కామితార్థ ప్రదాయిని కామాక్షీదేవి | Kamakshi Devi Temple is also known as Kalikottam | Sakshi
Sakshi News home page

కామితార్థ ప్రదాయిని కామాక్షీదేవి

Published Sun, Mar 10 2019 1:37 AM | Last Updated on Sun, Mar 10 2019 1:37 AM

Kamakshi Devi Temple is also known as Kalikottam - Sakshi

కంచి అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్‌ (కాళీ కోష్టమ్‌) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట. 

గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కిందిభాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది.
సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి.
 – డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement