కేకే.నగర్: వాళపాడిలోని ప్రసిద్ధి చెందిన మునియప్పన్ ఆలయంలో పురుషులు మాత్రమే పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం దాదాపు 300 సంవత్సరాలుగా కొనసాగుతోంది. సేలం జిల్లా వాళపాడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని సింగిపురం కాలనీ అటవీ ప్రాంతంలో మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన అంజలాన్‌కుట్టై మునియప్పన్ ఆలయం ఉంది. ఇక్కడి మూలవిరాట్‌కు ఉత్తర దిశలో సుడాముని, వాయుముని, సెమ్ముని అనే రాక్షస స్వాముల విగ్రహాలుంటాయి. మనుషులు సంచారం లేని దట్టమైన కీకారణ్యంలో ఈ ఆలయం నెలకొంది.
రాత్రి సమయాల్లో జోస్యం చెప్పే బుడబుక్కల వాళ్లు బసచేసి మంత్ర శక్తిని పొందుతారని వారి కోసం ముని అక్కడ తిరుగుతూ ఉంటాడని, అందువల్ల స్త్రీల అనుమతికి పెద్దలు నిషేధం విధించినట్లు చెప్పుకుంటారు. ఈ కారణంగా గత 300ల సంవత్సరాలుగా ఈ ఆలయంలో పురుషులు పొంగళ్లు వండి స్వామికి నైవేద్యం పెడతారు. మొక్కుబడుల్లో భాగంగా కోడి, మేకలను బలి ఇచ్చి వాటిని ఆలయ ప్రాంగణంలోనే వండి స్వామికి నైవేద్యం పెడతారు.
ఆ ప్రసాదాన్ని స్త్రీలు తినరాదు. ఆలయంలోని స్వామి విబూదిని కూడా స్త్రీలు పెట్టుకోకూడదు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో వాళప్పాడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే కాకుండా సేలం, నామక్కల్ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయంలో దైవదర్శనం, మొక్కుబడులు తీర్చుకోవడానికి రావడంతో ఆలయం భక్తులతో కళకళలాడుతోంది.
ఆ ఆలయంలో పురుషులకే అనుమతి
Published Wed, May 25 2016 4:58 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement
Advertisement