Irom Chanu Sharmila
-
చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!
దాదాపు 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’ ఇరోమ్ చాను షర్మిల. దీక్షలో ఉన్న అన్నేళ్లలోనూ ఆమె నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులోనే ఆ పదహారేళ్లూ ఆమె ఉన్నారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం.. ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన అది: మణిపూర్ ప్రభుత్వమే ఆమెను బతికిస్తూ వచ్చింది. అయితే నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్‌ట్యూబేషన్ పద్ధతిలో.. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు నిర్బంధంగా పంపించడం! ‘అఫ్స్పా’ సాయుధ బలగాలు తన కంటి ఎదురుగా జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఆ నిరాహార దీక్ష ఆరంభించారు. అది 2000 నవంబర్ 2. షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే.. అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రదర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. అప్పటికి వివాహం కాలేదు. దీక్ష వల్ల ప్రయోజనం లేదనీ, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో పోరాడాలనీ తలచి 2016 ఆగస్టు 9 న దీక్షను విరమించారు. ఆ తర్వాత ఎన్నికల్లో నిలుచున్నప్పటికీ ఆమె గెలవలేదు. అఫ్స్పా చట్టం నేటికీ పూర్తిగా రద్దవలేదు. షర్మిల 1972 మార్చి 2 ఇంఫాల్‌లోని కోంగ్పాల్ గ్రామంలో జన్మించారు. పౌరహక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ తన ఉద్యమ భాగస్వామి అయిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ ఆంథోనీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం సామాజిక అంశాలపై వ్యాస రచనలు చేస్తున్నారు. -
స్వతంత్ర భారతి: అఫ్స్పా చట్టం
తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరామ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే ఆనాటి నుంచీ ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోం చాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 న నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958 ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదొక కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణిం చారు. 2021 డిసెంబర్లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్ఎస్పీఏ (అఫ్స్పా) ను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. -
కల్లోల కడలి తరంగం
ఇరోమ్ ఛాను షర్మిల! మణిపూర్ ఉక్కు మహిళ. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను (ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్స్) రద్దు చేయాలంటూ 16 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు నిరాహారదీక్ష చేసిన యువతి, పౌరహక్కుల కార్యకర్త, రాజకీయ నాయకురాలు, కవయిత్రి ఇలా భిన్న భూమికలు పోషించిన వ్యక్తి. ఇప్పుడు సామాజిక సేవ చేసేందుకు జమ్మూ, కశ్మీర్‌కు పయనమవుతామంటున్నారు. అక్కడ మహిళా సాధికారత సాధన కోసం కృషి చేస్తామంటున్నారు. మళ్లీ నిరాహారదీక్ష జోలికి వెళ్లనని, దానికి బదులు మహిళలను చేరుకుని, సమకాలీన ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చలు కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇప్పుడిక భారత్ బోర్డర్‌కి మణిపూర్‌లో మాదిరిగానే కశ్మీర్‌లోనూ భద్రతాదళాల ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయి. అందువల్లే అక్కడకు వెళ్లి కశ్మీర్ మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన, చైతన్యాన్ని కలిగించి ఈ నిరంకుశచట్టాలపై గళమెత్తేలా చేస్తానంటున్నారు షర్మిల. ‘‘కశ్మీర్లో వివిధ వయసుల్లోని మహిళలను కలుసుకుని వారి సమస్యలేమిటో తెలుసుకుంటాను. వాటికి పరిష్కారాలేమిటన్న దానిపై చర్చిస్తాను’’ అని ఆమె అంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని, కేవలం ప్రజలనే కలుసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. తన ఉద్యమం ద్వారా అక్కడి మహిళలు ప్రభుత్వాన్ని సరైన దిశలో కదిలించగలగాలన్నదే తన ఆశ, తాపత్రయమని అన్నారు.‘‘భారత్–పాకిస్తాన్ల మధ్య సుదీర్ఘకాలం పాటు ఘర్షణలు కొనసాగడం బాధాకరం. పొరుగు దేశాలుగా స్నేహసంబంధాలుంటే బావుంటుంది. ఈ రెండుదేశాల మధ్య శాంతిస్థాపనకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధమే’’నని కూడా ఇరోమ్ ప్రకటించారు! ఓటమి మంచి అనుభవం! ప్రత్యేక అధికారాల పేరిట సైనిక దళాలు ప్రజల హక్కులు హరించడాన్ని ఎలుగెత్తి చాటి, విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాల రద్దు కోసం పోరాడిన ధీర వనితగానే షర్మిల గుర్తిండిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం నిరాహారదీక్ష చేసిన వ్యక్తిగా (ముక్కుకు అమర్చిన గొట్టం ద్వారా ఆహారం ) అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నా, రాజకీయ నాయకురాలిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి! ఈ ఎన్నికల ఫలితం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం తప్పిదం కాదని, అదో మంచి అనుభవం కింద గుర్తుంచుకుంటానని షర్మిల అంటున్నారు. ‘నా రాష్ట్ర, దేశ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుని వారిని నేరుగా కలుసుకునేందుకు ఇదొ సువర్ణావకాశం’ అంటారు తన ఈ రెండో ప్రస్థానం గురించి. ‘ఓ మనిషిగా జీవించేందుకు, నేను కోరుకున్న హక్కుల సాధనకు కట్టుబడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాను. అందువల్లే నా మనుషులను, నా బంధువులను కాదని, నేను పుట్టిన నేల, సొంత ప్రాంతాన్ని విడిచి వచ్చేశాను’ అంటారు షర్మిల. అంతేకాదు, ఇక ప్రతీరోజు నేను పాటలు పాడుతూ, కూనిరాగాలు తీస్తూ, స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ప్రార్థిస్తాను అని కూడా ప్రకటించేశారు ఇరోమ్ షర్మిలా! ప్రస్తుతం ఆమె తరచు మణిపూర్, కశ్మీర్‌ల మధ్య ప్రయాణిస్తున్నారు. అన్నీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలే! 2000 నవంబర్‌లో భద్రతాదళాల కాల్పులకు 10 మంది అమాయకులు బలికావడాన్ని నిరసిస్తూ అనూహ్యంగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నట్టు ప్రకటించి, పదహారేళ్ల పాటు కొనసాగించడం.. ఈ దీక్ష సందర్భంగా కన్నతల్లిని సైతం ఒకే ఒకసారి కలుసుకోవడం ఒక ఆశ్చర్యం! మాతృమూర్తిని పదే పదే కలిస్తే నిరాహారదీక్షపై తన ధృఢచిత్తం ఎక్కడ సడలుతుందోననే ఆమె భయం. అలాగే.. ఎంత సుదీర్ఘకాలం దీక్షలో కూర్చున్నా.. అంతే అకస్మాత్తుగా దీక్ష విరమించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించడం, అందుకోసం రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం మరో ఆశ్చర్యం. పుట్టినగడ్డ అయిన మణిపూర్‌లో స్థానికుల హక్కుల పరిరక్షణకు వీరోచితంగా పోరాడి, ఆ నేలను విడిచిపెట్టి తమిళనాడులోని కొడైకెనాల్కి వచ్చి స్థిరపడాలని అనుకోవడం, అదీ కూడా.. గోవా మూలాలున్న బ్రిటిష్–భారత సంతతికి చెందిన డెస్మండ్ కౌటిన్హొతో లేఖల ద్వారా ప్రేమలో వాళ్లిద్దరూ ప్రేమలో పడి అది పెళ్లికి దారితీయడం వరకు.. ఇలా షర్మిల జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి నిర్ణయం ఆశ్చర్యం గొలిపేదే. – కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విజయం మాదే: ఇరోమ్ షర్మిల
ఇంఫాల్ : ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల అన్నారు. మణిపూర్‌లో కూడా అలాంటి మార్పే రావాలని ఆమె ఆకాంక్షించారు. యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇరోమ్ షర్మిల తన గెలుపుపై ముందే ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8న జరిగే ఎన్నికల్లో ముఖమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. కాగా ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇరోమ్ షర్మిల తాను స్థాపించిన పీఆర్జేఎ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరికి దింపారు. మరోవైపు పీఆర్‌జేఏ అభ్యర్థి ఎలాండ్రో లైకోంబామ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మణిపూర్ తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తొలి దశలో మొత్తం 38 అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 69శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే మరో రెండోవిడత పోలింగ్ బుధవారం జరగనున్నాయి. -
ఇరోం షర్మిల కొత్త పార్టీ షురూ
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల మంగళవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. పార్టీకి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్గా పేరు పెట్టారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తాను మణిపూర్ సీఎం ఓక్రం ఇబోబీసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కురాయి నుంచి బరిలోకి దిగుతానని వెల్లడించారు. సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దుకు తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమై రాజకీయాల గురించి చర్చించారు. అలాగే ప్రధాని మోదీ నుంచి రాజకీయ సలహాలు తీసుకుంటానని ఆమె చెప్పారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా షర్మిల 16ఏళ్లు నిరశన చేయడం తెలిసిందే. -
'నా సోదరిని కలిసేందుకు అనుమతించలేదు'
ఇంఫాల్: తన సోదరిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని మణిపాల్ ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల సోదరుడు సింగ్జిత్ ఇరోమ్ తెలిపారు. దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తన సోదరిని కలిసేందుకు ప్రయత్నించానని ఆయన వెల్లడించారు. తమ భవిష్యత్ కార్యాచరణ కోసం ఆమెను కలవాలనుకున్నట్టు చెప్పారు. ఇరోమ్ షర్మిల డిమాండ్ నేరవేరే వరకు ఆమెను కలవకూడదని తన తల్లి నిర్ణయించుకుందని, దానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోసం 16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను ఇరోమ్ షర్మిల మంగళవారం విరమించనున్నారు. -
ఐరన్ ఇరోమ్
ఈ నెల రెండో తేదీన ఆమెను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుత దేశ పరిణామాల మీద, ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానాలతో, విమర్శలతో తలమునకలై ఉన్న జాతీయ మీడియా ఆమె అరెస్టు సంగతి పూర్తిగా మరచిపోయినట్టుంది! ఇంఫాల్లోనే చరిత్రాత్మక షామిద్ మినార్ దగ్గర ఈ నెల 1న ఆమె మళ్లీ నిరాహార దీక్ష ఆరంభించినట్టు ప్రకటించారు. మరునాడే అరెస్టు చేశారు. ఇరోమ్ చాను షర్మిల. పూర్తిగా పదిహేను సంవత్సరాల నుంచి అకుంఠిత నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’. ఈ దీక్షలో నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు. కానీ పన్నెండు రోజుల నిరాహార దీక్ష చేసిన అన్నా హజారేకు మరో గాంధీజీగా దేశంలో ఖ్యాతి వచ్చింది. అవినీతి మీద కత్తి కట్టిన వీరునిగా బిరుదులు, ప్రశంసలు వర్షించాయి. కారణం- ఆయన దేశ రాజధానిలో పెద్ద దీక్షా శిబిరం నిర్మించుకుని, వేలాదిమంది సమక్షంలో దీక్ష సాగించారు. మొత్తం మీడియా దృష్టి కేంద్రీకరించింది. మరి షర్మిల! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంటారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. త ను ఎంతో ఆరాధించే నెల్సన్ మండేలా బొమ్మను ఎదురుగా గోడకు తగిలించుకున్నారామె. దీక్ష.. అరెస్టు, దీక్ష.. అరెస్టు చిత్రం ఏమిటంటే, 2006లో షర్మిల దేశ రాజధానిలో దీక్ష చేశారు. గాంధీజీ సమాధిని సందర్శించి వచ్చి ఆమె దీక్షలో కూర్చున్నారు. కానీ వెంటనే అరెస్టయ్యారు. ఈ ఘట్టం కూడా పెద్ద ప్రాధాన్యం సంతరించుకోలేదు. తరువాత మళ్లీ ఇంఫాల్ వెళ్లి అక్కడే దీక్ష చేయడానికి ఆమె ఉపక్రమించారు. ఎక్కడ ఉన్నా నిత్య నిర్బంధం. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం-ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసగా ఆమె ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన వ్రతమది. కానీ మణిపూర్ ప్రభుత్వం ఆమెను బతికిస్తోంది, నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్‌ట్యూబేషన్ పద్ధతిలో. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు పంపిస్తారు. కోర్టు విధించిన శిక్షాకాలం పూర్తవుతుంది. ఆమె కోసం జైలుగా మారిన ఆ వార్డు నుంచి విడుదలవుతారు షర్మిల. అదే ఆస్పత్రికి ఎదురుగా ఆమె అభిమానులు నిర్మించిన ఒక వెదురు శిబిరంలో కొన్ని గంటలు గడుపుతారు. నిజానికి ఆ ఆస్పత్రికి కొద్దిదూరంలోనే ఆమె కుటుంబం నివసిస్తున్నది. కొద్దిసేపటికి మళ్లీ దీక్ష ఆరంభమవుతుంది. మళ్లీ అరెస్టు చేస్తారు. గడచిన పదిహేనేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ‘అఫ్స్పా’ రద్దు కోసమే దీక్ష ‘అఫ్స్పా’ (బాక్స్ చూడండి) సాయుధ బలగాలు తన కంటి ఎదుట జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఈ నిరాహార దీక్ష ఆరంభించారు. నవంబర్ 2, 2000 సంవత్సరం. తన మత విశ్వాసాల మేరకు ఉపవాసం చేస్తున్న షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇది మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు సమీపంలోనే ఉంది కూడా. ఏదో పల్లె నుంచి వచ్చిన కొందరు కార్యకర్తలు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. ఇందులో 62 ఏళ్ల లెసాంగ్బమ్ ఐబెటోమీ అనే మహిళతో పాటు, 18 సంవత్సరాల సినాం చంద్రమణి కూడా ఉన్నాడు. ఇతడు 1988లో సాహసబాలుడు అవార్డు అందుకున్నాడు. ఇదంతా ఆ బస్టాండ్ దగ్గరే, షర్మిల కళ్ల ఎదుటే జరిగింది. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రద ర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు. అదే ఆమె గొప్పదనం! ఇంతటి వివాదాస్పద ప్రత్యేక అధికారాల చట్టాన్ని రాష్ట్రంలో ఎత్తివేస్తారని షర్మిల విశ్వసించడంలోనే ఆమె గొప్పతనం కనిపిస్తుంది. మరి ‘అఫస్పా’ను ఎత్తివేస్తే.. ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాల మాటేమిటి? దీనికి షర్మిల ఇచ్చిన వివరణ (వాల్‌స్ట్రీట్ జర్నల్, జనవరి 7, 2015) ఎంతో హృద్యంగా ఉంటుంది. ‘‘నేను ఆయుధాలను పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను. సమాజంలో మెరుగైన పరిస్థితికీ, పురోగతికీ మార్పు అవసరమే. కానీ ఆయుధాల ప్రమేయం లేని విప్లవాలు కావాలి. ప్రేమ, దయ ఉండే విప్లవాలు రావాలి. ఈ మధ్య (నవంబర్ 30, 2015) భారత ప్రధాని నరేంద్ర మోదీ (సాంగై అనే జానపద ఉత్సవం ముగింపు ఉత్సవం కోసం) ఇంఫాల్ వచ్చారు. ఆయన నన్ను చూసి వెళతారని ఆశించాను. కానీ అది కలగానే మిగిలిపోయింది. ఆయన వచ్చి ఉంటే ఒక విషయం స్పష్టం చేయాలన్నదే నా కోరిక. మీరు వివాదాస్పద చట్టాన్ని ఎత్తి వేస్తే, మీ పర్యటన పట్ల వేర్పాటువాదులకు ఉన్న దృక్పథం మారిపోతుంది అని చెప్పాలని అనుకున్నాను. ఆయనను ఒప్పించాలని అనుకున్నాను’’. ఈ రాక్షస చట్టాన్ని ఏదో ఒకరోజున భారత ప్రభుత్వం రద్దు చేస్తుందనే ఇప్పటికీ షర్మిల నమ్ముతున్నారు. అందుకే మళ్లీ దీక్ష ఆరంభించారు. ఎంతైనా ఆమె ఉక్కు మహిళ. శాంతి పరిమళాన్ని వెదజల్లుతాను నేను పుట్టిన కాంగ్లీ నుంచి రాబోయే యుగాలలో ఆ పరిమళం ప్రపంచమంతా విస్తరిస్తుంది (షర్మిల కవిత). - డాక్టర్ గోపరాజు నారాయణరావు ఉక్కు మహిళ ప్రేమలేఖలు దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. వివాహం కాలేదు. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక ఇంటర్వ్యూలో షర్మిల కొన్ని ‘లలిత’మైన విషయాలు వెల్లడించారు. ‘సాధారణ జీవితంలో మళ్లీ ప్రవేశించాలని ఉంది. తల్లిని కావాలని కూడా కోరిక ఉంది. జీవితంలో ఉండే అన్ని దశలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఇంకా విస్తుగొలిపే విషయం - ఈ ఉక్కు మహిళ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిలే (సెప్టెంబర్ 5, 2011, ది టెలిగ్రాఫ్) అంగీకరించారు. గోవాలో పుట్టి ప్రస్తుతం బ్రిటిష్ పౌరుడిగా ఉన్న డెస్మాండ్ కాతిన్హో తన మీద మనసు పడిన సంగతిని ఎలాంటి సంకోచం లేకుండా షర్మిల వెల్లడించారు. తాను కూడా అతడితో ప్రేమలో పడ్డానని కూడా చెప్పారు. డెస్మాండ్ కూడా షర్మిల మాదిరిగానే హక్కుల కార్యకర్త, రచయిత కావడం విశేషం. అతడి వయసు 48 ఏళ్లు. షర్మిల వయసు (మార్చి 14,1972. ఇంఫాల్ దగ్గరే కొంగ్పాల్ అనే చోట పుట్టారామె) 44 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ఉత్తరాలు సాగాయి. షర్మిల వ్యతిరేకిస్తున్న చట్టం... అఫ్స్పా మణిపూర్- మైన్మార్ సరిహద్దులలో రెండున్నర కోట్ల జనాభా పైబడిన రాష్ట్రం. ఈ ఈశాన్య భారత రాష్ట్రంలోని సమస్యలే షర్మిల చేత ఇంత కఠోరమైన దీక్షకు పూనుకునేటట్టు చేశాయి. ఈ సమస్య మణిపూర్‌కు మాత్రమే కాదు, సెవెన్ సిస్టర్స్‌గా చెప్పే మిగిలిన ఈశాన్య భారత రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. మణిపూర్ అక్టోబర్ 15, 1949న భారత యూనియన్‌లో విలీనమైంది. 1972లో పూర్తి స్థాయి రాష్ట్రంగా ఆవిర్భవించింది. అంతకు రెండు సంవత్సరాల ముందు నుంచే ఇక్కడి సామాజిక పరిస్థితులు అవాంఛనీయంగా మారిపోయాయి. నిరుద్యోగం పెద్ద సమస్య. పక్కనే ఉన్న మైన్మార్ నుంచి దిగుమతయ్యే మత్తు పదార్థాలు యువతను పూర్తిగా నిర్వీర్యం చేసేశాయి. భారత్‌లో విలీనం, పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించడం అనే పరిణామంలో సామాజిక అంతరాలు, ఘర్షణలు వేర్పాటువాద ఉద్యమాలకు దారి తీశాయి. ఇక్కడ మితీస్ తెగవారు యాభయ్ శాతం ఉన్నారు. కానీ వీరంతా కలిపి పదిశాతం భూభాగంలోనే ఉండిపోయారు. వీరు భారతదేశ ప్రధాన స్రవంతితో కలసిపోవాలని కోరుతున్నవారు. ఇంకా నాగాలు, కుకీలు, రాల్టెస్, గాంగ్టెస్, హమర్స్ వంటి గిరిజన తెగులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ తెగలు దాదాపు ముప్పయ్. వీరందరికీ సంబంధించిన ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలే యూఎన్సీఎఫ్, పీఎల్ఏ, ప్రెపాక్, కేసీపీ, పీఆర్ఏ, ఎన్ఎస్సీఎన్ -ఐఎమ్, కేఎన్‌ఎఫ్ మొదలైనవి. అక్కడి అల్లర్లు, ఆందోళనలు అన్నీ గిరిజన తెగల మధ్య సంఘర్షణలే. రాష్ట్రంలో రోజురోజుకీ హింసాత్మక ధోరణి పెరిగిపోవడంతో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం- 1958 (అఫ్స్పా)ని మణిపూర్‌లో కూడా 1980 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ 2005 నుంచి 2015 మధ్య 5,500 రాజకీయ హత్యలు జరిగాయంటేనే తీవ్రతను గమనించవచ్చు. ఈ చట్టాన్ని సంక్షుభిత ప్రాంతాలలో అమలు చేస్తారు. అక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి సాయుధ బలగాలు దిగుతాయి. వీరికి అసాధారణమైన అధికారాలు కల్పిస్తుందీ చట్టం. ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఎవరి ఇంటినైనా సోదా చేయవచ్చు. కారణం అవసరం లేదు. వారెంట్ అడిగే హక్కు లేదు. ఎక్కడ అఫ్స్పా అమలులో ఉన్నా కచ్చితంగా వచ్చే విమర్శ - అత్యాచారాలు. ముఖ్యంగా అమాయకుల మీద జులుం. లేదా స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు. వీటిని నిరోధించడానికే ఈ చట్టాన్ని రద్దు చేయమని షర్మిల పదిహేనేళ్లుగా పోరాడుతున్నారు. మహిళల నగ్న ప్రదర్శన జూలై 11, 2004న అస్సాం రైఫిల్స్ దళాలు తంగజం మనోరమాదేవి అనే 32 ఏళ్ల మహిళను ఇంఫాల్లోనే ఆమె ఇంటిలో అరెస్టు చేసి తీసుకువెళ్లాయి. మరునాడు వేకువన, ఆమె ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో శవమై కనిపించింది. ఒళ్లంతా తూటాలతో జల్లెడైపోయి ఉంది. ఆమెను తామే కాల్చామనీ, పారిపోతుండగా ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని దళాలు వివరణ ఇచ్చాయి. కానీ ఆమెను లైంగికంగా హింసించి తరువాత కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, ఆమె సహ ఉద్యమకారులు ఆరోపించారు. అందుకు నిరసనగా జూలై 15న నలభయ్ నుంచి యాభయ్ ఏళ్లు ఉన్న దాదాపు డజను మంది మహిళలు పూర్తి నగ్నంగా ఇంఫాల్‌లోని కాంగ్లా భవంతి (అస్సాం రైఫిల్స్ బస చేసిన భవంతి) ముందు ప్రదర్శన చేశారు. ‘భారత సైనికులారా! మమ్మల్ని రేప్ చేయండి!’ అంటూ ఎర్రటి అక్షరాలు రాసిన బ్యానర్‌తో ఆ మహిళలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎంత ప్రభావం చూపిందంటే, ‘అఫ్స్పా’. చట్టం ఎత్తివేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి సిఫార్సు చేయడానికి బీపీ జీవన్‌రెడ్డి నాయకత్వాన మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 2005లోనే ఆయన నివేదిక ఇచ్చి, ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయవచ్చునని నిర్ద్వంద్వంగా చెప్పారు. కానీ ఈ పరిణామంతో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుందనీ, అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందన్న భయంతో, సైనికాధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగాను ఆ సిఫార్సును అమలు చేయలేదు. అయినప్పటికీ షర్మిల తన దృఢ సంకల్పాన్ని విడిచిపెట్టక పోవడం గమనించక తప్పదు.