ఇన్‌ఫర్‌మేషన్ థెరపీ!
కొందరు పేషెంట్లు సకారణంగానో, అకారణంగానో వైద్యులను విమర్శిస్తుంటారు. మరోవైపు వైద్యులేమో - ‘‘నిజాలు తెలుసుకోకుండా మమ్మల్ని బలిపశువును చేస్తున్నారు’’ అని వాపోతారు. ఏది ఏమైనా మునుపటితో పోల్చితే... డాక్టర్లు, వైద్యుల మధ్య ఒకింత దూరం పెరుగుతోంది. దీన్ని నివారించడానికి నడుం కట్టారు ముంబాయి డాక్టర్ అనిరుద్ధ మల్పని. ‘ఇన్‌ఫర్‌మేషన్ థెరపీ’ పేరుతో వైద్యానికి సంబంధించి, రోగులకు అవగాహన కలిగించే రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. పేషెంట్లు తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాల గురించి ఈ సమావేశాల్లో చెప్పడంతో పాటు వైద్యులపై ఉండే అపోహలను తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
‘నాడి పట్టామా, మందులు రాశామా, ఫీజు తీసుకున్నామా’ తరహా వైద్యులకు కూడా ఆయన హితవచనం చెబుతున్నారు. ‘‘మందు వైద్యమే కాదు... మాట వైద్యం కూడా ముఖ్యమే’’ అనే విషయాన్ని వైద్యులకు, ప్రతి దాన్ని వైద్యుల నిర్లక్ష్యంగా చూడనక్కర్లేదని, వారి పరిమితులు గుర్తించాలని పేషెంట్లకు తన పుస్తకాల ద్వారా గుర్తు చేస్తున్నారు, చెబుతున్నారు. ‘పేషెంట్స్ అడ్వొకెసి-గివింగ్ వాయిస్ టు పేషెంట్’ పేరుతో మల్పని రాసిన పుస్తకంలో పేషెంట్ల హక్కులు, అవసరాల గురించి ప్రస్తావించారు. పేషెంట్లతో సమావేశమై ఎన్నో విషయాలు వివరిస్తున్నారు. పేషెంట్లకు ఉపయోగపడే సమాచారంతో ‘హెల్ప్’ పేరుతో ఒక గ్రంథాలయం నిర్వహించడంతో పాటు ‘ది బెస్ట్ మెడికల్‌కేర్’ పేరుతో ఒక వెబ్ సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.ప్రతి డాక్టర్‌కు తనదైన ఒక వెబ్‌సైట్ ఉండాలని, దాని ద్వారా పేషెంట్లు ఎంతో సమాచారాన్ని తెలుసుకొనే వీలుంటుందని డాక్టర్ మల్పని సూచిస్తున్నారు.