ఐవరీ కోస్ట్ | Ivory Coast | Sakshi
Sakshi News home page

ఐవరీ కోస్ట్

Published Sat, Jan 17 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

ఐవరీ కోస్ట్

ఐవరీ కోస్ట్

ప్రపంచ వీక్షణం
 
 నైసర్గిక స్వరూపం
 వైశాల్యం: 3,22,463 చదరపు కిలోమీటర్లు
 జనాభా: 2,39,19,000 (తాజా అంచనాల ప్రకారం)
 రాజధాని: యామూస్సోక్రో
 కరెన్సీ: సిఎఫ్‌ఎ ఫ్రాంక్
 ప్రభుత్వం: ఏకపార్టీ పాలన
 భాషలు: ఫ్రెంచి, ఆటవిక తెగల భాషలు
 మతం: (సున్నీ) ముస్లింలు 39 శాతం, క్రైస్తవులు 32శాతం, అనిమిజం అనే సంప్రదాయిక ఆఫ్రికన్ మతం 12 శాతం, ఇతరులు 17 శాతం
 వాతావరణం: సంవత్సరమంతా దాదాపు 22 నుండి 32 డిగ్రీల సెల్సియస్
 స్వాతంత్య్ర దినోత్సవం: 1960, ఆగస్టు 7
 సరిహద్దులు: మాలి, బుర్కినా, ఘనా, గినీ, నైబీరియా, అట్లాంటిక్ మహాసముద్రం
 పంటలు: కోకో, కాఫీ, పత్తి, అరటి, పైనాపిల్, రబ్బరు, చక్కెర, వరి, కస్సావా, యామ్
 పరిశ్రమలు: వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, తోలు వస్తువులు, అటవీ ఉత్పత్తులు, గనులు, పెట్రోలు శుద్ధి.
 
చరిత్ర

పదిహేనవ శతాబ్దం నుండీ ఈ ప్రాంతాన్ని కొందరు యూరోపియన్లు ఆక్రమించుకొని ఏనుగు కొమ్ములను, బానిసలను కొని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. అలా ఏనుగు కొమ్ముల వల్ల ఈ ప్రాంతాన్ని ఐవరీకోస్ట్ అన్నారు. దేశంలో విస్తారంగా, అడవులు, సవన్నా మైదానాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలో ఫ్రెంచి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, 1960 వరకు తమ ఆధిపత్యం ఉంచుకున్నారు. ఏ పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించినా బాగా అభివృద్ధి చేయడం వల్ల ఈ రోజు ఈ దేశం ఎంతో ఐశ్వర్యంగా, ఎంతో అధునాతనంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఫ్రెంచి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు.
     
పరిపాలనా పద్ధతులు

దేశంలో పరిపాలన కోసం రీజియన్లు, జిల్లాలుగా విభజింపబడి ఉంది. దేశంలో మొత్తం 21 రీజియన్‌లు,
4 జిల్లాలు ఉన్నాయి. దేశానికి రాజధాని, యాముస్సోక్రో అయినా, పరిపాలన అంతా అబిద్‌జాన్ నగరం నుండే నడుస్తూ ఉంటుంది. అన్ని దేశాల కార్యాలయాలు అబిద్‌జాన్ నగరంలోనే ఉన్నాయి.దేశంలో ఫ్రెంచ్ భాష అధికార భాష అయినా, దాదాపు 65 స్థానిక భాషలు మాట్లాడే తెగలవారు ఉన్నారు. వీటిల్లో ముఖ్యమైన భాష ద్యూలా. దేశంలో ఉన్న పెద్ద నగరాలు - అబిద్‌జాన్, అబోబో, బోకే, అలోవా, సాన్‌పెడ్రో, యాముసూక్రో, కార్వొగో, మాన్, దివో, గగ్నోవా.
 
ఆహారం

దేశంలో ప్రజల ముఖ్య ఆహారం మొక్కజొన్న పిండితో చేసిన పేస్టు. దీనినే అయిటూ అంటారు. అరటి, కసావాలు ఆహారంలో ముఖ్యమైన భాగం. వీరు పామ్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అలూకో అనే ఆహారం, చేపలతో చేసిన కూరలు, మాంసం, వీరి ఆహారంలో ఒక భాగం. స్థానికంగా బంగూయి అనే పేరుతో పిలిచే సారాయి స్థానికంగా బాగా ప్రాచుర్యంలో ఉంది.
 
ప్రజలు - సంస్కృతి

దేశంలో దాదాపు 65 తెగల ప్రజలు ఉండడం వల్ల ప్రతి తెగవారు కూడా తమతమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఉన్నారు. దేశం మొత్తంలో ముస్లిములు రంజాన్ నెలను పాటిస్తారు. ‘మాన్’ పేరుతో పిలిచే మాస్కుల పండుగ దేశమంతా జరుపుకుంటారు. మార్చి నెలలో బొకే అనే పండుగను జరుపుతారు. ఇది వారంరోజుల పాటు జరిగే కార్నివాల్.
 
వ్యవసాయ పనుల్లో ఉండే మహిళలు సాధారణంగా భుజాల వరకు ఉండే దుస్తులను ధరిస్తారు. పట్టణాలలో ఉండేవాళ్ళు ప్యాంటు, షర్టు ధరిస్తారు. పండుగల సమయంలో మాత్రం అందరూ తమ తమ సంస్కృతీసంప్రదాయాల ప్రకారం వస్త్రధారణ చేస్తారు. ఇవి చూడడానికి ఎంతో విచిత్రంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో పురుషులు పాంటు గానీ, పొట్టిగా ఉండే నిక్కరు గానీ ధరిస్తారు. ఈ దేశంలో ఇప్పటికీ ఆటవిక జాతుల వాళ్ళు ఉన్నారు. వీరు జంతువులను వేటాడి పొట్టపోసుకుంటుంటారు. ఆడవాళ్ళు మెడలోనూ, తలకు పూసలదండలు ధరిస్తారు.
 
 దేశంలో చూడదగిన ప్రదేశాలు...
 
1. అబిద్‌జాన్ నగరం

ఈ నగరం మొత్తం పశ్చిమ ఆఫ్రికా ఖండంలోనే ఒక అందమైన నగరం. దేశంలో నాలుగో పెద్దనగరం. ఈ నగరం ఒకప్పుడు రాజధానిగా ఉండేది. అయినా కూడా ఈ నగరంలోనే ప్రస్తుతం అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఫ్రెంచి భాష మాట్లాడతారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నగరం గుండెకాయ లాంటిది. నగరంలో సెయింట్‌పాల్ కాథడ్రల్, ఐవరీ హోటల్ శిథిలాలు కనబడతాయి. సముద్రతీరంలో ఉండడం వల్ల ఈ నగరం చుట్టుపక్కల నీలి నీళ్ళ లగూన్‌లు ఏర్పడి ఉన్నాయి. నగరంలో జాతీయ మ్యూజియంలు, ఐఫన్ మ్యూజియంలు ఉన్నాయి. లగూన్‌లలో స్కూబాడ్రైవింగ్ మొదలైన ఆటలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.
 
 
2. యాముస్సోక్రో

ఐవరీ కోస్ట్ దేశానికి ఈ నగరం రాజధాని. అయితే ఇది పేరుకే రాజధాని నగరం. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అబిద్‌జాన్ నగరం నుండే జరుగుతాయి. నగరంలో లేడీ ఆఫ్ పీస్ బాసిలికా ప్రముఖంగా చూడదగిన కట్టడం. ఇది వాటికన్ నగరంలో ఉన్న సెయింట్ పీటర్ బాసిలికా కన్నా చాలా విశాలంగా ఉంటుంది. భవనంపైన ఉన్న డోము చాలా విశాలంగా ఉంటుంది. ఇదొక గొప్ప కట్టడం.
 పోప్‌జాన్ పాల్-2 దీనిని ఒక పవిత్ర ప్రదేశంగా ప్రకటించాడు. దీనిలోపల 18 వేల మంది, బయట 3 లక్షలకు పైగా జనం ఒకేసారి కూర్చోగలుగుతారు. ఈ నగరంలో శిల్పకళను అద్భుతంగా చెక్కిన ముస్లిముల మసీదులు కూడా ఉన్నాయి. నగరం అన్ని మతాలకు ప్రతీకగా కనబడుతుంది. దేశాన్ని పాలించిన మొదటి రాష్ట్రపతి సొంత ఊరు ఇదే. దానితో ఆయన ఈ నగరాన్ని బాగా అభివృద్ధి చేశాడు. రాజప్రాసాదాలు ఈ నగరంలో చాలా ఉన్నాయి.
     
3. బోకే నగరం

ఈ నగరం దేశంలో రెండో అతి పెద్ద నగరం. ఇది వల్లీడు బందామా రీజియన్‌లో ఉంది. ఈ నగరం చుట్టుపక్కల పత్తిపంటలు, పత్తి జిన్నింగ్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఈ నగరం హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. నగరం పరిసరాలలో చెరకు మిల్లులు, దుస్తుల తయారీ పరిశ్రమలు, భవన నిర్మాణరంగ పరిశ్రమలు, వరి పండించే భూమి అధికంగా ఉన్నాయి. ఈ నగరం పరిసరాలలో బంగారు, పాదరసం, మాంగనీసు గనులు ఉన్నాయి.
 
ఒకప్పుడు ఈ నగరం బానిసలను కొనడం, అమ్మడంలో పేరు గాంచిన నగరం. ఈ నగరంలో బొకే కార్నివాల్ మార్చిలో జరుగుతుంది. దీనిలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి, ఇతర దేశాల నుండి ప్రజలు అధికంగా వస్తారు. ఈ నగరంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అధికంగా ఉన్నాయి.
 
4. టాయి జాతీయ పార్కు

ఈ పార్కును 1982లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎన్నిక చేసింది. ఈ పార్కు దాదాపు 3300 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది.
 
ఈ పార్కులో 1300 రకాల మొక్కలు, 50 రకాలు జంతువులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన రకాల కోతుల జాతులు ఇక్కడ ఉన్నాయి. 2000 చింపాంజీలు ఉన్నాయి. చిరుత పులులు, హిప్పోలు, అడవి దున్నలు, ఆంటిలో్‌ప్‌లు, 250 రకాల పక్షులకు ఈ పార్కు నిలయంగా ఉంది. 40 రకాల పాములు, 50 రకాల ఉభయ చరాలు కూడా ఈ పార్కులో మనకు దర్శనమిస్తాయి. 1926లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇది అబిద్‌జాన్ నగరానికి సమీపంలో ఉంటుంది. ఈ దేశంలో ఇంకా బాంకో జాతీయ పార్కు, కోమో జాతీయ పార్కు, ఐలిస్ ఎహోటైల్స్ జాతీయ పార్కు మారాహేన్ జాతీయ పార్కు మాంట్ పెకో జాతీయ పార్కు, మాంట్ సాంగ్‌చే జాతీయ పార్కు ఉన్నాయి.
 
5. చారిత్రక నగరం - గ్రాండ్ బాసమ్

ఈ నగరం ఒకప్పుడు ఐవరీకోస్ట్ దేశానికి ఫ్రెంచివాళ్ళ రాజధానినగరం. ఇది కోమో నదితీరంలో నిర్మితమై ఉంది. ఒకప్పుడు ఇది గొప్ప ఓడరేపు నగరం. ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. 1880లో ఈ నగరం నిర్మితమైంది. ఈ నగరంలో భవనాలన్నీ ఫ్రెంచి వాళ్ళ వాస్తుశైలిని పోలి ఉంటాయి. అయితే అబిద్‌జాన్ నగరం రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల నగరంలోని అనేక పురాతన భవనాలు నేడు శిథిలలావస్థకు
 చేరాయి.
 
వంద సంవత్సరాల క్రితం ఈ నగరం ఫ్రెంచి వాళ్ళ పాలనలో గొప్ప వెలుగు వెలిగింది. ఇక్కడే వారి అధికారిక భవనాలు ఎన్నో ఉండేవి. ఇప్పుడవన్నీ మసకబారిపోతున్నాయి. సముద్రతీరం, బీచ్‌లు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. జనం లేక ఎన్నో భవనాలు ఖాళీగా కనిపిస్తాయి. రంగులు వెలసిపోయిన ఈ భవనాలను చూస్తుంటే ఒకప్పటి రాజరికం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement