పదిహేనేళ్లుగా ఏక్షదీక్షలో ఇరోమ్ చానూ షర్మిల
ఈ నెల రెండో తేదీన ఆమెను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుత దేశ పరిణామాల మీద, ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానాలతో, విమర్శలతో తలమునకలై ఉన్న జాతీయ మీడియా ఆమె అరెస్టు సంగతి పూర్తిగా మరచిపోయినట్టుంది! ఇంఫాల్‌లోనే చరిత్రాత్మక షామిద్ మినార్ దగ్గర ఈ నెల 1న ఆమె మళ్లీ నిరాహార దీక్ష ఆరంభించినట్టు ప్రకటించారు. మరునాడే అరెస్టు చేశారు.
ఇరోమ్ చాను షర్మిల. పూర్తిగా పదిహేను సంవత్సరాల నుంచి అకుంఠిత నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’. ఈ దీక్షలో నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు. కానీ పన్నెండు రోజుల నిరాహార దీక్ష చేసిన అన్నా హజారేకు మరో గాంధీజీగా దేశంలో ఖ్యాతి వచ్చింది. అవినీతి మీద కత్తి కట్టిన వీరునిగా బిరుదులు, ప్రశంసలు వర్షించాయి. కారణం- ఆయన దేశ రాజధానిలో పెద్ద దీక్షా శిబిరం నిర్మించుకుని, వేలాదిమంది సమక్షంలో దీక్ష సాగించారు. మొత్తం మీడియా దృష్టి కేంద్రీకరించింది.
మరి షర్మిల! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంటారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. త ను ఎంతో ఆరాధించే నెల్సన్ మండేలా బొమ్మను ఎదురుగా గోడకు తగిలించుకున్నారామె.
దీక్ష.. అరెస్టు, దీక్ష.. అరెస్టు
చిత్రం ఏమిటంటే, 2006లో షర్మిల దేశ రాజధానిలో దీక్ష చేశారు. గాంధీజీ సమాధిని సందర్శించి వచ్చి ఆమె దీక్షలో కూర్చున్నారు. కానీ వెంటనే అరెస్టయ్యారు. ఈ ఘట్టం కూడా పెద్ద ప్రాధాన్యం సంతరించుకోలేదు. తరువాత మళ్లీ ఇంఫాల్ వెళ్లి అక్కడే దీక్ష చేయడానికి ఆమె ఉపక్రమించారు. ఎక్కడ ఉన్నా నిత్య నిర్బంధం. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం-ఇదే కథ.
భారత ప్రభుత్వ వైఖరికి నిరసగా ఆమె ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన వ్రతమది. కానీ మణిపూర్ ప్రభుత్వం ఆమెను బతికిస్తోంది, నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్‌ట్యూబేషన్ పద్ధతిలో. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు పంపిస్తారు.
కోర్టు విధించిన శిక్షాకాలం పూర్తవుతుంది. ఆమె కోసం జైలుగా మారిన ఆ వార్డు నుంచి విడుదలవుతారు షర్మిల. అదే ఆస్పత్రికి ఎదురుగా ఆమె అభిమానులు నిర్మించిన ఒక వెదురు శిబిరంలో కొన్ని గంటలు గడుపుతారు. నిజానికి ఆ ఆస్పత్రికి కొద్దిదూరంలోనే ఆమె కుటుంబం నివసిస్తున్నది. కొద్దిసేపటికి మళ్లీ దీక్ష ఆరంభమవుతుంది. మళ్లీ అరెస్టు చేస్తారు. గడచిన పదిహేనేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది.
‘అఫ్‌స్పా’ రద్దు కోసమే దీక్ష
‘అఫ్‌స్పా’ (బాక్స్ చూడండి) సాయుధ బలగాలు తన కంటి ఎదుట జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఈ నిరాహార దీక్ష ఆరంభించారు. నవంబర్ 2, 2000 సంవత్సరం. తన మత విశ్వాసాల మేరకు ఉపవాసం చేస్తున్న షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇది మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు సమీపంలోనే ఉంది కూడా. ఏదో పల్లె నుంచి వచ్చిన కొందరు కార్యకర్తలు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఆ తరువాత అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. ఇందులో 62 ఏళ్ల లెసాంగ్‌బమ్ ఐబెటోమీ అనే మహిళతో పాటు, 18 సంవత్సరాల సినాం చంద్రమణి కూడా ఉన్నాడు. ఇతడు 1988లో సాహసబాలుడు అవార్డు అందుకున్నాడు. ఇదంతా ఆ బస్టాండ్ దగ్గరే, షర్మిల కళ్ల ఎదుటే జరిగింది. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రద ర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు.
అదే ఆమె గొప్పదనం!
ఇంతటి వివాదాస్పద ప్రత్యేక అధికారాల చట్టాన్ని రాష్ట్రంలో ఎత్తివేస్తారని షర్మిల విశ్వసించడంలోనే ఆమె గొప్పతనం కనిపిస్తుంది. మరి ‘అఫస్పా’ను ఎత్తివేస్తే.. ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాల మాటేమిటి? దీనికి షర్మిల ఇచ్చిన వివరణ (వాల్‌స్ట్రీట్ జర్నల్, జనవరి 7, 2015) ఎంతో హృద్యంగా ఉంటుంది.
‘‘నేను ఆయుధాలను పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను. సమాజంలో మెరుగైన పరిస్థితికీ, పురోగతికీ మార్పు అవసరమే. కానీ ఆయుధాల ప్రమేయం లేని విప్లవాలు కావాలి. ప్రేమ, దయ ఉండే విప్లవాలు రావాలి.
ఈ మధ్య (నవంబర్ 30, 2015) భారత ప్రధాని నరేంద్ర మోదీ (సాంగై అనే జానపద ఉత్సవం ముగింపు ఉత్సవం కోసం) ఇంఫాల్ వచ్చారు. ఆయన నన్ను చూసి వెళతారని ఆశించాను. కానీ అది కలగానే మిగిలిపోయింది.
ఆయన వచ్చి ఉంటే ఒక విషయం స్పష్టం చేయాలన్నదే నా కోరిక. మీరు వివాదాస్పద చట్టాన్ని ఎత్తి వేస్తే, మీ పర్యటన పట్ల వేర్పాటువాదులకు ఉన్న దృక్పథం మారిపోతుంది అని చెప్పాలని అనుకున్నాను. ఆయనను ఒప్పించాలని అనుకున్నాను’’. ఈ రాక్షస చట్టాన్ని ఏదో ఒకరోజున భారత ప్రభుత్వం రద్దు చేస్తుందనే ఇప్పటికీ షర్మిల నమ్ముతున్నారు. అందుకే మళ్లీ దీక్ష ఆరంభించారు. ఎంతైనా ఆమె ఉక్కు మహిళ. శాంతి పరిమళాన్ని వెదజల్లుతాను నేను పుట్టిన కాంగ్లీ నుంచి రాబోయే యుగాలలో ఆ పరిమళం ప్రపంచమంతా విస్తరిస్తుంది (షర్మిల కవిత).
- డాక్టర్ గోపరాజు నారాయణరావు
ఉక్కు మహిళ ప్రేమలేఖలు
దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. వివాహం కాలేదు. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక ఇంటర్వ్యూలో షర్మిల కొన్ని ‘లలిత’మైన విషయాలు వెల్లడించారు. ‘సాధారణ జీవితంలో మళ్లీ ప్రవేశించాలని ఉంది. తల్లిని కావాలని కూడా కోరిక ఉంది. జీవితంలో ఉండే అన్ని దశలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఇంకా విస్తుగొలిపే విషయం - ఈ ఉక్కు మహిళ ప్రేమలో పడ్డారు.
ఈ విషయాన్ని స్వయంగా షర్మిలే (సెప్టెంబర్ 5, 2011, ది టెలిగ్రాఫ్) అంగీకరించారు. గోవాలో పుట్టి ప్రస్తుతం బ్రిటిష్ పౌరుడిగా ఉన్న డెస్మాండ్ కాతిన్హో తన మీద మనసు పడిన సంగతిని ఎలాంటి సంకోచం లేకుండా షర్మిల వెల్లడించారు. తాను కూడా అతడితో ప్రేమలో పడ్డానని కూడా చెప్పారు. డెస్మాండ్ కూడా షర్మిల మాదిరిగానే హక్కుల కార్యకర్త, రచయిత కావడం విశేషం. అతడి వయసు 48 ఏళ్లు. షర్మిల వయసు (మార్చి 14,1972. ఇంఫాల్ దగ్గరే కొంగ్పాల్ అనే చోట పుట్టారామె) 44 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ఉత్తరాలు సాగాయి.
షర్మిల వ్యతిరేకిస్తున్న చట్టం... అఫ్‌స్పా
మణిపూర్- మైన్మార్ సరిహద్దులలో రెండున్నర కోట్ల జనాభా పైబడిన రాష్ట్రం. ఈ ఈశాన్య భారత రాష్ట్రంలోని సమస్యలే షర్మిల చేత ఇంత కఠోరమైన దీక్షకు పూనుకునేటట్టు చేశాయి. ఈ సమస్య మణిపూర్‌కు మాత్రమే కాదు, సెవెన్ సిస్టర్స్‌గా చెప్పే మిగిలిన ఈశాన్య భారత రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. మణిపూర్ అక్టోబర్ 15, 1949న భారత యూనియన్‌లో విలీనమైంది. 1972లో పూర్తి స్థాయి రాష్ట్రంగా ఆవిర్భవించింది. అంతకు రెండు సంవత్సరాల ముందు నుంచే ఇక్కడి సామాజిక పరిస్థితులు అవాంఛనీయంగా మారిపోయాయి.
నిరుద్యోగం పెద్ద సమస్య. పక్కనే ఉన్న మైన్మార్ నుంచి దిగుమతయ్యే మత్తు పదార్థాలు యువతను పూర్తిగా నిర్వీర్యం చేసేశాయి. భారత్‌లో విలీనం, పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించడం అనే పరిణామంలో సామాజిక అంతరాలు, ఘర్షణలు వేర్పాటువాద ఉద్యమాలకు దారి తీశాయి. ఇక్కడ మితీస్ తెగవారు యాభయ్ శాతం ఉన్నారు. కానీ వీరంతా కలిపి పదిశాతం భూభాగంలోనే ఉండిపోయారు. వీరు భారతదేశ ప్రధాన స్రవంతితో కలసిపోవాలని కోరుతున్నవారు. ఇంకా నాగాలు, కుకీలు, రాల్టెస్, గాంగ్టెస్, హమర్స్ వంటి గిరిజన తెగులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ తెగలు దాదాపు ముప్పయ్.
వీరందరికీ సంబంధించిన ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలే యూఎన్‌సీఎఫ్, పీఎల్‌ఏ, ప్రెపాక్, కేసీపీ, పీఆర్‌ఏ, ఎన్‌ఎస్‌సీఎన్ -ఐఎమ్, కేఎన్‌ఎఫ్ మొదలైనవి. అక్కడి అల్లర్లు, ఆందోళనలు అన్నీ గిరిజన తెగల మధ్య సంఘర్షణలే. రాష్ట్రంలో రోజురోజుకీ హింసాత్మక ధోరణి పెరిగిపోవడంతో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం- 1958 (అఫ్‌స్పా)ని మణిపూర్‌లో కూడా 1980 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ 2005 నుంచి 2015 మధ్య 5,500 రాజకీయ హత్యలు జరిగాయంటేనే తీవ్రతను గమనించవచ్చు.
ఈ చట్టాన్ని సంక్షుభిత ప్రాంతాలలో అమలు చేస్తారు. అక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి సాయుధ బలగాలు దిగుతాయి. వీరికి అసాధారణమైన అధికారాలు కల్పిస్తుందీ చట్టం. ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఎవరి ఇంటినైనా సోదా చేయవచ్చు. కారణం అవసరం లేదు. వారెంట్ అడిగే హక్కు లేదు. ఎక్కడ అఫ్‌స్పా అమలులో ఉన్నా కచ్చితంగా వచ్చే విమర్శ - అత్యాచారాలు. ముఖ్యంగా అమాయకుల మీద జులుం. లేదా స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు. వీటిని నిరోధించడానికే ఈ చట్టాన్ని రద్దు చేయమని షర్మిల పదిహేనేళ్లుగా పోరాడుతున్నారు.
మహిళల నగ్న ప్రదర్శన
జూలై 11, 2004న అస్సాం రైఫిల్స్ దళాలు తంగజం మనోరమాదేవి అనే 32 ఏళ్ల మహిళను ఇంఫాల్‌లోనే ఆమె ఇంటిలో అరెస్టు చేసి తీసుకువెళ్లాయి. మరునాడు వేకువన, ఆమె ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో శవమై కనిపించింది. ఒళ్లంతా తూటాలతో జల్లెడైపోయి ఉంది. ఆమెను తామే కాల్చామనీ, పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేయవలసి వచ్చిందని దళాలు వివరణ ఇచ్చాయి. కానీ ఆమెను లైంగికంగా హింసించి తరువాత కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, ఆమె సహ ఉద్యమకారులు ఆరోపించారు.
అందుకు నిరసనగా జూలై 15న నలభయ్ నుంచి యాభయ్ ఏళ్లు ఉన్న దాదాపు డజను మంది మహిళలు పూర్తి నగ్నంగా ఇంఫాల్‌లోని కాంగ్లా భవంతి (అస్సాం రైఫిల్స్ బస చేసిన భవంతి) ముందు ప్రదర్శన చేశారు. ‘భారత సైనికులారా! మమ్మల్ని రేప్ చేయండి!’ అంటూ ఎర్రటి అక్షరాలు రాసిన బ్యానర్‌తో ఆ మహిళలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎంత ప్రభావం చూపిందంటే, ‘అఫ్‌స్పా’.
చట్టం ఎత్తివేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి సిఫార్సు చేయడానికి బీపీ జీవన్‌రెడ్డి నాయకత్వాన మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 2005లోనే ఆయన నివేదిక ఇచ్చి, ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయవచ్చునని నిర్ద్వంద్వంగా చెప్పారు. కానీ ఈ పరిణామంతో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుందనీ, అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందన్న భయంతో, సైనికాధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగాను ఆ సిఫార్సును అమలు చేయలేదు. అయినప్పటికీ షర్మిల తన దృఢ సంకల్పాన్ని విడిచిపెట్టక పోవడం గమనించక తప్పదు.