మహారాష్ట్ర, పూనా జిల్లా పింప్రి– చించ్‌వాడ్‌లో శంకర్ కురాడే గుర్తున్నాడా? బంగారు మాస్క్ చేయించుకున్న సంపన్నుడు. ఆ మాస్కు మన కళ్ల ముందు నుంచి చెరిగి పోయేలోపు అలాంటిదే మరో విచిత్రం వజ్రాల ఫేస్ మాస్క్. ధర లక్షా నలభై వేల రూపాయలు. కుశాల్‌భాయ్ సూరత్‌లో ఆభరణాల వ్యాపారి. అతడు వజ్రాలు పొదిగిన ఫేస్ మాస్కులను తయారు చేశాడు. ఒక్కో మాస్కు ధర డిజైన్‌ను బట్టి లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇంత ధర పెట్టి ఎవరు కొంటారని తయారు చేశారు? అని అడిగితే దుకాణం యజమాని మరీ విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఇప్పుడు మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు.
పెళ్లి వేడుకలో మంచి దుస్తులు, ఆభరణాలు ధరించిన తర్వాత ముఖానికి మామూలు సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు ధరిస్తే చూడడానికి ఏం బాగుంటుంది? ఇలాంటి వజ్రాల మాస్కు ధరిస్తే అందానికి అందం, దర్జాకు దర్జా అంటున్నాడు. ఇంకా... శంకర్‌కురాడే బంగారు మాస్క్‌కే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేశాడు. వజ్రాల మాస్కు లక్షకు కూడా వస్తుంది కదా! అని తార్కికంగా ప్రశ్నిస్తున్నాడు కూడా. పైగా నా డైమండ్ మాస్క్‌ను ఎన్నాళ్లయినా ధరించవచ్చు. కరోనా పోయిన తర్వాత నా దుకాణానికి వచ్చి మార్చి మరో ఆభరణం చేయించుకోవచ్చు కదా! అని చాలా కన్విన్సింగ్‌గా చెప్తున్నాడు. అతడి మాటలు ఎక్కువ సేపు వింటే ఎవరైనా సరే డైమండ్ మాస్క్ మాయలో పడేట్టుగానే ఉన్నాయి. కుశాల్ భాయ్ తన మాస్కుకు ‘డి కుశాల్ భాయ్’ ఇంగ్లిష్ అక్షరాల ఆకారంలో వజ్రాలను అమర్చుకున్నాడు. ఈ అక్షరాలకు కొద్దిగా పైన ‘డి.కె’ అని లోగో కూడా వజ్రాలతోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment