ఉగ్రకాళి | Isis 'forced us to pray - then raped us': Yazidi survivor Nadia | Sakshi
Sakshi News home page

ఉగ్రకాళి

Published Sun, May 1 2016 11:38 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

ఉగ్రకాళి - Sakshi

ఉగ్రకాళి

నరకానికి వెళ్లొచ్చినవాళ్లు మళ్లీ నరకానికి వెళ్లాలని అనుకోరు. కానీ.. నదియా అనుకుంది. నదియాను కిడ్నాప్ చేశారు. అత్యాచారం జరిపారు. లైంగికంగా హింసించారు. ‘సెక్స్ స్లేవ్’గా మార్చి ఊడిగం చేయించుకున్నారు. ప్రాణాలు కళ్లల్లోకి వస్తుండగా తప్పించుకుంది నదియా. ఇప్పుడు మళ్లీ ఆ నరకకూపంలోకి వెళ్లాలనుకుంటోంది. అయితే ఈసారి బాధితురాలిగా కాదు.. బందీలుగా ఉన్నవారిని విడిపించే యోధురాలిగా! ‘ఐసిస్’ చెరలోని ఐదువేల మంది ఆడపిల్లల విముక్తి కోసం... నదియా.. ఉగ్రరూపం ధరించారు. అగ్రరాజ్యాల సహకారంతో ఉగ్రకాళి అవతారం ఎత్తారు.
 
నదియా ‘ఫైట్’
నదియా కిడ్నాప్ : 2014 ఆగస్టు
నరకయాతన : మూడు నెలలు
నదియా తప్పించుకుంది :  2014 నవంబర్
నదియాను తప్పించింది    : ఓ స్వచ్ఛంద సంస్థ
అజ్ఞాత ప్రయాణాలు : ఒక ఏడాది (2015)
సమితి ముందు సాక్ష్యం : 2015 డిసెంబర్
ప్రస్తుత నివాసం : జర్మనీ
ప్రస్తుత కార్యాచరణ : యువతుల విముక్తి

 
2014 జూలై. ఉత్తర ఇరాక్‌లోని కోకో గ్రామం. ఆ గ్రామంలోనే నదియా కుటుంబం నివాసం ఉంటోంది. తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. నాన్న లేడు. తను డిగ్రీ చదువుతోంది. హిస్టరీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్. హిస్టరీ టీచర్ కావడం నదియా జీవిత ధ్యేయం. చిన్నప్పటి నుంచి ప్రశాంతమైన జీవితం. అయితే ఆ ప్రశాంతతను ఓరోజు నదియా ఇంట్లోని టీవీ భగ్నం చేసింది. ఆమెను భయకంపితురాలిని చేసింది. టీవీలో ఎవరో ఎవర్నో చంపిన ఫొటోలు. అతి కిరాతకంగా తల నరికి, చేతులు నరికి చంపారు. నదియా భయపడిపోంది. ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ అంతటి ఘోరాలకు పాల్పడిందని తెలిసి హడలిపోయింది. ఆ సంస్థ సభ్యులు తమ యాజిడీ తెగ మనుషులను ఇస్లాంలోకి మార్చుకోవడం కోసం గ్రామాల్లోకి ప్రవేశించారని తెలిసి చిగురుటాకులా వణికిపోయింది.
 
ఆ తర్వాత కొద్ది రోజులకే...

ఆగస్టు 15, 2014. కోకో గ్రామంలో కలకలం. ఐసిస్ ‘ఫైటర్స్’  (ఈ ఉగ్రవాద మూకలు తమను అలా పిలుచుకుంటాయి) వీధుల్లో విశృంఖలంగా తిరుగుతూ ఇళ్లలోంచి అందర్నీ బయటికి రమ్మని ఆదేశిస్తున్నాయి.  గ్రామస్థులందరినీ ఊరి పొలిమేరకు తరలించాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు.. అందర్నీ ఊరి చివర్న ఉన్న ఒక బడి భవనం దగ్గరకు రప్పించాయి. అది మధ్యాహ్న భోజన సమయం. ఆ సమయానికి నదియా, ఆమె చెల్లెళ్లు ఇంటికి వస్తూ ఉన్నారు. వారికి ప్రతి చోటా కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు. వాళ్లలో కొందరు మాస్కులు ధరించి ఉన్నారు. ఏవో తెలియని భాషల్లో మాట్లాడుకుంటున్నారు. జరగరానిది ఏదో జరగబోతోందని అర్థమవుతోంది నదియాకు. పూర్తిగా అర్థమయ్యేలోపే ఆమెనూ బందీగా పట్టుకున్నారు ఉగ్రవాదులు.
 
అమ్మాయిలే ‘ఐసిస్’ టార్గెట్
అందర్నీ ఒకచోట చేర్చాక మగవాళ్లను, మహిళలను వేరు చేసింది ఐసిస్. అలా.. నదియా, మరికొందరు మహిళలు పాఠశాల భవనంలోని రెండో అంతస్థులో బందీ అయ్యారు. తర్వాత ఒక్క గంటలో ఐసిస్ ముఠా 312 మందిని చంపేసింది. చనిపోయిన వారిలో నదియా సొంత అన్నదమ్ములు, చిన్నాన్న పెదనాన్నల కొడుకులు ఆరుగురు ఉన్నారు. నదియా కళ్ల ముందే అతి కిరాతకంగా వారిని చంపేశారు.
 
ఎంపిక.. పంపకం..
ఇక  మిగిలింది నదియా, ఆమెలాంటి కొంతమంది అందమైన యువతులు! వీళ్లందరిని ఇరాక్ పట్టణం మోసుల్‌కు తరలించారు. అక్కడ మూడు రోజులు నిర్బంధించి, వాళ్లలో వాళ్లు ‘పంచుకున్నారు’! నదియా బందీగా ఉన్న భవంతిలోని ఒక గదిలోనైతే రక్తపు చారికలు, రక్తవర్ణ హస్తముద్రలు కనిపించాయి. హింసకు తాళలేక మహిళలు చేసిన ఆక్రందనలు కూడా నదియాను భయకంపితురాలిని చేశాయి.
 
ఫొటోలు తీసి.. ఫోన్ నెంబర్లు వేసి...
నదియాతో పాటు మోసుల్‌లోని నిర్బంధ గృహంలో ఉన్న యువతుల దిన చర్య ఉదయాన్నే బలవంతపు స్నానాలతో మొదలయ్యేది. తర్వాత వారిని షరియా కోర్టుకు చేర్చేవారు. అక్కడ విడివిడిగా ఒక్కొక్కరినీ ఫొటో తీసేవారు. ఫొటోలను కోర్టు లోపలి గోడలకు అంటించేవారు. ఫొటో కింద అప్పటికి ఆ అమ్మాయి ఎవరి అధీనంలో ఉందో ఆ ఉగ్రవాది లేదా కమాండర్ ఫోన్ నెంబరు రాసేవారు. ఫొటోలోని అమ్మాయి నచ్చితే ఆ నెంబరుకు ఫోన్ చేసి బేరం కుదుర్చుకోవచ్చు. డబ్బుల బేరం కాదు. అమ్మాయిలను మార్చుకునే బేరం.
 
నదియా వంతు
ఓ రోజు నదియా వంతు వచ్చింది. ఓ ఎత్తుపళ్లవాడు నదియాను ఒక గదికి తీసుకెళ్లాడు. రెండు వైపుల తలుపులు ఉన్న గది అది. అందులో వాడు రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేసేవాడు. అతడికి భార్య, శారా అనే కూతురు ఉన్నారని, అక్కడికి దగ్గర్లోనే ఓ ఇంట్లో వాళ్లు ఉంటున్నారని వాడి మాటల్లో నదియాకు తెలిసింది. రెండో రోజు నదియాను వాడు మోసుల్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు.

అదే రోజు రాత్రి వాడు నదియాను శుభ్రంగా స్నానం చేసి రమ్మన్నాడు. మంచి బట్టలు వేసుకుని రమ్మన్నాడు. తనకు నచ్చలేదని వాటిని విప్పించి, వేరే వాటిని కట్టించాడు. తర్వాత ఆమె ఇష్టాయిష్టాలతో, ఆమె దేహస్థితితో సంబంధం లేకుండా ఆమెపై అనేకసార్లు అత్యాచారం జరిపాడు. ఆ హింసను తట్టుకోలేక మధ్యలో ఒకసారి పారిపోదామని ప్రయత్నించింది నదియా. ఆ కోపంతో ఆమెను చావబాదాడు వాడు. వివస్త్రను చేశాడు. అలాగే ఈడ్చుకెళ్లి ఆరుగురు ఉగ్రవాదులు ఉన్న ఓ గదిలోకి విసిరేశాడు. ఆమె పలుమార్లు స్పృహకోల్పోయేంతగా ఆ ఆరుగురు ఆమెపై అత్యాచారం జరిపారు. ఆమె శరీరంతో ఇష్టానుసారం ప్రవర్తించారు.
 
పంతం పట్టి తప్పించుకుంది!
కొన్నాళ్లు ఆ గదిలో జీవచ్ఛవంలా గడిపింది నదియా. ఎవరెవరో వచ్చేవారు. ఒకరి తర్వాత ఒకరు నదియాను ఇచ్చిపుచ్చుకునేవారు. ఒంట్లో ప్రాణాలు కళ్లల్లోకి వచ్చేశాయి నదియాకు. కానీ చావకూడదనుకుంది. వాళ్లకు వాళ్లుగా చంపితే తప్ప, తనకు తానుగా చావకూడదనుకుంది. బతికి బట్టకట్టాలనుకుంది. బయటి ప్రపంచంలోకి వెళ్లి ఇక్కడ జరుగుతున్న ఘోరాల గురించి గొంతెత్తి అరిచి చెప్పాలని పంతం పట్టింది. చివరికి 2014 నవంబరులో ఓ రోజు ఆ ముష్కరుల కన్నుగప్పి తప్పించుకుంది. అమెను బందీగా ఉంచినవాడు తాళం వేయడం మర్చిపోయి వెళ్లడంతో నదియా తప్పించునే సాహసం చేసింది. అక్కడి నుంచి శరణార్థి శిబిరానికి చేరుకుంది.
 
విడిపించే వరకు విశ్రమించేది లేదు
నదియా చదువుకున్న అమ్మాయి, తెలివైన అమ్మాయి కావడంతో శిబిరం నిర్వాహకులు ఆమెకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఐసిస్ నుండి తప్పించుకుని వచ్చిన వారిని పునరావాసం కోసం జర్మనీ తరలించడం ఆమె బాధ్యత. జర్మనీలో కొన్ని రోజులు ఉన్నాక అక్కడి నుంచి ఆమె అమెరికా వెళ్లింది.

ఐసిస్ బందీలుగా చిక్కుతున్న యాజిడీ అమ్మాయిల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఆమె చేత ఈ ప్రత్యక్ష సాక్ష్యాన్నంతా ఇప్పించింది యాజిడీ అనే స్వచ్ఛంద సంస్థ. ప్రస్తుతం నదియా... ‘ఐసిస్ చెరలో ఉన్న యువతులను విడిపించాలి’ అన్న ఒకే ఒక లక్ష్యంతో ప్రపంచం అంతా పర్యటిస్తోంది. మరోవైపు ఆమెను హతమార్చే లక్ష్యంతో ఐసిస్ కూడా ఆమె కదలికలపై నిఘా వేసి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.                       
 
నదియా ‘టైమ్’
‘టైమ్’ మేగజైన్ ఏటా 100 మంది వ్యక్తుల జాబితాతో ప్రత్యేక సంచికను విడుదల చేస్తుంటుంది. ఆ జాబితాలో ఏడాది పోప్ ఫ్రాన్సిస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి వారితో పాటు నదియా మూరద్ కూడా ఉన్నారు. ‘కఠోర వాస్తవాలపై వెలుగును ప్రసరింపజేసిన ధ్రువతార’ అని నదియాను కీర్తించింది టైమ్ పత్రిక.
 
నదియా ‘నోబెల్’
ఐసిస్ కబంధహస్తాల నుంచి తప్పించుకుని వచ్చి, ఆ ఉగ్రవాద సంస్థ నికృష్ట రూపాన్ని బట్టబయలు చేసిన యాజిడీ తెగ యువతి నదియా మూరద్‌ను ఇరాక్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది.  ‘స్త్రీజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ఒక చీకటి శక్తితో పోరాడుతున్న ధీశాలి’ అని నదియాను శ్లాఘించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement