
ఇన్వెస్ట్‌మెంట్ @ బాండ్ స్టయిల్
జేమ్స్‌బాండ్ సినిమాలంటే.. స్టయిల్, గ్యాడ్జెట్స్.. ఫన్. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంటు బాండ్‌తో పాటు విలన్లకు కూడా ప్రత్యేకత ఉంటుంది. సమస్యలు సృష్టించడంలో ఇటు విలన్లు.. వాటిని ఎదుర్కొనడంలో అటు బాండ్ పాటించే వ్యూహాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. యాభై ఏళ్ల నుంచి అలరిస్తున్న జేమ్స్‌బాండ్ సినిమాల్లో పాత్రలు, ప్లాన్ల నుంచి నేర్చుకోదగిన ఆర్థిక పాఠాలు కూడా కొన్ని ఉన్నాయి.
రిస్కును అర్థం చేసుకోవడం..
సినిమాల్లో జేమ్స్‌బాండ్ చేసే స్టంట్లు ప్రాక్టీస్ లేకుండా మనమూ ప్రయత్నిస్తే అంతే సంగతులు. సులువుగా కనిపించినా.. బాండ్ ప్లాన్ల వెనుక అధ్యయనం ఉంటుంది. ఉదాహరణకు.. కెసినో రాయల్ లాంటి సినిమాల్లో విలన్‌తో కార్డ్‌గేమ్ ఆడేటప్పుడు బాండ్ ఆషామాషీగా ఆడేయడు. విలన్ బాడీ లాంగ్వేజ్‌ను అధ్యయనం చేస్తూ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేస్తుంటాడు. అలాగే, మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఎంచుకున్నా.. అందులో లోటుపాట్లను, రిస్కులను పూర్తిగా తెలుసుకునే ముందడుగు వేయాలి.
ప్రక్రియంటూ ఉండాలి..
బాండ్ సినిమాల్లో విలన్లు ముందుగా ఏదో ఒకటి చేస్తారు. దానికి ప్రతిచర్యగా బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ రియాక్ట్ అవుతుంది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో తర్వాతెప్పుడో రియాక్ట్ కావడం కాదు.. ముందుగా యాక్షన్ అవసరం. పెట్టుబడిలో అంతరార్థం ఏదైనా లక్ష్యం సాధించడమే. కనుక లక్ష్యాలు నిర్దేశించుకుంటూ.. ప్లానింగ్ చేసుకుంటూ వెళ్లాలి.
స్పెషలిస్టుల సాయం తీసుకోవాలి
విలన్లను ఎదుర్కొనేందుకు బాండ్ సొంత తెలివితేటలతో పాటు గ్యాడ్జెట్స్ సాయం కూడా కీలకంగా ఉంటుంది. వీటిని స్పెషలిస్ట్ క్యూ తయారు చేసి ఇస్తుంటాడు. అలాగే, ఆర్థిక విషయాల్లో అప్పుడప్పుడు మన సొంత ఆలోచనలతో పాటు ఫైనాన్స్ నిపుణుల అవసరం కూడా ఉంటుంది. సందర్భాన్ని బట్టి స్పెషలిస్టుల సాయం తీసుకోవాల్సిందే.
అవకాశాలు అందిపుచ్చుకోవాలి..
ప్రతి బాండ్ సినిమాలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతా ప్రతికూలంగా ఉన్నా కూడా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుని బాండ్ బైటపడుతుంటాడు. ఆర్థిక విషయాల్లోనూ ఇదే పాఠం పనిచేస్తుంది. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు కంగారుపడిపోకుండా కామ్‌గా వ్యవహరించాలి. అంతా అందిన కాడికి అమ్మేసుకుంటున్నప్పుడు.. తెలివైన వారు అవకాశాలను ఒడిసిపట్టుకుంటుంటారు. చౌకగా కొనుక్కుని ఓపికగా అట్టే పెట్టుకుంటూ ఉంటారు. పడినవి ఎల్లకాలం పడిపోయే ఉండవు కాబట్టి అవి మళ్లీ పెరిగినప్పుడు అధిక ధరకు అమ్మి భారీ లాభాలు గడిస్తుంటారు.
సమీక్షించుకోవాలి..
బాండ్ సినిమాల్లో ఛోటా మోటా విలన్లు... తమకి అప్పగించిన ప్రాజెక్టుల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు బడా విలన్‌కు వివరిస్తుంటారు. విలన్లే అయినా.. వాళ్లు కూడా ఖాళీగా కూర్చోకుండా.. తమ ప్రాజెక్టుల బాగోగులు చూసుకుంటుంటారు. అలాగే.. మనం కూడా పెట్టిన పెట్టుబడులు.. లక్ష్యాలకు తగ్గట్లుగా పనిచేస్తున్నాయా లేదా అన్నది సమీక్షించుకుంటూ ఉండటం తప్పనిసరి.
నష్టాలు తగ్గించుకోవాలి..
విషయంలో బాండ్ సినిమాల్లో విలన్లు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు యూ ఓన్లీ లివ్ టై్వస్‌లో తన రహస్య స్థావరం ఇక ఎందుకూ కొరగాదనుకున్నప్పుడు.. పేల్చేయడానికి విలన్ బ్లొఫెల్డ్ స్విచ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే, ఇన్వెస్ట్‌మెంట్ సాధనం నుంచి ఎప్పుడు వైదొలగాలి, ఎలా నష్టాలను తగ్గించుకోవాలి అన్న దానిపై కూడా ఇన్వెస్టరుగా అవగాహన ఉండాలి.