అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు
నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - చైతన్య ప్రసాద్, వరంగల్
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు.
ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది.
కారణాలు : మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం.
లక్షణాలు : మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.
చికిత్స : మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.
-డాక్టర్ మురళీ కె .అంకత్ రెడ్డి,ఎండి (హోమియో) స్టార్ హోమియోపతి,హైదరాబాద్