చింతల చీకటిలో వెన్నెల | journalist Hemant life story | Sakshi
Sakshi News home page

చింతల చీకటిలో వెన్నెల

Published Fri, Dec 11 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

చింతల చీకటిలో వెన్నెల

చింతల చీకటిలో వెన్నెల

అడవి కడుపులో చింతచెట్లు.. ఆ కడుపులో చిమ్మచీకటి!కడుపుచించినా అక్షరంరాదు  అక్షరాస్యత అన్న చింత ఇద్దరిని కదిలించింది వీళ్లే టామరిండ్ ట్రీ నిర్వాహకులు! టామరిండ్ ట్రీ అంటే చింతచెట్టు... ఈ చింతచెట్టు కిందే ఆ అడవిబిడ్డలకు జ్ఞానోదయం అయింది!చింతచీకటిలో వెన్నెల కురిసింది..చింతచెట్టే చింతలేని వనమైంది!!
 
 హేమంత్ ఓ జర్నలిస్ట్. మిషెల్ సోషల్‌వర్కర్. ఇద్దరూ ముంబై వాసులే. ఒక అసైన్‌మెంట్‌లో ఒకరి గురించి ఒకరికి తెలిసింది. తొలి పరిచయంలోనే హేమంత్‌కి మిషెల్ నచ్చింది. కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం బలపడింది. ఇరువురు పెద్దలను ఒప్పించారు. పెళ్లి చేసుకున్నారు. తెల్లవారే రైలు ఎక్కారు. హనీమూన్‌కి కాదు.. అడవుల్లోకి. ‘కుర్రతనం కదా.. జీవితం అంటే ఏంటో తెలిసొచ్చి ఆర్నెల్లలో వాళ్లే తిరిగొస్తారు’ అనుకున్నారు పెద్దలు. ఆర్నెల్లు కాదు పద కొండేళ్లయినా ఆ జంట తిరిగిరాలేదు. ఇది తమ కుర్రతనం కాదనీ బాధ్యత అనీ పెద్దలకు తెలియజెప్పారు.
 
 ఇంతకీ ఎక్కడికి వెళ్లారు?
 ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘దహను’ అనే గిరిజన ప్రాంతానికి వెళ్లారు. అది అభివృద్ధికి అందని ప్రదేశం. వర్లి తెగ ఆదివాసీలు ఉంటారక్కడ. అజ్ఞానం.. మూఢ విశ్వాసాలు.. జబ్బులు... పెద్దాళ్లకు పని ఉండదు. పిల్లలకు బడి ఉండదు. ఆ పరిస్థితులను మార్చడానికి ‘దహను’ ప్రవేశించారు హేమంత్, మిషెల్.
 
 వద్దు పొమ్మంది
 కాని వాళ్లు నాగరికులు. గత అనుభవాల వల్ల నాగరికులు ప్రమాదకారులు అని ఆదివాసీలకు తెలుసు. మాయ చేసి మోసం చేస్తారని భయం. అందుకే హేమంత్, మిషల్‌లను కూడా అనుమానంగా చూశారు. మీకు మేలు చేయడానికి వచ్చాం అంటే సందేహించారు. వాళ్లు గుడిసె వేసుకొని ఉంటే రాత్రి నిద్రపోయాక వచ్చి పీకేసేవారు. నీళ్లు నింపి పెట్టుకున్న కుండలను పగలగొట్టేవారు.. వండిపెట్టుకున్న దాంట్లో మట్టి కలిపేవారు. ఏం చేసైనా సరే వాళ్లు ఆ ఊరి నుంచి తరిమేయాలనే పంతం ఆ ఆదివాసీలది. అన్ని సహించి అక్కడే ఉండాలనేది ఆ ఆలుమగల పట్టుదల. చివరకు ఆ మొగుడుపెళ్లామే గెలిచారు. వాళ్ల మంచితనం ఆ గిరిజన బిడ్డలను కదిలించింది. నమ్మకం పెరిగింది.
 
 ఆ మార్పు కోసమే..
 హేమంత్, మిషెల్ ఇక ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. దహనుకు కొంచెం దూరంలో ఉన్న ఊళ్ల నుంచి సేంద్రియ సాగు చేసే రైతులను పిలిపించి కొందరికి శిక్షణ ఇప్పించే ప్రయత్నంలో పడ్డారు. అక్కడే ఉన్న ఓ చింత చెట్టు కింద బడి మొదలెట్టారు. మొదట ఐదుగురే వచ్చారు. నెమ్మదిగా గూడెంలో ఉన్న పిల్లలందరూ పోగయ్యారు. మిషెల్ సాయంకాలాలు గూడెంలోని ఆడవాళ్లకు చదువు చెప్పేది. వాటితో పాటు ఇంటి శుభ్రత నుంచి నెలసరి సమయాల్లో పాటించాల్సిన పరిశుభ్రత వరకు అన్నీ చెప్పేది.
 
 అయిదేళ్లకు..
 దహను స్వరూపం మారిపోయింది. ఇక్కడి సేంద్రియసాగు ఉత్పత్తులకు ముంబై, పుణేల్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఆ గిరిజన ప్రాంతం చరిత్రను, జానపదగాథలను, వారి పట్ల కార్పొరేట్ సాగించిన దోపిడీని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి కమ్యునిటీ రేడియోను స్థాపించారు. చరిత్రనంతా రికార్డ్ చేసి ప్రసారం చేయడమే కాక యూట్యూబ్‌లోనూ పెట్టారు. ఊహించని స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితో ‘నొమాడ్ ఇండియా’ అనే సంస్థనూ ప్రారంభించాడు హేమంత్. దేశంలోని ఏ గిరిజన ప్రాంతం వారైనా కమ్యునిటీ రేడియోను పెట్టుకోవాలనుకుంటే వెళ్లి సాంకేతిక సహకా రాన్ని అందించి దాని నిర్వహణలో శిక్షణకూడా ఇస్తాడు.
 
 టామరిండ్ ట్రీ
 చింత చెట్టుకింది స్కూల్‌ను ఈ పదకొండేళ్లలో మూడు వందల మంది విద్యార్థులతో టామరిండ్ ట్రీ అనే పెద్ద స్కూల్‌గా మార్చేసింది. ప్రతివారం ముంబై నుంచి పేరొందిన టీచర్లు వచ్చి పాఠాలు చెప్తుంటారు. రిటైరైన కొంతమంది టీచర్లయితే దహనులోనే ఉంటూ ఆ గిరిజన బిడ్డలకు ఇంగ్లిష్, కంప్యూటర్స్, వొకేషనల్ ట్రైనింగ్, లైఫ్‌స్కిల్స్ డెవలప్‌మెంట్ కోర్సులను నేర్పిస్తున్నారు. సర్కారు బళ్లలో పనిచేసే టీచర్లలాగా వాళ్ల పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించలేదు హేమంత్, మిషెల్‌లు. గిరిజనపిల్లలతో సమానంగా తమ ఇద్దరు బిడ్డలనూ ఈ టామరిండ్ ట్రీ స్కూల్లోనే చదివిస్తున్నారు.
 
 గాంధియన్
 అభివృద్ధికి కూడా కొన్ని దుర్లక్షణాలు ఉంటాయి. అవి అభివృద్ధి ఉన్న చోట తిష్ట వేస్తాయి. దహను అభివృద్ధి అయ్యేకొద్దీ అక్కడి పురుషులు తాగుడికి బానిసలై పనికి దూరమయ్యారు. ఆడవాళ్ల సంపాదననూ హారతికర్పూరం చెయ్యనారంభించారు. దీంతో మిషెల్ ఆ గిరిజన పిల్లలకు నెలకు రెండువందల రూపాయలిస్తేనే చదువు అని తేల్చిచెప్పింది. ఈ షరతుతో అక్కడి స్త్రీలు పురుషుల మీద తిరగబడ్డారు. పిల్లల చదువుకు డబ్బు సంపాదించి తెస్తేనే ఇంట్లో తిండి, స్థానం అని మొండికేసారు. మొదట్లో భార్యలను కొట్టారు. అయినా వాళ్లు పట్టువీడలేదు. పిల్లలు తండ్రుల మీదకి తిరగబడ్డారు. ఈ తతంగం యేడాది గడిచింది. తర్వాత దార్లోకి వచ్చారు మగవాళ్లు. ఇప్పుడు వాళ్లు కట్టే రెండువందల రూపాయల ఫీజు ఆ ఇంటి ఆడవాళ్ల పేరు మీద జమవుతుంది. దాన్ని ‘గాంధియన్’ అనే సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ కిందకి మార్చారు. ఈ విషయం ఇప్పటికీ ఆ గూడెంలోని మగవాళ్లకు తెలియదట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement