ఈ కలయిక విస్తృత ప్రయోజనాలకు నాంది | Jonson Choragudi Article On KCR Federal Front | Sakshi
Sakshi News home page

ఈ కలయిక విస్తృత ప్రయోజనాలకు నాంది

Published Sun, Jan 20 2019 12:40 AM | Last Updated on Sun, Jan 20 2019 12:41 AM

Jonson Choragudi Article On KCR Federal Front - Sakshi

రెండు తెలుగు రాష్ట్రాలు వనరుల పంపకంలో పరస్పరం ప్రయోజనాలు పొందవలసిన నేపథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా ఇరువైపులా ఇప్పుడున్న యువ నాయకత్వాల–కేటీఆర్, వైఎస్సార్‌– కలయిక, దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలకు మేలుచేసేది గానే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ప్రాంతాల మధ్య, కాలాతీతంగా సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డానికి ఆస్కారం కలిగించింది. సోదర తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఇప్పటికే జరిపిన అపారమైన మేధోమధనం, ప్రాధమ్యాల ఎంపిక, వాటి ద్వారా టీఆర్‌ఎస్‌ ఆ రాష్ట్రంలో పొందుతున్న ప్రతిఫలనాల విలువను, ఏపీ ప్రజానీకం ఇప్పటికైనా గ్రహించడం అవసరం. వీరిద్దరి కలయిక తెలుగు సమాజాలకు గెలుపు సందర్భం కావాలి.

తెలుగు ప్రజలంతా సంక్రాంతి సంతోషాల్లో ఉండగా జరిగిన ఒక రాజకీయ సంఘటన, మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాంతాల మధ్య, కాలాతీతంగా సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డానికి ఆస్కారం కలి గించింది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా, చిన్నగా మొదలయ్యేవి – చరిత్రలో కీలక మలుపులు కావడం మనకు కూడా కొత్తకాదు! తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, తన తండ్రి కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరమని కోరడం–ఇప్పుడు అటువంటిదే కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలు, రెండు కొత్త ప్రాంతీయ పార్టీలు, ఇద్దరు యువనాయకుల ఈ కలయిక సన్నివేశం; ఇరువైపుల ఉన్న తెలుగు సమాజాలకు ‘విన్‌–విన్‌ సిచ్యుయేషన్‌’ కావాలి. తెలంగాణ ఉద్యమం అంచెలంచెలుగా అరవైల నుంచి పలు విరామాల మధ్య పొరలు పొరలుగా రాజకీయ ఉపరితలం మీదికి వస్తూ 2010 నాటికి విస్మరించడానికి వీలులేని స్థాయికి చేరింది. అయితే, ఏనాటికైనా, ఏ కారణంతోనైనా రాష్ట్రం రెండయితే కలిగే తదనంతర పరిణామాలను భరించవలసిన– ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు; దాన్నిఎదుర్కోవడానికి ఎటువంటి ముందస్తు కసరత్తూ చేయలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2010 తర్వాత ఇక్కడ ఏర్పడిన రాజకీయ బలహీన స్థితిని, అధిగమించలేకపోయింది. తెలంగాణ ఉద్యమ నాయకత్వం దాన్ని అనుకూలంగా మల్చుకోవడంతో 2014 జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగింది.

 2019 ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల్లో పరి స్థితి ఇలా ఉంది. విభజనను ఎదుర్కోవడానికి ‘సమైక్య ఆంధ్ర ఉద్యమం’ నడపడం ఒక్కటే పరి ష్కారం అని నమ్మిన ఆంధ్రప్రదేశ్‌ ఒక వైపు, ఉద్యమ విజయాన్ని, మరోసారి ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలచుకున్న తెలంగాణ మరొకవైపు ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ సంఘ నాయకులు కాలక్రమంలో విశ్వసనీయత కోల్పోగా, 2019కి గాను తెలంగాణలో, మరో ఐదేళ్ళు మీరే అధికారంలో ఉండమని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు.అయితే సమైక్య ఆంధ్ర ఉద్యమ నాయకులు గడచిన నాలుగున్నర ఏళ్లలో – అప్పట్లో ఎందుకు తాము విభజనను వ్యతిరేకించామని ఒక డాక్యుమెంట్‌నూ విడుదల చేయలేకపోయారు. కనీసం ఇప్పుడైనా ఏపీ ప్రజలకోసం, తమ ప్రాంతం కోసం ప్రభుత్వం, రాజ కీయ పార్టీలు ఏమి చేయాలి అనే దిశలో పౌర సమాజాలను కలుపుకుని, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించలేక పోయారు. పోనీ దానివల్ల ప్రయోజనం లేదనుకుంటే, విభజన చట్టం అమలు మీద నిరంతర నిఘాతో దాన్ని సమీక్షిస్తూ రాజకీయాలకు ప్రభుత్వాలకు సమాంతరంగా ఒక ఒత్తిడి బృందాన్ని (‘ప్రెషర్‌ గ్రూప్‌’) నిర్మించలేకపోయారు. ఈ పరిస్థితికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్‌ఎస్‌ విభజన లక్ష్యంగా ఒక దశాబ్ద కాలంపైగా ప్రజలు, ప్రాంతం, ప్రభుత్వం.. అనే కోణం నుంచి విస్తృతమైన మేధోమధనం చేసి ఉంది. అలాంటిది ఇటు ఆంధ్రవైపు ఉద్యమకాలంలో జరగలేదు.

రెండు ప్రాంతాల ప్రభుత్వాల మధ్య తేడా విభజన జరిగిన మొదటి ఏడాదే స్పష్టమైంది. తెలం గాణా వెంటనే మరో పది కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. విడిపోతే బాగుపడతాం అనే తమ పాత సూత్రాన్ని వాళ్ళు సూక్ష్మ స్థాయి వరకు  తీసుకు వెళ్ళారు. నైసర్గిక ప్రదేశం అంటే కేవలం భూమి మాత్రమే కాదు, ‘భూమి’ కేంద్రంగా దాని చుట్టూ ‘పొలిటికల్‌ పవర్‌’ కూడా ఉంటుంది. అది తెలంగాణలో వారి నాయకుడికి తెలిసినట్టుగా బహుశ ఇంకెవ్వరికీ తెలియకపోవచ్చు. మొన్నటి ఎన్నికల విజ యంలో తాయిలాలు గెలిపించాయని అంటున్నవారు అంతర్లీనమైన ఈ అంశాన్ని గుర్తించలేదు! అసంఖ్యాకంగా ఉన్న తెలంగాణ ఉత్పత్తి కులాలు ఇప్పుడు ఈ కొత్త జిల్లాల కారణంగా స్థానిక సంస్థల రాజకీయ అధికార ఫలాలకు చేరువ అవుతారు. టీఆర్‌ఎస్‌ అక్కడితో ఆగకుండా ప్రజల సాంస్కృతిక మూలాల మూలుగుల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. విభజన కోసం ఇంత పని ఇప్పటికే పూర్తిచేసి, ఇక రాష్ట్రం కోసం ఇప్పుడు చేయవలసింది ఏమిటి అనే విషయంలో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఒక ‘రోడ్‌ మ్యాప్‌’ ఉంది. కేసీఆర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పత్రికా సమావేశంలో రాజ్యాంగపరమైన అంశాలను ప్రస్తావిస్తూ–కేంద్ర రాష్ట్ర జాబి తాలు, ఉమ్మడి జాబితాల ప్రస్తావన లేవనెత్తారు. దాంతో ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయం లేదా ఫెడరల్‌ ఫ్రంట్‌ వంటి ప్రకటనలు చేస్తున్నచాలామంది సీనియర్‌ సీఎంలకంటే, కేసీఆర్‌ ఇందుకోసం ఎక్కువ ‘హోంవర్క్‌‘ చేసినట్టుగా స్పష్టమైంది.

రెండు తెలుగు రాష్ట్రాలు వనరుల పంపకంలో పరస్పరం ప్రయోజనాలు పొందవలసిన పరిస్థితుల్లో ఇరువైపులా ఇప్పుడున్న యువ నాయకత్వాల కలయిక, దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలకు మేలుచేసేది గానే ఉంటుంది. సోదర తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఇప్పటికే జరిపిన అపారమైన మేధోమధనం, ప్రాధమ్యాల ఎంపిక, వాటి ద్వారా టీఆర్‌ఎస్‌ ఆ రాష్ట్రంలో పొందుతున్న ప్రతిఫలనాల విలువను, ఏపీ ప్రజానీకం ఇప్పటికైనా గ్రహించడం అవసరం. అయినా తాము ప్రతిపాదిస్తున్న ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’తో కలిసివచ్చే వారిని కూడగట్టుకోవడంలో భాగంగా టీఆర్‌ఎస్‌ తనకు తానే ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రధాన రాజకీయ పార్టీల సహకారం కోరితే, అందుకోసం వాళ్ళు వచ్చి ఇక్కడి ప్రతిపక్ష నాయకుణ్ణి కలిస్తే, దాన్ని ఇక్కడి పౌర సమాజం ఎలా చూడాలి? రాజకీయంగా మాత్రం చూడవలసిన పనిలేదు. రాజకీయ పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటిలో–ప్రజలు ప్రాంతం వాటి ప్రయోజనాలు ఏమిటి అనే దృష్టి కోణం నుంచి, పౌరసమాజం కొంచెం కూడా పక్కకు జరగాల్సిన పని లేదు. ఉద్యమ కాలంలో దాని నిర్మాత, నాయకుడు కేసీఆర్‌కు సలహా సంప్రదింపులకోసం విస్తృత శ్రేణిలో ఆలోచనాపరులు, నిపుణులతో ఒక ‘థింక్‌ ట్యాంక్‌’ ఇప్పటికే ఏర్పడి ఉంది. దాని సేవలు, అవసరం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కూడా ఇక్కడి ప్రజల మేలుకోసం వాటిని  వినియోగించుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటివరకు ఇక్కడ అంటే ఏపీలో అటువంటివి నామమాత్రంగా కూడా మనకు లేవు అన్నది గుర్తించి తీరాలి.

జాన్‌సన్‌ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement