వేదనలో వినిపించిన జీవనవేదం
పాటతత్వం
‘ఆ పాట లేకపోతే ఆ సినిమా లేదు’ అన్నారు చంద్రసిద్ధార్థ్. ‘ఈ మాటలు మనవి కావు, చైతన్యప్రసాద్‌వి’ అన్నారు బాలు. ‘ఇంత చిన్న వయసులో జీవితానుభవాన్ని కాచి వడబోసిన గొప్ప పాట’ అన్నారో పెద్దాయన. ‘కారులో విజయవాడ చేరేవరకూ ఈ ఒక్క పాటే వింటుం టాను’ అన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ‘ఎప్పుడు విన్నా కన్నీళ్లు ఆగవు’ అంటూ యూ ట్యూబ్‌లో ఎన్నో కామెంట్లు. ఇవి ‘ఆ నలుగురు’ సినిమాలో నేను రాసిన ‘ఒక్కడై రావడం’ పాటకు లభించిన అవార్డుల్లో కొన్ని.
ఈ పాటకు నాకు చాలా అవార్డులు వచ్చి వుంటాయని చాలామంది అనుకోవడం నాకు తెలుసు. కానీ ఏ అవార్డులూ రాలేదు. ఈ మాటలే అవార్డులు. చాలాకాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా, 2002లో ‘అల్లరి రాముడు’ నుంచి మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నాను. 2004లో ‘ఆ నలుగురు’ వచ్చింది. అంటే పాటల రచయితగా అవి నా ప్రారంభ దినాలు. ఈ సినిమా ఏమో మామూలు సినిమా కాదు. ఉన్న మూడు పాటలూ ఏదో ఒక తాత్వి కతను ప్రతిఫలించడమో, ప్రతిపాదించడమో చేయాలి. అందుకే లబ్దప్రతిష్టులైన కవులతో రాయించాలని నిర్మాత ప్రేమ్‌కుమార్, రచయిత మదన్ అభిప్రాయపడ్డారు. నన్ను నమ్మింది ఇద్దరే... చంద్రసిద్ధార్‌థ, ఆర్పీ. మదన్‌తో పేచీ తొందరగానే తెమిలిపోయింది. కానీ ప్రేమ్ కుమార్ మాత్రం దర్శకుడికి ఎదురు చెప్పలేక ఊరుకున్నారు. క్లయిమాక్స్ పాట విషయంలో చివరి వరకూ వేరే అభిప్రాయంతోనే ఉన్నారు.
ఈ సినిమా హీరో చావుతో మొదలవు తుంది. అంతా శవం చుట్టూ తిరుగుతుంది. చూసేవాళ్లకు డిప్రెషన్ వస్తుందేమోనని నా భయం. ‘అలా రాకుండా నేను తీస్తానుగా’ అనే వారు చందూ. ఈ పాట విషయంలో కూడా అదే సందేహం వ్యక్తం చేస్తే... ‘చావు గురించి చెబుతూ జీవితం పట్ల ప్రేమ, గౌరవం కలిగేలా రాయండి’ అన్నారు. పైగా పాటకు పల్లవి, చరణాలు లేవు. ట్యూన్‌ను బిట్స్‌లా ఇచ్చారు ఆర్పీ. ఏవి ఎక్కడ వాడతారో తనకూ తెలీదన్నారు దర్శకులు. నిజానికి రాయడానికైతే విషయం చాలానే ఉంది. చావు పుటకల గురించి భారతీయ తత్వ వేదాంత చింతనల్లో విస్తృత చర్చ ఉంది.
