- డయాలసిస్ కోసం రోగుల వేడుకోలు
- ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నీ ఫుల్
- కొత్తవారి విషయంలో చేతులెత్తేస్తున్న వైనం
విజయవాడ : ‘రెండు కిడ్నీలు పాడయ్యాయి.. మూత్రం రావడం లేదు.. కాళ్లకు నీరొచ్చి వాచిపోతున్నాయి.. శ్వాస కష్టంగా ఉంటోంది.. ప్లీజ్ ఒక్కసారైనా డయాలసిస్ చే సి ప్రాణం కాపాడండి..’ అంటూ కిడ్నీలు చెడిపోయిన రోగులు. వారి బంధువులు నగరంలోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారు ఎంత బతిమిలాడినా ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ వద్ద యూనిట్లన్నీ ఫుల్ అయ్యాయంటూ ఆస్పత్రి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో దేవుడిపై భారం వేస్తున్నారు.
గుణదలకు చెందిన పోతురాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయని నెల రోజుల కిందట వైద్యులు చెప్పారు. ఆయనకు వారంలో రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. దీని కోసం బంధువులు ఆస్పత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా ఎవరూ కరుణిం చని పరిస్థితి నెలకొంది. మూడు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రిలో చేరగా.. ఒకసారి డయాలసిస్ చేసి, ఇక మేం చేయలేమంటూ డిశ్చార్జి చేసి పంపేశారు. కంకిపాడుకు చెందిన నాగేశ్వరరావుదీ అదే పరిస్థితి. ఇలా ప్రభుత్వాస్పత్రితోపాటు ప్రైవేటు ఆస్పత్రులకు నిత్యం ఎంతోమంది రోగులు డయాలసిస్ కోసం తిరుగుతూనే ఉన్నారు. సకాలంలో డయాలసిస్ అందక ఇటీవలి కాలంలో పలువురు రోగులు మృత్యువాత పడినట్లు చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులన్నీ ఫుల్
జిల్లాతోపాటు పరిసర జిల్లాల్లో కిడ్నీ బాధిత రోగులు పెరగడంతో డయాలసిస్‌కు డిమాండ్ ఏర్పడింది. డబ్బు చెల్లించి చికిత్స పొందే రోగులకు డయాలసిస్ విషయంలో ఇబ్బందులు లేనప్పటికీ, ఆరోగ్యశ్రీ రోగులు తిప్పలు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో ప్రభుత్వాస్పత్రితోపాటు సెంటినీ, నాగార్జున, మణిపాల్, ఆయుష్ ఆస్పత్రుల్లో రోజుకు మూడు షిప్టుల్లో 120 నుంచి 140 మందికి డయాలసిస్ చేసే అవకాశం ఉంది. రోగి అవసరాన్ని బట్టి నెలలో నాలుగు నుంచి ఎనిమిదిసార్లు, కొందరికి రెండు, మూడు రోజులకోసారి డయాలసిస్ అవసరమవుతుంది. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో డయాలసిస్ చేయిం చుకునే వారు రెండు వేల మందికి పైగా ఉన్నారు. ఇప్పటికే రిఫరల్ ఆస్పత్రుల్లో పేర్లు నమోదైనవారికి స్లాట్‌లవారీగా చేస్తున్నారు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున అన్ని స్లాట్స్ ఫుల్ అయిపోవడంతో కొత్త రోగులను చేర్చుకునియాలసిస్ చేసే పరిస్థితి లేదు.
డిమాండ్ వాస్తవమే
ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ యూని ట్‌లో ఇప్పటికే అన్ని స్లాట్స్‌లో రోగుల పేర్లు నమోదు కావడంతో కొత్తవారికి అవ కాశం కల్పిం చడం ఇబ్బందిగా మారుతోంది. యూనిట్లు పెంచేందుకు అవసరమైన స్థలం లేక ఉన్నవాటితోనే చేయాల్సివస్తోంది. దీంతో అక్కడకు వచ్చిన వారిని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి ఉంటే.. సర్దుబాటు చేసి అందరికీ చేయాలని చెబుతున్నాం.
-డాక్టర్ జీవన్‌కుమార్, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్