సంప్రదాయ కీర్తనలకు...పాశ్చాత్య పదనిసలు
సంగీతానికి భాషాభేదం లేదు... అయితే... నేటి యువతరం పాశ్చాత్య సంగీతాన్ని కోరుకుంటోంది...మరి వారికి సంప్రదాయ సంగీతంలోని తియ్యదనాన్ని అందించడం ఎలా... సంప్రదాయ సంగీతానికి కొత్త ఊపిరిపోయాలంటే, బాణీలో కొత్తదనం ఉండాలి... అందరి హృదయాలను దోచుకోవాలి... అందుకు ఫ్యూజన్ అనువైన మార్గం... భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ఫ్యూజన్ డ్రీమ్స్ ద్వారా అందరికీ చేరువ చేస్తూ... సంప్రదాయ సంగీతంలో జాజ్, జానపదాలను కలిపి సామాన్యుడిని సైతం మెప్పిస్తున్న అచ్చతెలుగు అమ్మాయి జ్యోత్స్నా శ్రీకాంత్
‘డిస్నీ సంగీత సింహం’గా పేరు పొందిన వయొలిన్ విద్వాంసుడు రాబర్ట్ అట్చిసన్, ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామరాన్... వీరు నన్ను అభినందించడం నేను ఎప్పటికీ మరచిపోలేను.
- జ్యోత్స్న
లండన్‌లో స్థిరపడిన ఆమె, భారతీయ సంప్రదాయ సంగీతంతో పాటు, లండన్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో వెస్ట్రన్ వయొలిన్ సంగీతంలో డిప్లమా చేశారు. వయొలిన్ మీద ఉండే ఆసక్తితో, ఆ వాద్యం మీదే సంగీతం నేర్చుకుని, అదే రంగంలో రాణిస్తున్నారు. అక్కడితో ఆగకుండా వివిధ పాశ్చాత్య సంప్రదాయ సంగీతాలను నేర్చుకుని, ప్రదర్శనలిచ్చారు. లండన్ ‘ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్’లో ఫెలోషిప్ పొందారు. బ్రిటిష్ పార్లమెంటులో బ్రిటిష్ ప్రధాని ఎదుట భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వయొలిన్‌పై వినిపించారు జ్యోత్స్న.
సంగీతంపై పలు వర్క్‌షాపులను నిర్వహించిన ఆమె గత సంవత్సరం లండన్‌లో జరిగిన ‘లండన్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్’ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇచ్చారు. నిజానికి, జ్యోత్స్న ఇంత ఎత్తుకు ఎదగడానికి చిన్న నాటే పునాది పడింది. తల్లి రత్న ఆమె తొలి గురువు. బాల్యం నుంచే సంగీతం నేర్చుకున్న జ్యోత్స్న ఆ తరువాత బెంగుళూరుకు చెందిన ఆర్ ఆర్ కేశవమూర్తి, విఎస్.నరసింహన్‌ల దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దగ్గర కూడా కొంతకాలం విద్య నేర్చారు. తొమ్మిదో ఏట తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.
అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ కళాకారిణి ఇప్పటివరకు ఎనిమిది అంతర్జాతీయ ఆల్బమ్స్ విడుదల చేశారు. అంతేకాదు...దాదాపు 200 సినిమాలకు వయొలిన్ సహకారం అందజేశారు. ఇందులో ఇళయరాజా, హంసలేఖలతో పాటు బాలీవుడ్ సంగీత దర్శకుల చిత్రాలూ ఉన్నాయి. బ్రిటన్ లోని ఓమాడ్, వేల్స్‌లో జరిగిన రెడ్ వయొలిన్ ఫెస్టివల్, బీబీసీలతో పాటు చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగే సంగీతోత్సవాల్లోనూ ఆమె వాయులీనం రాగాల పరిమళాలు వెదజల్లింది. బాలమురళీకృష్ణ, సుధా రఘునాథన్ వంటి దిగ్దంతులతో జుగల్బందీ చేశారు.
‘‘భారతీయ సంగీతాన్ని ప్రపంచదేశాల్లో విస్తరింపచేయాలనేది నా ధ్యేయం. అందులో భాగంగానే లండన్‌లో ‘ధ్రువ్ ఆర్ట్స్’ సంస్థ స్థాపించా. ఇందులో బ్యాచ్‌కు 70 మంది చొప్పున విద్యార్థులకు కర్ణాటక సంగీతం నేర్పిస్తాం. ఏ సంగీతోత్సవంలో పాల్గొన్నా. భారతీయ సంప్రదాయ సంగీతానికే ప్రాధాన్యమిస్తా’’ అంటారు జ్యోత్స్న. ‘‘సంగీతాన్ని సంప్రదాయంగా ఆలపిస్తే వినేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. వారిలో ఉత్సాహం నింపేందుకు మన సంప్రదాయ రాగాలను ప్యూజన్‌లో మిళితం చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా అన్నమయ్య కృతిని పాప్ మ్యూజిక్‌లో ప్రదర్శిస్తున్నాను.
అయితే ఈ పద్ధతికి విద్వాంసుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. వారి విమర్శలు సహేతుకమైనవే. అయితే సంగీతాన్ని అందరికీ చేరువ చేయడం కోసమే నా యీ తపన. ఇందుకోసం ‘కర్ణాటక సింఫనీ’అనే విధానాన్ని రూపొందించాలనుకుంటున్నాను. భారతీయ సంప్రదాయ వయొలిన్‌ను వెస్ట్రన్ సింఫనీకి చెందిన వంద సంగీత వాద్యాలతో కలిపి, ప్రదర్శన ఇవ్వాలన్నది నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చారు జ్యోత్స్న. ఆమె చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం ఫలవంతం కావాలని కోరుకుందాం.
- సి.బి. మోహన్‌రావు, బ్యూరో చీఫ్, నెల్లూరు