‘సహస్రవర్ష’ కావ్యం రాసేటప్పుడు సృష్టి గురించీ, కర్మ-భక్తి యోగాల గురించీ భగవద్గీతలో అధ్యయం చేసివున్నాను. ఆదర్శ, అభ్యుదయవాదాలూ సుపరిచితాలు. ఆశయా నికీ ఆశలకూ మధ్య నిత్య ఘర్షణ ఎలా ఉంటుందో నా నలభయ్యేళ్ల జీవితంలో నాకు అనుభవమైంది. ప్రేమించినవాళ్లు మరణిస్తే ఆ దుఃఖభారం ఎలా ఉంటుందో తండ్రినీ, ఆత్మీయ బంధుమిత్రుల్నీ కోల్పోయిన నాకు తెలుసు. ఇదంతా ఈ పాటలో చెప్పాలి. వేదన నిర్వేదంగా మారకుండా జీవనవేదంలా చెప్పాలి. కళ్లు కాదు, గుండె చెమ్మగిల్లాలి. బతికితే ఇలా బతకాలి అనిపించాలి. ఆ మథనం లోంచే నా మనసు పలికింది.
‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల/వెంట ఏ బంధమూ.. రక్త సంబంధమూ... తోడుగా రాదుగా తుదివేళ/మరణమనేది ఖాయమని.. మిగిలెను కీర్తి కాయమని/నీ బరువూ నీ పరువూ మోసేదీ/ఆ నలుగురూ... ఆ నలుగురూ
నీ బరువునే కాదు నీ పరువును కూడా ఆ నలుగురూ మోస్తారనడం కొత్త వ్యక్తీకరణ. ఇక రెండో చరణంలో కచ్చితంగా కథానాయకుడు విలువల కోసం ఎన్ని కష్టాలు భరించాడో, ఏ ఆశయం కోసం జీవించాడో గుర్తు చేయాలి. నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోశావు/అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే చూపావు/నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా/నీ వెనుకే అనుచరులై నడిచారూ... ఆ నలుగురూ ఆ నలుగురూ
మూడో చరణం రాసేటప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం కాటి సీన్లో వాడే జాషువా గారి పద్యాలు గుర్తొచ్చాయి. ఆ బాణీలో రాశాను. రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగదీ యమపాశం/కోట్ల ఐశ్వర్యమూ కటిక దారిద్య్రమూ హద్దులే చెరిపెనీ మరు భూమి/మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం/నీ వెంట కడకంటా నడిచేదీ... ఆ నలుగురూ ఆ నలుగురూ
ఇది సినిమాలో పెట్టడానికి కుదరలేదు. ఇక నాలుగో చరణం.. మరణించిన మిత్రుణ్ని మనసారా సంబోధిస్తూ పలికే వీడ్కోలు. ఆ చరణంతో ముగిస్తే సినిమా మన సుల్లో ముద్రపడుతుందని నా అభిప్రాయం. అదే హీరో చితి మంటలపై వచ్చే ఆఖరి చరణం. పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు/ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిర కాలం/ బతికిననాడు బాసటగా పోయిననాడు ఊరటగా/ అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ
పాట పూర్తయ్యింది. మొదట్నుంచీ సందేహిస్తూ వచ్చిన నిర్మాత ప్రేమ్‌కుమార్ చెమ్మగిల్లిన కళ్లతో వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవడం ఎంత మధు రానుభవం! ఈ పాటను టీవీల్లో ప్రముఖుల చరమ యాత్రాగీతికగా వాడటం అన్నిటికంటే గొప్ప అనుభూతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌గారి అంతిమయాత్రకు ఇది నేపథ్య గీతం అయ్యింది. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు, నా ఆత్మీక కవిమిత్రుడూ అయిన అరుణ్ సాగర్ అంతిమయాత్ర నేపథ్యంలో కూడా ఈ పాట వినిపిస్తే... కన్నీళ్లను ఆపుకోవడం నా వల్ల కాలేదు. జీవిత ఔన్నత్యాన్ని చెప్పే ఈ గీతం ఎందుకు అందరితో కన్నీళ్లు పెట్టిస్తోందో నాకప్పుడే అనుభవ పూర్వకంగా అర్థమైంది!
- చైతన్య ప్రసాద్, గీత రచయిత