సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో కిడ్నీ సమస్యలతో ఏటా ఏకంగా లక్షమంది మరణిస్తున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ప్రతి ఐదుగురుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారేనని, సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్‌లోని రాయల్ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణలు తెలియజేస్తున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే డయాలసిస్ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. సకాలంలో వైద్యులు జబ్బును గుర్తిస్తే మరణిస్తున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒక్కరిని రక్షించవచ్చని అంటున్నారు.
వైద్యుల ఆకాంక్షను సాకారం చేస్తూ గూగుల్ కంపెనీ ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్’గా పిలిచే ఈ యాప్‌ను ‘గూగుల్స్ డీప్‌మైండ్’గాను అభివర్ణిస్తున్నారు. కిడ్నీ రోగిని గుర్తించడంలో ప్రతి రోగికి ఈ యాప్ ద్వారా రెండు లక్షల రూపాయల ఖర్చు కూడా తగ్గుతుందని ‘నేచర్ డిజిటల్ మెడిసిన్’ పత్రిక తాజా సంచిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞాన పద్ధతుల ద్వారా రోగుల్లో 87.6 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతుంటే గూగుల్ యాప్ ద్వారా 96.7 ఎమర్జెన్సీ కేసులను గుర్తించ గలుగుతున్నారట.
ఆస్పత్రుల్లో ఉంటే ఐటీ టెక్నాలజీని ఉపయోగించి ఓ రోగికి సంబంధించిన సమస్త డేటాను ఈ యాప్ సేకరిస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్త పరీక్షల వివరాలు సేకరించి ఒక చోట నమోదు చేస్తుంది. రోగి రక్తంలో ‘క్రియాటినిన్’ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది. ఈ ‘స్ట్రీమ్స్’ యాప్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని రాయల్ ఫ్రీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ క్రిస్ స్ట్రీతర్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment