
ప్రపంచ యుద్ధాలను ముందే ఊహించిన కైసీ
ఆ్రో్ట ట్రివియా
ఆధునిక కాలంలో కీలకమైన సంఘటనలను ముందుగానే చెప్పే జ్యోతిషులు, అతీంద్రియ సాధకులు, కాలజ్ఞానులు అక్కడక్కడా లేకపోలేదు. అలాంటి వారిలో అమెరికన్ కాలజ్ఞాని ఎడ్గర్ కైసీ అగ్రగణ్యుడు. రెండు ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో, ఎప్పుడు అంతమవుతాయో ముందుగానే చెప్పాడు. ఎప్పుడంటే అప్పుడు ధ్యానావస్థలోకి జారిపోయే కైసీ అమెరికాలో ‘స్లీపింగ్ ప్రొఫెట్’గా పేరు పొందాడు. అమెరికన్ స్టాక్ మార్కెట్ 1929లో కుప్పకూలిపోతుందని నాలుగేళ్ల ముందే, అంటే 1925లోనే కచ్చితంగా చెప్పాడు. రక్తాన్ని నమూనాగా తీసుకుని, వ్యాధుల నిర్ధారణ జరుగుతుందని 1927లోనే చెప్పాడు. అప్పటి జనం దీనిని అభూత కల్పనగా కొట్టి పారేసినా, ఇప్పుడు అదే నిజమైంది. కైసీకి పేరు ప్రఖ్యాతులు పెరిగాక చాలామంది ప్రముఖులు ఆయన క్లయింట్లుగా మారారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్, ప్రముఖ సంగీతకారుడు ఇర్వింగ్ బెర్లిన్ వంటి వారు ఆయన క్లయింట్లలో ఉండేవారు, అమెరికన్ అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, జాన్ ఎఫ్ కెన్నడీల మరణాన్ని చాలాకాలం ముందే చెప్పిన ఘనత కూడా కైసీకే దక్కుతుంది. తన వద్దకు వచ్చే జనాలకు భూత భవిష్య విశేషాలను, గత జన్మల వృత్తాంతాలను చెప్పేవాడు. అలా చెప్పే సమయంలో ధ్యానావస్థలో ఉండేవాడు. ధ్యానం నుంచి తేరుకున్నాక తానేం చెప్పాడో తనకే గుర్తుండేది కాదు. తనకు ఈ శక్తి ఎలా వచ్చిందో తెలియదని చెప్పేవాడు. అయితే, ఏనాడూ ఈ శక్తిని సొమ్ము చేసుకునేందుకు ఉపయోగించుకోలేదు.