ముజఫర్‌నగర్ విషయంలో మూగబోయిందెందుకు?
ఢిల్లీలో ‘నిర్భయ’పై దురాగతానికి పాల్పడిన దోషులకు శిక్ష పడిందని ఊరటచెందినంత సేపు పట్టలేదు.. అలాంటి కొన్ని వందల, వేలమంది బాధితురాళ్లు మన కళ్ల ముందు నిలవడానికి, నిర్భయ విషయంలో జాతి మొత్తం ఒకటిగా నిలిచింది. దోషులకు శిక్ష పడాలని ఉద్యమించింది. పూజలు చేసింది, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసింది, పోరాడింది. మరి మనుషులు రెండుగా విడిపోయిన సందర్భాల్లో...? ముజఫర్‌నగర్‌నే తీసుకోండి.. అత్యాచార కాండలను గురించి భారతీయులు ఎందుకు ఆ స్థాయిలో స్పందించడం లేదు? ఒక్క అమ్మాయిపై జరిగిన అత్యాచారంపై అంతగా స్పందించిన భారతావని, ముజఫర్‌నగర్ బాధితురాళ్ల విషయంలో ఎందుకు మూగబోయింది? అని ప్రశ్నిస్తున్నారు సమాజసేవకులు. ఇలాంటి కల్లోలం చెలరేగిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ పట్టణ ంలో ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్లు, సంఘసేవకులు పర్యటిస్తున్నారు.
దేశ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో కలహాల ముసుగులోజరిగిన అత్యాచారకాండలను వెలుగులోకి వచ్చే పనిలో పడ్డారు వీళ్లు. అల్లర్లు చెలరేగడానికి కారణం ఏమైనా, ఎవరైనా.. బాధితులు మాత్రం అమాయకమైన మహిళలు, అభం శుభం తెలియని వాళ్లు. ఈ అత్యాచారకాండను వేరే కోణం నుంచి కాక లింగ వివక్ష రూపంలో చూడాల్సి ఉంటుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ‘‘కల్లోలాల్లో ప్రధానమైన బాధితురాలు మహిళ.. పిల్లలను కళ్ల ముందే హత్య చేస్తారు, అడ్డుపడటానికి ప్రయత్నించిన భర్తను చంపుతారు, ఇళ్లు తగలబెడతారు, ఆమె కళ్ల ముందే వినాశనాన్ని సృష్టించి, గుండె పగిలేలా రోదిస్తున్న ఆమెపై అంతిమంగా అత్యాచారాన్ని మొదలుపెడతారు.
అత్యంత కిరాతకంగా ప్రవర్తించి, వీలైతే చంపి, లేకపోతే బతికున్న శవంగా మార్చి వదిలిపెడతారు. ముజఫర్ నగర్‌లో జరిగింది కూడా ఇదే. అలా సర్వం కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిన మహిళలు ఎంతో మంది మాకు కనిపించారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి స్థితి ఎలాంటి మనిషినైనా చలింపజేస్తుంది కానీ, మౌఢ్యంలో కూరుకుపోయిన కొంతమందిని కదిలించలేకపోయింది. బాధితురాలు ఏ వర్గానికి చెందినది అనేది విషయం కాదు. ఆమెపై జరిగిన దురాగతానికి ఓదార్పును ఇచ్చేందుకు కూడా సమయం తీసుకోవడం లేదు సమాజం.
ఈ చిన్న పట్టణంలోనే అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలను కలిశాం. వారిలో చాలామంది తమపై జరిగిన అకృత్యం గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు... అనేకంటే చేయలేని స్థితిలో ఉన్నారు వాళ్లు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఒకవేళ ఇప్పుడు ఫిర్యాదు చేసినా.. ఆధారాలు దొరికే అవకాశాలేమీ ఉండవని నిపుణులు అంటున్నారు. ఇక్కడ మహిళలపై జరిగిన పాశవిక కాండను కేవలం ప్రతీకారేచ్ఛతో జరిగిన సంఘటనలుగా తీసుకోవడానికి వీల్లేదు. చాలా అత్యాచార కాండల్లో దోషులు ఎదురింటి వారు పక్కింటి వారు అని మాకు అర్థమైంది. తమ పశువాంఛలను చాలా మంది పరిస్థితులను అడ్డుపెట్టుకుని తీర్చుకున్నారు.
ఇలా అత్యాచారానికి గురైన మహిళల్లో చాలా మంది ఇప్పుడు ఇంటిలోంచి బయటకు రావడానికి కూడా ధైర్యం చేయడంలేదు. పోలీసులు ఇప్పటికీ పరిస్థితిని చక్కదిద్దే పనిలోనే ఉన్నారు. వారు బాధితుల వద్దకు చేరుకుని విచారణ జరిపేది ఎప్పుడు? చట్టం నాలుగు పాదాల మీద నడిచినప్పుడే దోషులకు శిక్ష పడటం గగనమైంది. మరి మతరూపం సంతరించుకున్న ఈ పరిస్థితుల్లో చట్టం వికలాంగురాలు అవుతుంది. అలాంటప్పుడు ఈ బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది?’’ అని ముజఫర్ నగర్‌లో పర్యటించిన మహిళా సంఘాల కార్యకర్తలు, ఇగ్నూ మహిళా ప్రొఫెసర్‌లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఉందా మరి?