ivory coast
-
ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం
అబుజాన్: ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది దుర్మరణం పాలవ్వగా 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దేశ రవాణాశాఖ మంత్రి స్పందించారు.రోడ్లపై ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఐవరీకోస్ట్‌లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో ఏటా వెయ్యి మంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గత నెలలోనే దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదీ చదవండి: స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి హత్య -
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్.. కేవలం 7 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ కేవలం 7 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. దీనికి ముందు టీ20 అత్యల్ప స్కోర్ రికార్డు ఐసిల్ ఆఫ్ మ్యాచ్, మంగోలియా జట్ల పేరిట ఉండేది. ఈ రెండు జట్లు గతంలో 10 పరుగులకే ఆలౌటయ్యాయి.నైజీరియా-ఐవరీ కోస్ట్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ సెలిమ్ సలౌ విధ్వంసకర శతకం (53 బంతుల్లో 112 రిటైర్డ్ ఔట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది నైజీరియా భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. నైజీరియా ఇన్నింగ్స్‌లో ఐసక్ ఓక్పే (23 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సులేమాన్ (29 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరుపు అర్ద శతకాలు బాదారు. ఐవరీ కోస్ట్ బౌలర్లలో పంబా దిమిత్రి, విల్ఫ్రైడ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐవరీ కోస్ట్.. 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నైజీరియా 264 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఐవరీ కోస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు బ్యాటర్లు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మొహమ్మద్ చేసిన నాలుగు పరుగులే టాప్ స్కోర్‌గా నిలిచాయి. ఈ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. -
ఫుట్‌బాలర్ జాహా ఔదార్యం
లండన్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నిరంతరాయంగా శ్రమిస్తోన్న వైద్యులకు సాంత్వన కల్పించేందుకు ఐవరీకోస్ట్ యువ ఫుట్‌బాలర్ విల్ఫ్రెడ్ జాహా ముందుకొచ్చాడు. లండన్‌లో తనకున్న 50 వాణిజ్య ప్రాపర్టీలను ఉచితంగా వైద్యుల వసతి కోసం కేటాయించాడు. ప్రీమియర్ లీగ్ క్లబ్లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే జాహా ఈ లీగ్ ద్వారా వారానికి కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తాడు. ఈ ప్రాపర్టీలను కార్పొరేట్ క్లయింట్ల అవసరాల కోసం అందుబాటులో ఉంచే జాహా... వీటిని ఇంటికి వెళ్లేంత సమయం లేని వైద్యుల వసతి కోసం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘మనం మంచి చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. నాకు జాతీయ ఆరోగ్య సేవా సంస్థలో పనిచేసే స్నేహితులు ఉన్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారో నాకు తెలుసు. ఆరోగ్య శాఖలో పనిచేసే వారు వీటిని ఉపయోగించుకోవచ్చు’ అని జాహా పేర్కొన్నాడు. జాహా కన్నా ముందు మాంచెస్టర్ యునైటైడ్ మాజీ స్టార్ ప్లేయర్ గ్యారీ నెవెలీ తన హోటల్స్‌లోని 176 గదులను, చెల్సీ యజమాని రోమన్ అబ్రామోవిచ్ 72 గదులను వైద్యుల కోసం కేటాయించారు. -
నీటిలో తేలియాడే కృత్రిమ దీవి
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరు పనికి రాదని పడేసిన చెత్త, మరొకరికి విలువైనదిగా పనికొస్తుందంటే ఇదే! సముద్రపు ఒడ్డున పర్యాటకులు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఫ్రెంచ్ కంప్యూటర్ ఇంట్రిప్రీనర్ ఎరిక్ బెకర్ ఏరుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, అలా ఏడు లక్షల బాటిళ్లను ఏరి వాటితోని నీటి మీద తేలియాడే కృత్రిమ దీవిని నిర్మించారు. ముందుగా దానిపై తాను ఉండేందుకు ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ దీవిని కూడా ఎందుకు వ్యాపారానికి ఉపయోగించుకోకూడదని అనుకున్నారో, ఏమో! ఆ దీవిపై ఒక హోటల్‌ను, ఓ బార్‌ను, రెండు కృత్రిమ స్విమ్మింగ్ పూల్స్‌ను, రాత్రి బసకు రెండు మూడు షెడ్లను నిర్మించి పర్యాటకులకు స్వాగతం పలికారు. అంతే ప్రకతి ప్రేమికులు, పర్యావరన పరిరక్షణ కార్యకర్తలు, ప్లాస్టిట్ వేస్ట్‌ను ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు కృత్రిమ దీవికి క్యూలు కట్టారు. ఈ దీవిపై ఒక రోజు గడపడానికి వంద డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ దీవిపై ఆకర్షణీయంగా చెట్లు, పొదలను కూడా పెంచారు. ఈ దీవి వెయ్యి చదరపు మీటర్లు ఉంటుంది. పర్యాటకులు దీనికి పడవపైనే రావాల్సి ఉంటుంది. ఊరికే పగలు చూసి పోవడానికైతే 25 డాలర్లు వసూలు చేస్తారు. రాత్రికి భోజనం, బస చేయాలంటే వంద డాలర్లు వసూలు చేస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని అబిద్జాన్ పట్టణ శివారులో సముద్రం పక్కన నీటి మడుగులో ఈ కృత్రిమ తేలియాడే దీవిని నిర్మించారు. వారానికి వంద మంది పర్యాటకులు వస్తున్నారని, వారితో తనకు అంతో ఇంతో డబ్బు రావడమే కాకుండా, ప్లాస్టిక్ వేస్టేజ్‌ని కొంతైనా సద్వినియోగం చేశానన్న సంతప్తి ఉందని ఆయన ఏఎఫ్‌పీ మీడియాతో వ్యాఖ్యానించారు. -
సముద్ర తీరంలో కూలిన విమానం
అబిద్జాన్ : పశ్చిమ ఆఫ్రికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అబిద్జాన్లోని ఐవరీ కోస్ట్ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని రాయిటర్స్ స్పష్టం చేసింది. ఐవరీ కోస్ట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నాయి. కూలిపోయిన విమానంలో నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో రెండు మృతదేహాలు వెలికి తీయాల్సి ఉండగా ఇద్దరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. అబిద్జాన్ పెద్దమొత్తం జనాభా గల నగరం. దీంతో తీరంలో ఈ విమానం కూలిపోయిన కారణంగా ఇంకెవరైనా మృత్యువాత పడ్డారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. -
ఐవరీ కోస్ట్
ప్రపంచ వీక్షణం నైసర్గిక స్వరూపం వైశాల్యం: 3,22,463 చదరపు కిలోమీటర్లు జనాభా: 2,39,19,000 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: యామూస్సోక్రో కరెన్సీ: సిఎఫ్ఎ ఫ్రాంక్ ప్రభుత్వం: ఏకపార్టీ పాలన భాషలు: ఫ్రెంచి, ఆటవిక తెగల భాషలు మతం: (సున్నీ) ముస్లింలు 39 శాతం, క్రైస్తవులు 32శాతం, అనిమిజం అనే సంప్రదాయిక ఆఫ్రికన్ మతం 12 శాతం, ఇతరులు 17 శాతం వాతావరణం: సంవత్సరమంతా దాదాపు 22 నుండి 32 డిగ్రీల సెల్సియస్ స్వాతంత్య్ర దినోత్సవం: 1960, ఆగస్టు 7 సరిహద్దులు: మాలి, బుర్కినా, ఘనా, గినీ, నైబీరియా, అట్లాంటిక్ మహాసముద్రం పంటలు: కోకో, కాఫీ, పత్తి, అరటి, పైనాపిల్, రబ్బరు, చక్కెర, వరి, కస్సావా, యామ్ పరిశ్రమలు: వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, తోలు వస్తువులు, అటవీ ఉత్పత్తులు, గనులు, పెట్రోలు శుద్ధి. చరిత్ర పదిహేనవ శతాబ్దం నుండీ ఈ ప్రాంతాన్ని కొందరు యూరోపియన్లు ఆక్రమించుకొని ఏనుగు కొమ్ములను, బానిసలను కొని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. అలా ఏనుగు కొమ్ముల వల్ల ఈ ప్రాంతాన్ని ఐవరీకోస్ట్ అన్నారు. దేశంలో విస్తారంగా, అడవులు, సవన్నా మైదానాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలో ఫ్రెంచి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, 1960 వరకు తమ ఆధిపత్యం ఉంచుకున్నారు. ఏ పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించినా బాగా అభివృద్ధి చేయడం వల్ల ఈ రోజు ఈ దేశం ఎంతో ఐశ్వర్యంగా, ఎంతో అధునాతనంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఫ్రెంచి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. పరిపాలనా పద్ధతులు దేశంలో పరిపాలన కోసం రీజియన్లు, జిల్లాలుగా విభజింపబడి ఉంది. దేశంలో మొత్తం 21 రీజియన్లు, 4 జిల్లాలు ఉన్నాయి. దేశానికి రాజధాని, యాముస్సోక్రో అయినా, పరిపాలన అంతా అబిద్జాన్ నగరం నుండే నడుస్తూ ఉంటుంది. అన్ని దేశాల కార్యాలయాలు అబిద్జాన్ నగరంలోనే ఉన్నాయి.దేశంలో ఫ్రెంచ్ భాష అధికార భాష అయినా, దాదాపు 65 స్థానిక భాషలు మాట్లాడే తెగలవారు ఉన్నారు. వీటిల్లో ముఖ్యమైన భాష ద్యూలా. దేశంలో ఉన్న పెద్ద నగరాలు - అబిద్జాన్, అబోబో, బోకే, అలోవా, సాన్పెడ్రో, యాముసూక్రో, కార్వొగో, మాన్, దివో, గగ్నోవా. ఆహారం దేశంలో ప్రజల ముఖ్య ఆహారం మొక్కజొన్న పిండితో చేసిన పేస్టు. దీనినే అయిటూ అంటారు. అరటి, కసావాలు ఆహారంలో ముఖ్యమైన భాగం. వీరు పామ్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అలూకో అనే ఆహారం, చేపలతో చేసిన కూరలు, మాంసం, వీరి ఆహారంలో ఒక భాగం. స్థానికంగా బంగూయి అనే పేరుతో పిలిచే సారాయి స్థానికంగా బాగా ప్రాచుర్యంలో ఉంది. ప్రజలు - సంస్కృతి దేశంలో దాదాపు 65 తెగల ప్రజలు ఉండడం వల్ల ప్రతి తెగవారు కూడా తమతమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఉన్నారు. దేశం మొత్తంలో ముస్లిములు రంజాన్ నెలను పాటిస్తారు. ‘మాన్’ పేరుతో పిలిచే మాస్కుల పండుగ దేశమంతా జరుపుకుంటారు. మార్చి నెలలో బొకే అనే పండుగను జరుపుతారు. ఇది వారంరోజుల పాటు జరిగే కార్నివాల్. వ్యవసాయ పనుల్లో ఉండే మహిళలు సాధారణంగా భుజాల వరకు ఉండే దుస్తులను ధరిస్తారు. పట్టణాలలో ఉండేవాళ్ళు ప్యాంటు, షర్టు ధరిస్తారు. పండుగల సమయంలో మాత్రం అందరూ తమ తమ సంస్కృతీసంప్రదాయాల ప్రకారం వస్త్రధారణ చేస్తారు. ఇవి చూడడానికి ఎంతో విచిత్రంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో పురుషులు పాంటు గానీ, పొట్టిగా ఉండే నిక్కరు గానీ ధరిస్తారు. ఈ దేశంలో ఇప్పటికీ ఆటవిక జాతుల వాళ్ళు ఉన్నారు. వీరు జంతువులను వేటాడి పొట్టపోసుకుంటుంటారు. ఆడవాళ్ళు మెడలోనూ, తలకు పూసలదండలు ధరిస్తారు. దేశంలో చూడదగిన ప్రదేశాలు... 1. అబిద్జాన్ నగరం ఈ నగరం మొత్తం పశ్చిమ ఆఫ్రికా ఖండంలోనే ఒక అందమైన నగరం. దేశంలో నాలుగో పెద్దనగరం. ఈ నగరం ఒకప్పుడు రాజధానిగా ఉండేది. అయినా కూడా ఈ నగరంలోనే ప్రస్తుతం అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఫ్రెంచి భాష మాట్లాడతారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నగరం గుండెకాయ లాంటిది. నగరంలో సెయింట్‌పాల్ కాథడ్రల్, ఐవరీ హోటల్ శిథిలాలు కనబడతాయి. సముద్రతీరంలో ఉండడం వల్ల ఈ నగరం చుట్టుపక్కల నీలి నీళ్ళ లగూన్లు ఏర్పడి ఉన్నాయి. నగరంలో జాతీయ మ్యూజియంలు, ఐఫన్ మ్యూజియంలు ఉన్నాయి. లగూన్లలో స్కూబాడ్రైవింగ్ మొదలైన ఆటలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. 2. యాముస్సోక్రో ఐవరీ కోస్ట్ దేశానికి ఈ నగరం రాజధాని. అయితే ఇది పేరుకే రాజధాని నగరం. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అబిద్జాన్ నగరం నుండే జరుగుతాయి. నగరంలో లేడీ ఆఫ్ పీస్ బాసిలికా ప్రముఖంగా చూడదగిన కట్టడం. ఇది వాటికన్ నగరంలో ఉన్న సెయింట్ పీటర్ బాసిలికా కన్నా చాలా విశాలంగా ఉంటుంది. భవనంపైన ఉన్న డోము చాలా విశాలంగా ఉంటుంది. ఇదొక గొప్ప కట్టడం. పోప్‌జాన్ పాల్-2 దీనిని ఒక పవిత్ర ప్రదేశంగా ప్రకటించాడు. దీనిలోపల 18 వేల మంది, బయట 3 లక్షలకు పైగా జనం ఒకేసారి కూర్చోగలుగుతారు. ఈ నగరంలో శిల్పకళను అద్భుతంగా చెక్కిన ముస్లిముల మసీదులు కూడా ఉన్నాయి. నగరం అన్ని మతాలకు ప్రతీకగా కనబడుతుంది. దేశాన్ని పాలించిన మొదటి రాష్ట్రపతి సొంత ఊరు ఇదే. దానితో ఆయన ఈ నగరాన్ని బాగా అభివృద్ధి చేశాడు. రాజప్రాసాదాలు ఈ నగరంలో చాలా ఉన్నాయి. 3. బోకే నగరం ఈ నగరం దేశంలో రెండో అతి పెద్ద నగరం. ఇది వల్లీడు బందామా రీజియన్‌లో ఉంది. ఈ నగరం చుట్టుపక్కల పత్తిపంటలు, పత్తి జిన్నింగ్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఈ నగరం హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. నగరం పరిసరాలలో చెరకు మిల్లులు, దుస్తుల తయారీ పరిశ్రమలు, భవన నిర్మాణరంగ పరిశ్రమలు, వరి పండించే భూమి అధికంగా ఉన్నాయి. ఈ నగరం పరిసరాలలో బంగారు, పాదరసం, మాంగనీసు గనులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ నగరం బానిసలను కొనడం, అమ్మడంలో పేరు గాంచిన నగరం. ఈ నగరంలో బొకే కార్నివాల్ మార్చిలో జరుగుతుంది. దీనిలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి, ఇతర దేశాల నుండి ప్రజలు అధికంగా వస్తారు. ఈ నగరంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అధికంగా ఉన్నాయి. 4. టాయి జాతీయ పార్కు ఈ పార్కును 1982లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎన్నిక చేసింది. ఈ పార్కు దాదాపు 3300 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. ఈ పార్కులో 1300 రకాల మొక్కలు, 50 రకాలు జంతువులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన రకాల కోతుల జాతులు ఇక్కడ ఉన్నాయి. 2000 చింపాంజీలు ఉన్నాయి. చిరుత పులులు, హిప్పోలు, అడవి దున్నలు, ఆంటిలో్ప్లు, 250 రకాల పక్షులకు ఈ పార్కు నిలయంగా ఉంది. 40 రకాల పాములు, 50 రకాల ఉభయ చరాలు కూడా ఈ పార్కులో మనకు దర్శనమిస్తాయి. 1926లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇది అబిద్జాన్ నగరానికి సమీపంలో ఉంటుంది. ఈ దేశంలో ఇంకా బాంకో జాతీయ పార్కు, కోమో జాతీయ పార్కు, ఐలిస్ ఎహోటైల్స్ జాతీయ పార్కు మారాహేన్ జాతీయ పార్కు మాంట్ పెకో జాతీయ పార్కు, మాంట్ సాంగ్చే జాతీయ పార్కు ఉన్నాయి. 5. చారిత్రక నగరం - గ్రాండ్ బాసమ్ ఈ నగరం ఒకప్పుడు ఐవరీకోస్ట్ దేశానికి ఫ్రెంచివాళ్ళ రాజధానినగరం. ఇది కోమో నదితీరంలో నిర్మితమై ఉంది. ఒకప్పుడు ఇది గొప్ప ఓడరేపు నగరం. ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. 1880లో ఈ నగరం నిర్మితమైంది. ఈ నగరంలో భవనాలన్నీ ఫ్రెంచి వాళ్ళ వాస్తుశైలిని పోలి ఉంటాయి. అయితే అబిద్జాన్ నగరం రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల నగరంలోని అనేక పురాతన భవనాలు నేడు శిథిలలావస్థకు చేరాయి. వంద సంవత్సరాల క్రితం ఈ నగరం ఫ్రెంచి వాళ్ళ పాలనలో గొప్ప వెలుగు వెలిగింది. ఇక్కడే వారి అధికారిక భవనాలు ఎన్నో ఉండేవి. ఇప్పుడవన్నీ మసకబారిపోతున్నాయి. సముద్రతీరం, బీచ్‌లు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. జనం లేక ఎన్నో భవనాలు ఖాళీగా కనిపిస్తాయి. రంగులు వెలసిపోయిన ఈ భవనాలను చూస్తుంటే ఒకప్పటి రాజరికం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. -
ఉర్రూతలూపిన ఫతోమతా
ఐవరీకోస్ట్‌కు చెందిన అంతర్జాతీయ ఆఫ్రో-పాప్ గాయని ఫతోమతా దియావరా తన ఆటపాటలతో నగరవాసులను ఉర్రూతలూపింది. జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన ‘బ్లాక్‌బెర్రీ షార్ప్ నైట్స్-మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్’ కార్యక్రమంలో జాజ్, ఫోక్, రాక్ మ్యూజిక్‌తో ఆమె ప్రేక్షకులను హుషారెత్తించింది. -
సూపర్ స్టార్ స్పూర్తితో ఐవరీ కోస్ట్ విజయం!
రెసిఫే: ఐవరీ కోస్ట్ పుట్ బాల్ సూపర్ స్టార్ డిడైర్ డ్రోగ్బా సూర్ జపాన్ పై స్పూర్తిదాయకమైన విజయాన్ని అందించారు. బ్రెజిల్ జరుగుతున్న ప్రపంచ ఫుట్ బాల్ కప్ గ్రూప్ సీలో జపాన్ తో జరిగిన మ్యాచ్ లో ఐవరీ కోస్ట్ 2-1 స్కోర్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 16 నిమిషంలో కీసుకే హోండా జపాన్ కు గోల్ కొట్టి ఆధిక్యం అందించాడు. తొలిభాగంలో ఐవరీ కోస్ట్ దాడులకు జపాన్ ధీటుగా సమాధానమిచ్చింది. ఆ తొలి భాగంలో బెంచ్ కే పరిమితమైన డ్రోగ్బా 62 నిమిషంలో రంగంలోకి దిగి జట్టుకు జోష్ కలిగించాడు. డ్రోగ్బ్రా అందించిన ఊపుతో విల్ ఫ్రైడ్ బోని 64 నిమిషంలో, గెర్విన్హో 66 నిమిషంలో 'హెడర్ గోల్' తో ఐవరీ కోస్ట్ కు విజయాన్ని అందించారు. -
విదేశీ నాణెంపై విఘ్నేశ్వరుడు
గణపవరం, న్యూస్‌లైన్ : విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఆఫ్రికా ఖండంలోని ఐవరీకోస్ట్ దేశం ప్రత్యేక నాణెం ముద్రించడం విశేషం. ఈ నాణేన్ని స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణ అభిరుచి ఉన్న గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజు సేకరించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వివిధ దేశాల నాణాలు, స్టాంపుల సేకరణ హాబీ ఉన్న తాను ఇంటర్నెట్లో ఈ నాణెం గురించి తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు సేకరించారన్నారు. నాణెం 25 గ్రాముల బరువు, 38.61 మిల్లీమీటర్ల వ్యాసం ఉందన్నారు. నాణేనికి ఒక వైపు ఆ దేశ రాజముద్ర, నాణెం విలువ, రెండో వైపు రావిఆకులతో రూపొందించిన విఘ్నేశ్వరుడి చిత్రం ముద్రించి ఉన్నాయన్నారు. గిఫ్టు బాక్సును వినాయకుని మూషిక వాహనం నమూనాలో రూపొందించి, అందులో ఈ స్మారక వెండి నాణేన్ని ఉంచి పార్శిల్ ద్వారా పంపారన్నారు. ఆ దేశ కరె న్సీ ప్రకారం ఈ నాణెం విలువ 1001 ఫ్రాంక్‌లని తెలిపారు. దీని సేకరణకు తనకు రూ.8 వేలు ఖర్చయిందని రాజు చెప్పారు. వివిధ దేశాల నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నానని, వాటి సేకరణకు ఇప్పటి వరకు రూ. 8 లక్షలు ఖర్చు చేశానన్నారు.