‘మగాళ్లు’ సినిమాల్లోనే ఉంటారు. ఒకేసారి పదిమందిని చితక్కొట్టేస్తుంటారు. సిటీలో ‘భాయ్’ మనుషుల్ని ... (బీప్) పోయిస్తుంటారు. బంగీ జంప్‌లు చేస్తుంటారు. లుంగీ డ్యాన్స్‌లు వేస్తుంటారు. ఓ సినిమాలో విలన్ అంటాడు.. హీరో గురించి.. ‘ఆడు మగాడ్రా బుజ్జే..’ అని! మీరిప్పుడు అలాంటి మగాణ్ణే రియల్ లైఫ్‌లో చూడబోతున్నారు! అతడు ఫైట్ చేసింది, చేస్తున్నది.. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిపిన తొమ్మిది మంది కీచకులకు శిక్ష వేయించడం కోసం! మూడేళ్లు అతడీ పోరాటం చేస్తున్నాడు. భార్యతో కలిసి చేస్తున్నాడు.
అతడి పేరు జితేందర్ ఛాతర్. హరియాణా రాష్ట్రానికి చెందిన సాధారణ యువ రైతు. కీచక సంతతి చేతిలో చిత్రవధ అనుభవించిన అభాగ్యురాలికి కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా న్యాయం కోసం నిరంతర పోరాటం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ న్యాయ పోరాటానికి దారి తీసిన పరిస్థితులేమిటి? అతడి మాటల్లోనే విందాం.‘‘ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. కొన్నేళ్ల క్రితం నా భార్యపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఫొటోలు, వీడియో తీశారు. వాటితో ఆమెకు ఏడాదిన్నర పాటు నరకం చూపించారు. ఈ కిరాతకం జరిగేనాటికింకా మాకు పెళ్లి కాలేదు. 2015, సెప్టెంబర్‌లో మాకు నిశ్చితార్థం జరిగింది.
హరియాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆచారం ప్రకారం పెళ్లికొడుకు పెళ్లి వరకు అమ్మాయిని మళ్లీ చూడటానికి వీల్లేదు. మేము ఫోన్‌లో తరచు మాట్లాడుకునేవాళ్లం. మాది జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామం. జింద్ నగరంలో ఆమె ఉండేది. మా రెండూళ్ల మధ్య 30 కిలోమీటర్ల దూరం. ఓరోజు నాతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని, వెంటనే రావాలని కోరింది. అమ్మానాన్నతో కలిసి రెండోసారి వాళ్ల ఊరెళ్లాను.
ఆమె నోటి నుంచి వచ్చిన మాట వినగానే.. ఏం మాట్లాడాలో కాసేపు అర్థం కాలేదు. ‘నన్ను పెళ్లి చేసుకోవద్దు. వివాహ బంధానికి నేను పనికిరాను’ అని చెప్పడంతో నిర్ఘాంతపోయాను. ఏం జరిగిందని అడిగితే అసలు విషయం చెప్పింది. తాను అత్యాచార బాధితురాలినని, దీన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని సజల నేత్రాలతో నాపైపు సూటిగా చూస్తూ చెప్పేసరికి నేనేమీ మాట్లాడలేకపోయాను. నా అంతరాత్మ లోలోపల నన్ను ప్రశ్నిస్తోంది. ‘ఈమెను పెళ్లి చేసుకోకపోతే దేవుడు నిన్ను క్షమించడు’అని మనస్సాక్షి ఘోషించడంతో ‘నిన్నే పెళ్లి చేసుకుంటాన’ని ప్రమాణం చేశాను. పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, నీకు న్యాయం జరిగేలా చేస్తానని దృఢవిశ్వాసంతో మాటిచ్చాను.
బెదిరింపులు.. ప్రలోభాలు
నాకు కాబోయే భార్య ఇంటికి వెళ్లొచ్చిన రెండు వారాల తర్వాత రేపిస్టుల భరతం పట్టే పనికి శ్రీకారం చుట్టాను. ఎనిమిది మంది దుండగులపై అప్పటికే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా న్యాయవాదిని నియమించుకుని న్యాయ పోరాటం మొదలుపెట్టాను. నాకు, ఆమె కుటుంబానికి బెదిరింపులు వచ్చినా లెక్కచేయకుండా 2015 డిసెంబర్‌లో మేము పెళ్లి చేసుకున్నాం. నిందితులు యువకులు. పైగా రాజకీయ నేపథ్యం ఉన్న ధనవంతులు. మా ఇంటికి రౌడీలను పంపించి మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు మేము ఇచ్చిన ఆధారాలు కోర్టు ముందుకు రాకుండా చేశారు. అంతేకాదు నామీద మూడు తప్పుడు కేసులు పెట్టించారు.
ఆ సమయంలో మా ఇద్దరికీ మా అమ్మానాన్న అండగా నిలిచారు. ఎన్నివిధాలుగా బెదిరించినా లొంగకపోవడంతో మమ్మల్ని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. కేసు వెనక్కి తీసుకుంటే భారీగా డబ్బు ఇస్తామని ఆశ చూపారు. నిందితులను జిల్లా కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంతో నేను హైకోర్టు తలుపు తట్టాను. న్యాయం జరిగే వరకు పోరాడాలన్న పట్టుదలతో ముందుకు సాగాను. కోర్టు ఫీజుల కోసం ఛాతర్ గ్రామంలో మాకున్న స్థలంలో కొంత అమ్మేసి రూ. 14 లక్షలు సమకూర్చుకున్నాను.
అంతేకాదు కోర్టుకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో సొంత ఊరిని, మాకున్న వ్యాపారాన్ని వదిలిపెట్టి జింద్ నగరంలో మకాం పెట్టాం. ఈ సమయంలో ఎంతో మానసిక వేదన అనుభవించాం. నా భార్యపై అమానుషకాండ సాగించిన కామాంధులకు శిక్ష పడాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. మరోవైపు కోర్టు ఫీజులు భరించలేక, ఇతర లాయర్లపై నమ్మకం సడలిపోవడంతో న్యాయవాద విద్య అభ్యసిస్తున్నాను. నా భార్యను కూడా లాయర్ కోర్స్ చదివిస్తున్నాను.
చండీగఢ్ వెళ్లిపోతున్నాం
మేము సాగిస్తున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి నా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. వారు అందించిన అండదండల కారణంగానే ఛాతర్ గ్రామస్తుల్లో చాలా మంది మా పక్షాన నిలబడ్డారు. నా భార్య తరపున న్యాయ పోరాటం చేయాలన్న నిర్ణయాన్ని మా పెళ్లికి ముందే మొత్తం పంచాయతీ సమర్థించింది. మా చదువు పూర్తైన తర్వాత చండీగఢ్‌కు వెళ్లిపోవాలనుకుంటున్నాం. మేమిద్దరం కలిసి న్యాయవాదులుగా అక్కడ ప్రాక్టీస్ మొదలు పెడతాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు న్యాయ సేవలు అందించేందుకు మా చదువును ఉపయోగిస్తాం.
మాకిప్పుడు రెండేళ్ల బాబు ఉన్నాడు. హరియాణాలోని దుష్ట పితృస్వామ్య వ్యవస్థ ఛాయలు మా కుమారుడిపై పడకుండా వాడిని చండీగఢ్‌లో చదివించాలనుకుంటున్నాం. మహిళల జీవితాలను నాశనం చేస్తున్న అత్యాచార సంస్కృతికి దూరంగా వాడిని పెంచాలనుకుంటున్నాం. మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి గొంతు విప్పే రోజులు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాను. ఇప్పటికే అర్బన్ ఇండియాలో మీటూ ఉద్యమం మొదలైంది.
పల్లెటూరి పడతుల విషయంలోనూ పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నాం. ఇందుకోసం నేను, నా భార్య మా వంతు ప్రయత్నం చేస్తాం. మార్పు కోసం ఎదురు చూస్తున్నాం’’ అని వివరించాడు జితేందర్. ఇలా స్ఫూర్తిదాయక పోరాటం సాగిస్తున్న జితేందర్ ఛాతర్‌పై ‘సన్ రైజ్’ పేరుతో త్వరలో డాక్యుమెంటరీ రానుంది. జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ ఫిల్మ్ మేకర్ విభా బక్షి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ హీరో గురించి మరికొంచెం
హరియాణాలో మహిళలపై లైంగిక దాడులు చాలా పెద్ద సమస్య. హరి (విష్ణువు) నిలయంగా వాసికెక్కిన హరియాణాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ జరగనన్ని సామూహిక అత్యాచారాలు నమోదయ్యాయి. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బయటకి చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. సమాజం మొత్తం బాధిత మహిళలనే నిందిస్తుంది కాబట్టి తమపై జరిగే దారుణాల గురించి బయటపెట్టడానికి భయపడతారు. విష్ణువు నడయాడిన నేలగా చెప్పుకుంటున్న హరియాణాలో ఆడపిల్లల మానప్రాణాలకు రక్షణ లేకపోవడం జితేందర్‌ను ఎంతగానో కలచివేసింది.
ఛాతర్ గ్రామంలో బాలికల పాఠశాల దగ్గర జులాయిలు కాపుకాసి అమ్మాయిలను నిత్యం అల్లరి పెట్టేవారు. తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ స్కూల్ మాన్పించేస్తారోనన్న భయంతో ఆ బాలికలు మౌనంగా ఇవన్నీ భరించేవారు. ఛాతర్ నుంచి ఆర్టీసీ బస్సులో జింద్ నగరానికి వెళ్లే కాలేజీ అమ్మాయిలు ప్రతిరోజూ పోకిరీల వెకిలి చేష్టల బారిన పడుతుంటారు. ఇలాంటివి భరించలేక చాలా కుటుంబాలు అమ్మాయిలను కాలేజీ మాన్పించేశాయి.
ఆ నేపథ్యంలో.. ఎటువంటి భయం లేకుండా అమ్మాయిలు కాలేజీకి వెళ్లేందుకు జితేందర్ తన వంతు ప్రయత్నం చేశాడు. మహిళల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలని విద్యార్థిగా ఉన్నప్పుడే 2004లో ఆర్టీసీ జిల్లా మేనేజర్‌కు లేఖ రాశాడు. కొన్ని నెలల తర్వాత లేడీస్ స్పెషల్ బస్సు ఛాతర్– జింద్ మార్గంలో రోడ్డెక్కింది. అక్కడితో తన పోరాటాన్ని ఆపలేదు అతడు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల నిర్మూలనకు స్థానిక ఖాప్ పంచాయతీ సహకారంతో 2013లో జింద్ జిల్లాలోని 24 గ్రామాల్లో ప్రదర్శనలు, ప్రయత్నాలు సాగించాడు.
– పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment