గ్యాస్ట్రయిటిస్ తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. వృత్తి రీత్యా నిత్యం ఊళ్లు తిరుగుతూ లాడ్జీల్లో దిగుతూ ఉంటాను. అక్కడికి దగ్గర్లో ఉండే ఏ హోటల్ పడితే ఆ హోటల్‌లో భోజనం చేస్తుంటాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్రై్టటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు కొద్దిపాటి ఉపశమనం ఉన్నప్పటికీ, మానాక మళ్లీ మామూలే. ఈ సమస్య హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – రామకృష్ణారావు, విజయవాడ
ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో గ్యాస్రై్టటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్రై్టటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్రై్టటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్రై్టటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.
కారణాలు : ∙20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్రై్టటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్రై్టటిస్ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు :
∙మీరు ఊళ్లు తిరగాల్సి వస్తున్నా ఒకవేళ మీరు మీ ఊరి నుంచి బయల్దేరే సమయంలో మధ్యానం మీ ఇంటి భోజనమే చేసేలా కాస్త బాక్స్ కట్టుకొని వెళ్లడానికి వీలుంటుందేమో చూడండి. అలాగే రాత్రి భోజనం వేళకు ఇంటికి తిరిగి రాగలిగే అవకాశం కూడా ఉందేమో చూసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు కాస్త శుచిగల తిండి పెట్టగల భోజనశాలలను ఆశ్రయించడం మేలు.
∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.
చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్