సాక్షి, న్యూఢిల్లీ : ఒకరు పనికి రాదని పడేసిన చెత్త, మరొకరికి విలువైనదిగా పనికొస్తుందంటే ఇదే! సముద్రపు ఒడ్డున పర్యాటకులు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఫ్రెంచ్ కంప్యూటర్ ఇంట్రిప్రీనర్ ఎరిక్ బెకర్ ఏరుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, అలా ఏడు లక్షల బాటిళ్లను ఏరి వాటితోని నీటి మీద తేలియాడే కృత్రిమ దీవిని నిర్మించారు. ముందుగా దానిపై తాను ఉండేందుకు ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ దీవిని కూడా ఎందుకు వ్యాపారానికి ఉపయోగించుకోకూడదని అనుకున్నారో, ఏమో!
ఆ దీవిపై ఒక హోటల్‌ను, ఓ బార్‌ను, రెండు కృత్రిమ స్విమ్మింగ్ పూల్స్‌ను, రాత్రి బసకు రెండు మూడు షెడ్లను నిర్మించి పర్యాటకులకు స్వాగతం పలికారు. అంతే ప్రకతి ప్రేమికులు, పర్యావరన పరిరక్షణ కార్యకర్తలు, ప్లాస్టిట్ వేస్ట్‌ను ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు కృత్రిమ దీవికి క్యూలు కట్టారు. ఈ దీవిపై ఒక రోజు గడపడానికి వంద డాలర్లు వసూలు చేస్తున్నారు.
ఈ దీవిపై ఆకర్షణీయంగా చెట్లు, పొదలను కూడా పెంచారు. ఈ దీవి వెయ్యి చదరపు మీటర్లు ఉంటుంది. పర్యాటకులు దీనికి పడవపైనే రావాల్సి ఉంటుంది. ఊరికే పగలు చూసి పోవడానికైతే 25 డాలర్లు వసూలు చేస్తారు. రాత్రికి భోజనం, బస చేయాలంటే వంద డాలర్లు వసూలు చేస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని అబిద్‌జాన్ పట్టణ శివారులో సముద్రం పక్కన నీటి మడుగులో ఈ కృత్రిమ తేలియాడే దీవిని నిర్మించారు. వారానికి వంద మంది పర్యాటకులు వస్తున్నారని, వారితో తనకు అంతో ఇంతో డబ్బు రావడమే కాకుండా, ప్లాస్టిక్ వేస్టేజ్‌ని కొంతైనా సద్వినియోగం చేశానన్న సంతప్తి ఉందని ఆయన ఏఎఫ్‌పీ మీడియాతో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment