మెట్లు ఎక్కినా దిగినా ఛాతీ బరువెక్కుతుంటే..! | Iniesta climbing stairs chest | Sakshi
Sakshi News home page

మెట్లు ఎక్కినా దిగినా ఛాతీ బరువెక్కుతుంటే..!

Published Sat, Jan 30 2016 2:21 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

మెట్లు ఎక్కినా దిగినా ఛాతీ బరువెక్కుతుంటే..! - Sakshi

మెట్లు ఎక్కినా దిగినా ఛాతీ బరువెక్కుతుంటే..!

కిడ్నీ కౌన్సెలింగ్
 
నా వయస్సు 50 సంవత్సరాలు. ఇటీవల హెల్త్ ప్యాకేజిలో బాడీ చెకప్ చేయిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు చెప్పారు. నిజంగానే రాళ్లు ఉన్నట్టు నిర్ధారించే పరిక్షలు ఏవి? వాటిని నివారించడం ఎలా?
 - భూషణం, విశాఖపట్నం
 
మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్-రే, సీటీ స్కాన్‌ల వంటి పరీక్షలతో కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారణ చేస్తారు.
 
కిడ్నీల్లోని రాళ్లను నివారించండిలా
మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆ జాగ్రత్తలివి... నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది  ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి  ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి  క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

పొటాషియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది  ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ  ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది.
 చికిత్స: ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయి తీయడం (పీసీఎన్‌ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు.
 
-డాక్టర్ ఎన్. ఉపేంద్రకుమార్
యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్, సికింద్రాబాద్
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. నాకు గత మూడేళ్ల నుంచి షుగర్‌ వ్యాధి, హైబీపీ ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పక మందులు వాడుతున్నాను. కానీ గత రెండు వారాల నుంచి మెట్లు ఎక్కినా, త్వరత్వరగా నడిచినా ఛాతీ బరువెక్కుతోంది. ఈ మధ్య భోజనం తర్వాత ఏమాత్రం నడిచినా  ఆయాసంతో పాటు చెమటలు పడుతున్నాయి. అయితే నేను ఏ పనీ లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనికి కారణమేమిటి? వివరించండి.
 - ఎస్.ఆర్.జి., కొత్తగూడెం
 
మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీకు ‘అన్‌స్టేబుల్ యాంజైనా’ అనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఏ చిన్న శారీరక శ్రమకు గురైనా (అంటే నడక, మెట్లు ఎక్కడం మొదలైనవి) గుండె స్పందనల వేగం పెరిగి, గుండెకు మరింత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్, రక్తసరఫరా అవసరమవుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే నార్మల్ వ్యక్తుల్లో మాదిరిగా కాకుండా కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా నొప్పి, ఆయాసం వచ్చి, సేదదీరినప్పుడు గుండె వేగం తగ్గి, మళ్లీ అవి కూడా తగ్గిపోతాయి. అలాగే గుండెమీద అధికంగా భారం పడకుండా ఉండే పరిస్థితిలో (అంటే పడుకున్నా, కూర్చున్నా) ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మీ ‘అన్‌స్టేబుల్ యాంజైనా’ అనే కండిషన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, దగ్గర్లోని గుండెజబ్బుల నిపుణుడిని సంప్రదించండి. యాంజియోగ్రామ్ పరీక్ష చేయించు కొని, రక్తనాళాల్లో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగింపజేసు కోవడం అవసరం. లేకపోతే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
 
- డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్, హైదరాబాద్

 
డయాబెటిక్ కౌన్సెలింగ్
మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా టాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి.
 - సురేఖ, మంచిర్యాల


డయాబెటిస్ (టైప్-2) తొలిదశల్లో అంటే ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతో పాటు అందులో కొవ్వులు, ప్రోటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహారనియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఇన్సులిన్ టాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి.
 
నా వయసు 27. జీటీటీ టెస్ట్‌లో షుగర్ ఉన్నట్లుగా వచ్చింది. కానీ హెచ్‌బీఏ1సీ పరీక్షలో మాత్రం నార్మల్ వచ్చింది. అయినా ప్రస్తుతం నేను గ్లైకోమెట్-500 మి.గ్రా. టాబ్లెట్లు రోజుకు రెండు వాడుతున్నాను. రోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
 - దివ్య, వరంగల్


మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవాలి. దీనికంటే ముందు మీరు మీ డయాబెటిక్ టాబ్లెట్లు ఆపేయండి. వీలైతే డయాబెటిస్‌ను నియంత్రించే ఆహారంతోనే మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ రీనల్ ఫంక్షన్ పరీక్షలు, హెచ్‌బీఏ1సీ పరీక్షలు ఎప్పుడూ నార్మల్‌గా ఉండాలి. ఒకసారి గర్భం ధరించాక అవసరమైన అన్ని పరీక్షలతో పాటు మంచి ఫాలోఅప్ జరుగుతుండాలి. ఒకవేళ గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా చివరి మూడు నెలలలో చక్కెరపాళ్లు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు.
 
డాక్టర్ కె.డి. మోదీ
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement