అనాదిగా వస్తున్న ఆహారపు దినుసులలో ఎన్నో పంటలకు కాణాచి మన భారతదేశం. వాటిలో ఒకటి సెనగలు. వీటిని సంస్కృతంలో ‘చణకః’ అంటారు. దీని విశిష్టతను, ప్రయోజనాలను ఆయుర్వేదం కూలంకషంగా వివరించింది. దీనికున్న మరి కొన్ని ముఖ్య పర్యాయ పదాలు: ‘‘హరిమంథ, సకలప్రియ, జీవన, కంచుకీ, బాల భోజ్య’’ మొదలైనవి. హిందీలో చెన్నా, ఛోలే అంటారు. దీనికి బెంగాల్ గ్రామ్, చిక్ పీజ్ అనేవి వ్యవహారిక ఆంగ్లపదాలు. వృక్షశాస్త్రంలో సీసెర్ యెరిటీనమ్ అంటారు.
ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో కనిపిస్తుంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులలో ఉంటాయి. ఈ పంటకు తేమ లేని శీతల వాతావరణం పెట్టింది పేరు. పూర్తిగా పక్వం కాకుండానే వేళ్లతో బాటు మొక్కల్ని పీకి బజారులో అమ్మడం, కాయల నుండి పచ్చి సెనగల్ని వేరు చేసి తినటం మనం చూస్తూనే ఉంటాం.
గుణధర్మాలు (భావప్రకాశ సంహితా): ‘‘చణకః శీతలో రూక్షః పిత్త రక్త కఫాపహః‘ లఘుః కషాయో విష్టంభీ వాతలో జ్వర నాశనః‘‘ ఆర్ద్రో అతికోమలో రుచ్యః పిత్త శుక్ర హరోః‘ హిమః కషాయో వాతలో గ్రాహా కఫపిత్తహరో లఘుః‘‘
ఎండబెట్టబడి, శుష్కంగా ఉన్నవి రూక్ష (గట్టిగా) గుణం కలిగి, కొంచెం వగరుగా ఉంటాయి. నానబెట్టిన అనంతరం మృదువుగా రుచికరంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై చలవ చేస్తాయి (లఘు, శీతలం). వాతాన్ని పెంచుతాయి. పిత్తకఫాలను హరిస్తాయి. కనుక పొట్టలో వాయువు చేరి ఉబ్బరించినట్లుండి, మలబంధం కలుగ చేస్తుంది. శరీరానికి చలవ చేసి రక్తస్రావాలను అరికడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా విరేచనాలైతే అవి అరికట్టబడతాయి (గ్రాహి). శుక్రహరం. నానబెట్టిన పిదప సాతాళించిన (వేడి చేసిన) సెనగలు బలకరం.
ఔషధ ప్రయోజనాలు:
సెనగలతో చేసిన సూప్ (యూషం) తీవ్ర జ్వరాన్ని, శరీరంలో మంటనీ తగ్గిస్తుంది. సెనగ పిండికి చేదు పొట్ల (పటోల) ఆకులను చేర్చి చేసిన సూప్ కడుపు నొప్పి, కడుపులోని పుళ్లు (అల్సర్లు), మంటను తగ్గిస్తుంది. ధనియాలు, వట్టి వేళ్లు, సెనగలతో చేసిన సూప్ వాంతులను తగ్గిస్తుంది. శరీర దాహాన్ని (మంటను) అరికడుతుంది. స్నుïß æక్షీరం (బ్రహ్మ జెముడు జాతికి చెందిన స్నుహీ అనబడే మొక్క యొక్క పాలు) లో నానబెట్టిన సెనగల్ని వేడి చేసి తింటే తీక్ష›్ణవిరేచనంగా పనిచేసి కోష్ఠ (కడుపు లోపలి భాగం) శుద్ధి చేస్తుంది.
ఆధునిక జీవ రసాయన శాస్త్రం రీత్యా:
సెనగలలో 55 శాతం పిండిపదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు, 5 శాతం కొవ్వులు ఉంటాయి. ఆహారపు పీచు అధికంగా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ కూడా అధికం. సోడియం, పొటాషియం... ఈ రెండూ శూన్యం. ఇందులో ‘ఎ’ విటమిను ఉండదు. ‘సి’ కొంచెం ఉంటుంది. ‘కె’ మరియు ‘ఫొలేట్సు’ బాగానే ఉంటాయి. సెలీనియం, కోలిన్ ఉంటాయి.
నిద్రాజనకమే కాకుండా, బుద్ధి వికాసం, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం, నొప్పులు, వాపులు తగ్గించే గుణం కూడా ఉన్నాయి. ఎముకల పుష్టికి పెట్టింది పేరు. లివరు జబ్బులు, క్యాన్సర్లలో కూడా గుణకారి. మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్థులు కూడా తినొచ్చు. సెనగలు ఆ వ్యాధుల్ని పెంచవు.
గుర్తు ఉంచుకోవలసిన సారాంశం నానబెట్టిన సెనగలు నాణ్యమోయి మెదడుకు ఎముక పుష్టికి మేలు చేయు చలువ చేయుచు దేహమున్ శాంతపరచు సూపు తీరున సేవింప సులభమౌను
మలము బంధించు నిదియని మరువకోయి శుంఠి కలుపంగ కోష్ఠమ్ము శుద్ధియౌను వీర్యహరమంచు మదిలోన బెంగయేలపాలు బాదము ఖర్జూర పాయసమ్ము పట్టు పట్టంగ పరువమ్ము పరుగులెత్తు.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment