chaitanya prasad
-
అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు
నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - చైతన్య ప్రసాద్, వరంగల్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు : మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు : మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. చికిత్స : మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. -డాక్టర్ మురళీ కె .అంకత్ రెడ్డి,ఎండి (హోమియో) స్టార్ హోమియోపతి,హైదరాబాద్ -
వేదనలో వినిపించిన జీవనవేదం
పాటతత్వం ‘ఆ పాట లేకపోతే ఆ సినిమా లేదు’ అన్నారు చంద్రసిద్ధార్థ్. ‘ఈ మాటలు మనవి కావు, చైతన్యప్రసాద్వి’ అన్నారు బాలు. ‘ఇంత చిన్న వయసులో జీవితానుభవాన్ని కాచి వడబోసిన గొప్ప పాట’ అన్నారో పెద్దాయన. ‘కారులో విజయవాడ చేరేవరకూ ఈ ఒక్క పాటే వింటుం టాను’ అన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ‘ఎప్పుడు విన్నా కన్నీళ్లు ఆగవు’ అంటూ యూ ట్యూబ్‌లో ఎన్నో కామెంట్లు. ఇవి ‘ఆ నలుగురు’ సినిమాలో నేను రాసిన ‘ఒక్కడై రావడం’ పాటకు లభించిన అవార్డుల్లో కొన్ని. ఈ పాటకు నాకు చాలా అవార్డులు వచ్చి వుంటాయని చాలామంది అనుకోవడం నాకు తెలుసు. కానీ ఏ అవార్డులూ రాలేదు. ఈ మాటలే అవార్డులు. చాలాకాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా, 2002లో ‘అల్లరి రాముడు’ నుంచి మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నాను. 2004లో ‘ఆ నలుగురు’ వచ్చింది. అంటే పాటల రచయితగా అవి నా ప్రారంభ దినాలు. ఈ సినిమా ఏమో మామూలు సినిమా కాదు. ఉన్న మూడు పాటలూ ఏదో ఒక తాత్వి కతను ప్రతిఫలించడమో, ప్రతిపాదించడమో చేయాలి. అందుకే లబ్దప్రతిష్టులైన కవులతో రాయించాలని నిర్మాత ప్రేమ్‌కుమార్, రచయిత మదన్ అభిప్రాయపడ్డారు. నన్ను నమ్మింది ఇద్దరే... చంద్రసిద్ధార్థ, ఆర్పీ. మదన్‌తో పేచీ తొందరగానే తెమిలిపోయింది. కానీ ప్రేమ్ కుమార్ మాత్రం దర్శకుడికి ఎదురు చెప్పలేక ఊరుకున్నారు. క్లయిమాక్స్ పాట విషయంలో చివరి వరకూ వేరే అభిప్రాయంతోనే ఉన్నారు. ఈ సినిమా హీరో చావుతో మొదలవు తుంది. అంతా శవం చుట్టూ తిరుగుతుంది. చూసేవాళ్లకు డిప్రెషన్ వస్తుందేమోనని నా భయం. ‘అలా రాకుండా నేను తీస్తానుగా’ అనే వారు చందూ. ఈ పాట విషయంలో కూడా అదే సందేహం వ్యక్తం చేస్తే... ‘చావు గురించి చెబుతూ జీవితం పట్ల ప్రేమ, గౌరవం కలిగేలా రాయండి’ అన్నారు. పైగా పాటకు పల్లవి, చరణాలు లేవు. ట్యూన్‌ను బిట్స్లా ఇచ్చారు ఆర్పీ. ఏవి ఎక్కడ వాడతారో తనకూ తెలీదన్నారు దర్శకులు. నిజానికి రాయడానికైతే విషయం చాలానే ఉంది. చావు పుటకల గురించి భారతీయ తత్వ వేదాంత చింతనల్లో విస్తృత చర్చ ఉంది. ‘సహస్రవర్ష’ కావ్యం రాసేటప్పుడు సృష్టి గురించీ, కర్మ-భక్తి యోగాల గురించీ భగవద్గీతలో అధ్యయం చేసివున్నాను. ఆదర్శ, అభ్యుదయవాదాలూ సుపరిచితాలు. ఆశయా నికీ ఆశలకూ మధ్య నిత్య ఘర్షణ ఎలా ఉంటుందో నా నలభయ్యేళ్ల జీవితంలో నాకు అనుభవమైంది. ప్రేమించినవాళ్లు మరణిస్తే ఆ దుఃఖభారం ఎలా ఉంటుందో తండ్రినీ, ఆత్మీయ బంధుమిత్రుల్నీ కోల్పోయిన నాకు తెలుసు. ఇదంతా ఈ పాటలో చెప్పాలి. వేదన నిర్వేదంగా మారకుండా జీవనవేదంలా చెప్పాలి. కళ్లు కాదు, గుండె చెమ్మగిల్లాలి. బతికితే ఇలా బతకాలి అనిపించాలి. ఆ మథనం లోంచే నా మనసు పలికింది. ‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల/వెంట ఏ బంధమూ.. రక్త సంబంధమూ... తోడుగా రాదుగా తుదివేళ/మరణమనేది ఖాయమని.. మిగిలెను కీర్తి కాయమని/నీ బరువూ నీ పరువూ మోసేదీ/ఆ నలుగురూ... ఆ నలుగురూ నీ బరువునే కాదు నీ పరువును కూడా ఆ నలుగురూ మోస్తారనడం కొత్త వ్యక్తీకరణ. ఇక రెండో చరణంలో కచ్చితంగా కథానాయకుడు విలువల కోసం ఎన్ని కష్టాలు భరించాడో, ఏ ఆశయం కోసం జీవించాడో గుర్తు చేయాలి. నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోశావు/అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే చూపావు/నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా/నీ వెనుకే అనుచరులై నడిచారూ... ఆ నలుగురూ ఆ నలుగురూ మూడో చరణం రాసేటప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం కాటి సీన్లో వాడే జాషువా గారి పద్యాలు గుర్తొచ్చాయి. ఆ బాణీలో రాశాను. రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగదీ యమపాశం/కోట్ల ఐశ్వర్యమూ కటిక దారిద్య్రమూ హద్దులే చెరిపెనీ మరు భూమి/మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం/నీ వెంట కడకంటా నడిచేదీ... ఆ నలుగురూ ఆ నలుగురూ ఇది సినిమాలో పెట్టడానికి కుదరలేదు. ఇక నాలుగో చరణం.. మరణించిన మిత్రుణ్ని మనసారా సంబోధిస్తూ పలికే వీడ్కోలు. ఆ చరణంతో ముగిస్తే సినిమా మన సుల్లో ముద్రపడుతుందని నా అభిప్రాయం. అదే హీరో చితి మంటలపై వచ్చే ఆఖరి చరణం. పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు/ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిర కాలం/ బతికిననాడు బాసటగా పోయిననాడు ఊరటగా/ అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ పాట పూర్తయ్యింది. మొదట్నుంచీ సందేహిస్తూ వచ్చిన నిర్మాత ప్రేమ్‌కుమార్ చెమ్మగిల్లిన కళ్లతో వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవడం ఎంత మధు రానుభవం! ఈ పాటను టీవీల్లో ప్రముఖుల చరమ యాత్రాగీతికగా వాడటం అన్నిటికంటే గొప్ప అనుభూతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌గారి అంతిమయాత్రకు ఇది నేపథ్య గీతం అయ్యింది. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు, నా ఆత్మీక కవిమిత్రుడూ అయిన అరుణ్ సాగర్ అంతిమయాత్ర నేపథ్యంలో కూడా ఈ పాట వినిపిస్తే... కన్నీళ్లను ఆపుకోవడం నా వల్ల కాలేదు. జీవిత ఔన్నత్యాన్ని చెప్పే ఈ గీతం ఎందుకు అందరితో కన్నీళ్లు పెట్టిస్తోందో నాకప్పుడే అనుభవ పూర్వకంగా అర్థమైంది! - చైతన్య ప్రసాద్, గీత రచయిత -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఓ నీలవేణి నీలవేణి రావె అలక మాని నీ హంస నడకలనీ ఫాలో ఔతున్నానని కోపంలోనూ ఇంతందమా... మనకి మనకి తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా... నీడై నీడై పోనా ఇలా.... తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా... నీడై నీడై పోనా ఇలా.... చరణం : 1 ఎండపడి ఎర్రఎర్రగా కందినదే లేతబుగ్గ గొంతు తడి ఆరి ఎంతగా వాడినదొ మల్లెమొగ్గ నీకోసం నీలిమబ్బునై ఆకాశం చేరనా నేనే ఓ వానజల్లులై ఒళ్లంతా తడమనా కూడా కూడా రానా... నీడై నీడై పోనా... తేడాలెన్నో ఉన్నా... ఇలా హా... ఇలా... హా... చరణం : 2 సోయగము విసిరి గుండెకే చేయకిక తీపి గాయం సోకులతో నన్ను చంపడం నీకు ఇది ఏమి న్యాయం నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా నువ్వేడు మల్లెలెత్తు అని ఇష్టంగా మోయనా కూడా కూడా రానా... నీడై నీడై పోనా... తేడాలెన్నో ఉన్నా... ఇలా హా... ఇలా... హా... చిత్రం : ఏమో గుర్రం ఎగరావచ్చు (2014) రచన : చైతన్యప్రసాద్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : రాహుల్ సిప్లీగంజ్ -
చైతన్య ప్రసాద్‌కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సబ్ జూనియర్ వుషు టోర్నమెంట్లో బాలుర విభాగంలో చైతన్య ప్రసాద్(హైదరాబాద్) స్వర్ణం సాధించాడు. మహేష్ బిస్తి(రంగారెడ్డి) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, శ్రీరామ్(నిజామాబాద్), గౌతమ్(రంగారెడ్డి) కాంస్య పతకం గెలుచుకున్నారు. రాష్ట్ర వుషు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో గురవారం ఈ పోటీలు ముగిశాయి. విజేతలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వుషు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎ.ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి అబ్బాస్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: బాకి దౌషు ఈవెంట్: 1. వంశీ (నిజామాబాద్), 2. నితీష్ (పశ్చిమ గోదావరి), 3. ఫహారా ఖాన్(రంగారెడ్డి).