పీసీఓడీ  పూర్తిగా నయమవుతుందా? | Family health counseling special | Sakshi
Sakshi News home page

పీసీఓడీ  పూర్తిగా నయమవుతుందా?

Published Thu, Nov 1 2018 12:38 AM | Last Updated on Thu, Nov 1 2018 12:38 AM

Family health counseling special - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా భార్య వయసు 35 ఏళ్లు. ఇటీవల ఆమె ఒంటిపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియోలో పూర్తిగా నయమయ్యేలా పీసీఓడీకి మంచి చికిత్స ఉందా?  – జె. సాగర్,  సిద్దిపేట 
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి  నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్‌ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. 

లక్షణాలు:నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానంకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు.  రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్‌ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్‌ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్‌ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్‌ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. 
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్,  హైదరాబాద్‌

చాలాకాలంగా పాపకు  చెవి నొప్పి...  తగ్గుతుందా? 
మా పాపకు తొమ్మిది. గత మూడేళ్ల నుంచి చెవినొప్పితో వస్తోంది. చెవిలో చీము, వాపు కూడా కనపడుతున్నాయి. ఏడాదిగా ఈ సమస్య దాదాపు రోజూ కనిపిస్తోంది.  ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్‌టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్‌ చెయ్యాలంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స చెప్పండి.  – సాయి ప్రతాప్,  విశాఖపట్నం 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్‌ ఒటైటిస్‌ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. 
కారణాలు:
∙ కర్ణభేరి (ఇయర్‌ డ్రమ్‌)కు రంధ్రం ఏర్పడటం 
∙ మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం 
∙ చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం 
∙ ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈ సమస్య రావచ్చు. 

లక్షణాలు :
∙ తీవ్రమైన జ్వరం ∙ వినికిడి లోపం ∙ శరీరం సంతులనం కోల్పోవడం 
∙ చెవి నుంచి చీము కారడం ∙ ముఖం బలహీన పడటం ∙ తీవ్రమైన చెవి/తలనొప్పి ∙ చెవి వెనకాల వాపు రావడం. 

నిర్ధారణ:
 ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌–రే 

చికిత్స :
దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్‌ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మూత్ర  విసర్జన  సమయంలో  భరించలేని  మంట!
నా వయసు 32 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతేకాదు విసర్జన సమయంలో చాలా మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి.
– ఒక సోదరి,  నకిరేకల్‌ 

మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. 

అప్పర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ : 
ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. 
లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌
ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్‌ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్‌ అంటారు. 

కారణాలు
యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ–కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. 

లక్షణాలు
మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట  ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం 

చికిత్స
హోమియోలో వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి  మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement