కనకమాలచ్చిమి
సందర్శనీయం
తెలుగువారి వెలుగు దివ్వె, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచిన వేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారు. విశాఖపట్నం బురుజుపేటలో కొలువై ఉన్న ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. మార్గశిర గురువారాలంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం. ప్రతి గురువారమూ అమ్మవారికి సహస్రనామార్చన, బంగారు గురువారాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారి మూర్తికి స్వర్ణకవచాన్ని, స్వర్ణాభరణాలను అలంకరిస్తారు. సహస్ర ఘటాభిషేకాలు, కుంకుమ పూజలు చేస్తారు. ఇక్కడి విశేషమేమంటే అమ్మవారికి భక్తులు స్వయంగా పూజలు చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో అమ్మవారిని సందర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని ప్రతీతి. హైదరాబాద్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్, లేదా విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడినుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బస్సులున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి ఐదు నిమిషాలకూ బురుజుపేటకు బస్సులున్నాయి. లేదంటే రైల్వేస్టేషన్ నుంచి నేరుగా షుమారు యాభై రూపాయలిచ్చి ఆటోలో వెళ్లిపోవచ్చు.