‘జనన్య’ మ్యూజిక్ వీడియోలోని సన్నివేశం
ఆడవాళ్లకు ఆనందాన్ని పంచడమే కాదు.. వాళ్ల కష్టాన్ని తుడిచేసే మనసూ మగవాళ్లకు రావాలి!.. ఆ ప్రయత్నాన్నే చూపించాడు ‘జనన్య’ అనే మ్యూజిక్ వీడియోలో .. డైరెక్టర్ అనిల్ ఆనంద్. డెలివరీ తర్వాత తల్లులు అనుభవించే పోస్ట్‌పోర్టమ్ డిప్రెషన్ మీద మగవాళ్లకు అవగాహన కల్పించే మ్యూజిక్ వీడియో అది.. మహిళలను వినడానికి పురుషులు తలవంచారంటే .. సమానత్వం దిశగా ఒక అడుగుపడ్డట్టే కదా! ఈ కథనానికి సందర్భం.. మహిళా దినోత్సవం..
ఆ ఇంట్లో శుభకార్యం. బాలసారె (బారసాల). ఇల్లంతా పూలతో అలంకరించారు. చుట్టాలు, ఆత్మీయులతో సందడిగా ఉంది. ఒక జంట లోపలికి వచ్చింది.. చేతుల్లో చంటిబిడ్డతో. భర్త ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నాడు. కొత్తగా తండ్రైన గర్వం అతని మొహంలో తొణికిసలాడుతోంది. కాని బిడ్డను ఎత్తుకున్న ఆ తల్లే దిగులుగా.. విచారంగా.. ఇంకా చెప్పాలంటే బాధగా కనపడుతోంది. అందరూ నవ్వుతున్నారు కాని ఆమె మొహంలో నవ్వులేదు. తల్లి అయిన ఆనందమూ లేదు. ఆమె భావాలను అక్కడున్న వాళ్లెవరూ గమనించట్లేదు. ఆమె చేతుల్లోంచి బిడ్డను తీసుకున్నారు పెద్దవాళ్లు. వెంటనే ఆ తల్లి బాత్రూమ్‌లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడుస్తోంది. ఎంతసేపటికీ భార్య రాకపోయేసరికి కంగారుగా బాత్రూమ్ దగ్గరకు వెళ్లి భార్యను పిలుస్తూ తలుపు కొట్టాడు. మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆమె. తన భార్య దుఃఖంతో ఉందని అర్థమైంది అతనికి. ఎందుకో మాత్రం అర్థంకాలేదు. అడిగాడు ఆమెను. ఇదీ అని చెప్పలేకపోయింది కాని బిడ్డ పుట్టినప్పటి నుంచి తనలో కలుగుతున్న భావాలను బయటపెట్టింది. అప్పుడు భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు భర్త.
తర్వాత..
వేడుక.. ఇల్లంతా పూలతో అలంకరించారు. చుట్టాలు, ఆత్మీయులతో సందడిగా ఉంది. ఆ తండ్రి ఉల్లాసంగా.. ఉన్నాడు. చేతుల్లో బిడ్డతో.. ఆనందంగా లోపలికి అడుగుపెట్టింది ఆ అమ్మ. బిడ్డను చూసి మురిసిపోతోంది. ప్రపంచంలోని సంతోషమంతా ఆ తల్లి మొహంలోనే తొణికిసలాడుతోంది. ఈ సీన్‌తో ఆ వీడియో అయిపోతుంది. అవును ఇది ఒక మలయాళంలో తీసిన మ్యూజిక్ వీడియో. పేరు.. జనన్య. అంటే మలయాళ భాషలో ‘భూమి’ అని అర్థమట. ఈ వీడియోకు దర్శకత్వం వహించింది ఆనంద్ అనిల్ కుమార్ అనే మలయాళ దర్శకుడు. మలయాళంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్, అండర్‌వరల్డ్ అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
‘జనన్య’ మ్యూజిక్ వీడియో టీమ్
జనన్య ఎందుకు?
అనిల్ ఆనంద్ భార్య సోనీ సునీల్.. తన స్నేహితురాలు అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి భర్తతో చెప్పింది చాలాసార్లు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాకుండా సొంతంగా ఏదైనా మ్యూజిక్ వీడియో చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సోనీ తన భర్త అనిల్‌కు సలహా ఇచ్చింది.. ‘దేనిమీదో ఎందుకు? నా ఫ్రెండ్ ఎక్స్‌పీరియెన్స్‌నే పాటగా మలిచి.. సంగీతం సమకూర్చి.. వీడియో తీయండి. పైగా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ మీద ముందు అవగాహన కావల్సింది పురుషులకే. అప్పుడే భార్యల మానసిక స్థితిని అర్థం చేసుకొని ఆ సమస్యనుంచి వాళ్లు బయటపడేలా సహాయం చేయగలరు’ అని. భార్య సూచన నచ్చింది అనిల్ ఆనంద్‌కు. వెంటనే పని మొదలుపెట్టాడు. ‘జనన్య’గా మ్యూజిక్ వీడియోను రూపొందించాడు. ఇప్పుడు అది యూట్యూబ్‌లో పెద్ద హిట్. ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అనేది నిజంగానే సీరియస్ ప్రాబ్లం. బిడ్డ పుట్టగానే తండ్రిగా గర్వపడతాం కాని.. భార్య మానసిక, శారీరక ఆరోగ్యాన్ని, ఆమె పరిస్థితిని పట్టించుకోం. అసలు ఆమె మానసికంగా కుంగిపోతుంది. అనే ఆలోచనే రాదు. అందుకే దీని గురించి ముందు ఎడ్యుకేట్ అవ్వాల్సింది మగవాళ్లమే. నా ఈ ‘జనన్య’ మ్యూజిక్ వీడియో ఆ సందేశాన్నే ఇస్తుంది’ అంటాడు దర్శకుడు అనిల్ ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment