి చేయాలి. అయితే దర్శన విషయంలో అందే ఫిర్యాదులు భక్తుల నుంచా, దళారుల నుంచా అన్నది కూడా అధ్యయనం చేయాల్సి వుంది.
∙బస, దర్శనం ఇబ్బందుల్ని తగ్గించడానికి రోజులో ఇంతమందికే దర్శనానికి అనుమతించాలన్న ప్రతిపాదన సంగతేమైంది?
దైవదర్శనం కోసం వచ్చే భక్తులను కట్టడి చేయడం సరికాదు. అందుకే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టం. కాబట్టి శక్తి వంచన లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే మా ముఖ్య విధి.భక్తులు వేచి వుండే సమయాన్ని తగ్గించి, వారిని ఆయా భాషల్లో ఆత్మీయంగా పలుకరించే ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. రాబోయే 20 సంవత్సరాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి అందుకు తగ్గ ఆచరణాత్మక ప్రణాళికలను ఇప్పుడే రూపొందించాల్సిన అవసరం వుంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్ కంటే ఒక ఆచరణాత్మక మేనేజ్‌మెంట్ రూపొందించడం ముఖ్యం.
∙ నేత్ర ద్వారాలు (వెండివాకిలికి అటు ఇటుగా ప్రత్యేక దర్శనాలు, సన్నిధిలో రాములవారి మేడ నుంచి వైకుంఠ ద్వారం ప్రవేశం వరకు కొత్తద్వారం) తెరవాలని కొందరు, వద్దని మరి కొందరు అంటున్నారు..?
ఇది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం. కట్టడాల భద్రత పరిశీలించాలి, çపరీక్షించాలి, పరిరక్షించాలి, గతంలో తిరుమల ఆలయ తరహాలో తిరుపతి అలిపిరిలో నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలోని మూవింగ్ ప్లాట్‌ఫారం ఏర్పాటు కోసం (కదిలే తివాచీ) పరిశీలించినా సరైన పరిష్కారం దొరకలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. దీనిపై గతంలో ఉన్న నివేదికలు పరిశీలించాలి. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, ఈ వ్యవస్థపై పట్టు వున్న రిటైర్డ్ అధికారులను సంప్రదించాల్సిన అవసరం వుంది.
∙టీటీడీ కొత్త ఈవోగా పరిపాలనలో సరికొత్త సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా?
ఎందరో ఐఏఎస్ అధికారులు స్వామి సేవలో, ఆలయ పాలనలో వినూత్న సంస్కరణలు చేశారు. వారందరి కృషి ఫలితంగానే సంస్థ మహోన్నత స్థానంలో వుంది. ప్రస్తుతమున్న ప్రణాళికలు నిర్వహించడమే పెద్ద పని. కానీ కార్యాచరణలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతాం. అధికార వికేంద్రీకరణతో క్షేత్రస్థాయిలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మార్గదర్శకంగా వుంటాం.
∙పాలకులు మారిన ప్రతిసారీ రకరకాలుగా దర్శనాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల నిత్య కైంకర్యాలకు కోతపడుతోందని మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు ఆవేదన చెందుతున్నారు. దీనికి మీరేమంటారు?
స్వామి కైంకర్యాల విషయంలో ఆగమ సలహా మండలి సూచనలను పాటిస్తున్నాం. పవళింపు సేవ వరకు కచ్చితమైన సమయాన్నే పాటిస్తున్నాం. స్వామివారి కైంకర్యాలు, ఆరాధనలన్నీ సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పీఠాధిపతులు, మఠాధిపతులు, అర్చకుల సలహాలను వీలైనంత వరకు అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. సంప్రదాయంగా, ఆగమోక్తంగా జరుగుతున్న నిత్యకైంకర్యాలను కుదించే ప్రయత్నాలు జరగవు. దీనికి కొనసాగింపుగానే రాత్రివేళల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశాం. ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించాం. ప్రస్తుతం అమలవుతున్న దర్శనాలు, క్యూలైన్లపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఏ చిన్న అవకాశం వచ్చినా సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యత ఇస్తాం.
∙గోసంరక్షణ అంశంలో టీటీడీ అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఏవిధంగా అమలు చేయబోతున్నారు?
గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. అందుకు అనుగుణంగా జాతీయస్థాయి సదస్సు తిరుపతిలో నిర్వహించాలని భావిస్తున్నాం. గో సంరక్షణకు పురాతన, శాస్త్రీయ పద్ధతిలో జరిపితే కలిగే ఉపయోగాలు, ఆర్థిక వెసులుబాటు ఔత్సాహికులకు తెలియజేసే ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తాం. శ్రీవేంకటేశ్వర డెయిరీలో ఒక ప్రదర్శనశాలను ఏర్పరచి, అందులో భారతీయ సంతతి గోవులను ఉంచి వాటి విశిష్టత, వాటి సంరక్షణ ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలను తెలియజే యాలనుకుంటున్నాం. అవసరమైతే ఇందుకోసం రాష్ట్ర దేవాదాయశాఖ సహకారం కూడా తీసుకుంటాం.
– లక్ష్మీకాంత్, తిరుమల
సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యత
Published Sun, Oct 7 2018 1:43 AM | Last Updated on Sun, Oct 7 2018 1:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment