ప్రపంచవ్యాప్తంగా స్త్రీల నెలసరి సమయాల మీద చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ శారీరకస్థితి గురించిన అవగాహన ఆసియాదేశాల్లో పూర్తిస్థాయిలో లేదు. నెలసరికి–మత కర్మకాండలకి, నెలసరికి–సంస్కృతికి అన్యాయమైన ముడిపడింది. నెలసరి మూడురోజులూ మైల కనుక స్త్రీలు ఇళ్ళలో ఉండకూడదన్న మూఢవిశ్వాసం కొన్నికాలాల్లో ఉండేది. అందుకే మైలరోజుల్లో అన్నివర్గాల స్త్రీలకి, స్థాయీభేదాల్లో ‘ముట్టుగదులు’, ‘ముట్టుకొట్లు’, ‘ముట్టుగుడిసెలు’, ‘ముట్టుదొడ్లు’ నిర్మాణమయ్యాయి. దేశంలో అనేకపేర్లతో అంటుస్థలాలు కొనసాగుతూనే ఉన్నాయి.అధునాతన సాంకేతికతకి ప్రాధాన్యం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కుప్పంలో ఇంతటి మధ్యయుగాల ఆచారం కొనసాగుతూ ఉండటం విరోధాభాస. ఊరినాయన పల్లి, ఊరినాయన కొత్తూరు, పాళ్యం, సలార్లపల్లి, తమిళనాడు బోర్డర్లోని ఏకలనత్తంలాంటి ఊళ్లలో ముట్టుగుడిసెలు ఉన్నాయి. నెలసరి మూడురోజులూ ఆయాగ్రామాల్లో బాలికలు, స్త్రీలు ముట్టుగుడిసెలో ఉండాలి. ప్రసవం అయిన స్త్రీలు పురిటిస్నానం అయ్యేవరకూ పసిగుడ్డుతో సహా అక్కడే ఉండాలి. దీని నిర్మాణం అమెరికా, జర్మనీల కాన్సన్‌ట్రేషన్ క్యాంపులకి తీసిపోదు.
ఆ గ్రామంలో ఒకేసారి బహిష్టు అయిన స్త్రీలు ఎందరు ఉన్నాసరే–పదడుగుల పొడవు వెడల్పులున్న ఆ ఒక్కగదిలోనే ముడుచుకుని కూచోవాలి. చీకటి గుయ్యారంలాంటి ఆ గదికి కరెంటు లేదు, బాత్రూమ్ లేదు. తలుపు వేస్తే గాలివచ్చే మార్గం లేదు, గోడలు నానిపోయి ముదురాకుపచ్చ రంగు పాచిపట్టి ఉన్నాయి. ముంజువాసన, నీచువాసన ముక్కులు బద్దలు గొడుతోంది. వానాకాలంలో పెచ్చులు ఊడిన పైకప్పు నుంచి పెళ్లలు రాలిపడుతుంటాయి. పైనుంచి ధారాపాతంగా కారే నీటికి, అపరిశుభ్రతకి అంటురోగాలు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మురికి కాలువల పక్కన పదడుగుల రోడ్డుమీద ఒకపక్కకి ముడుచుకుని పడుకుంటారు. బహిష్టు స్త్రీలు, ఊరు లేవకముందే లేచి పొలాల్లోకి వెళ్లి బోర్లు ఉన్నచోట, నీరు పారేచోట స్నానాలు చేసి, ముట్టుగుడ్డలు ఉతికి ఆరేసుకుని కూలిపని, పొలంపనులు చేసుకుని చీకటిపడే సమయానికి ముట్టుగుడిసెకి చేరుకుంటారు. ఇళ్ళలో ఉన్న మిగతా స్త్రీలుగానీ వేరేఇంటి స్త్రీలుగానీ ఇంత తిండి తెచ్చిపెడతారు. బహిష్టు సమయాల్లో స్త్రీలకి విశ్రాంతి కావాలి కనుక ఇలాంటి గదుల నిర్మాణం జరిగిందనే వాదన ఈ కాలానికి తగినది కాదు. వారికి పగలంతా పొలం పని, కూలిపనులు తప్పవు. ఆ మూడురోజుల్లో ఇంట్లో పేరుకున్న పనిని మళ్ళీ మైలస్నానం ముగించి వచ్చిన మహిళే చేసుకోవాలి.
ఈ నియమానికి ఆయాగ్రామాల పరిధిలోకి వచ్చే ఏ మహిళా అతీతురాలు కాదు. అక్కడి ఎలి మెంటరీ స్కూల్ లేడీ టీచర్, నెలకి మూడురోజులు సెలవు పెట్టాల్సిందే, జీతం కోతని భరించాల్సిందే. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు కూడా జీతం కోతమీద సెలవు పెట్టాల్సిందే. ఆ మూడురోజుల్లో జాతర సమయాల్లో పదేళ్ళు దాటిన ఆడపిల్లల్ని ఎని మిదిరోజుల పాటు గ్రామం బైటకి తరిమేస్తారు. ఆ సమయంలో సమర్తాడితే గ్రామానికి అరిష్టం కనుక. జాతర అన్నిరోజులూ వారిని అంగన్‌వాడీ కేంద్రంలో ఉంచుతారు. ‘ఇదంతా మీకు ఇష్టమేనా? వద్దని చెప్పొచ్చు కదా?’ అనడిగితే లెంపలు వేసుకుని, ‘గొడ్డావుల మల్లయ్యకి, కదిరి నరసింహస్వామికి కోపంవస్తే ఊరు నాశనం అయిపోతుందని, ఇష్టం తోనే ముట్టుగుడిసెలో ఉంటున్నామని’ చెప్పారు. ముట్టుగుడిసెలకి బాత్రూం, కరెంటు, నీటి సదుపాయాలు వచ్చేలా చూడమన్నారు. ఇదొక సంకట స్థితి.
ముందుగా ఈ ఆచారం పోవడానికి కృషి జరగాలా? వారు కోరిన సదుపాయాల కల్పన జరగాలా? ద్రవిడ భాషల పరిశోధక, అధ్యాపక మిత్రులతో జరి గిన చర్చల్లో ఈ ప్రస్తావన వచ్చింది. ప్రతీ మార్పుకి ఒక ప్రాసెస్ ఉంటుందని, దానికి తోడ్పడే చర్యలు చేపడుతూనే, ఆ స్థితినుంచి ఆ స్త్రీలను బయట పడేయాలన్న మాటలతో చాలామంది ఏకీభవించారు. బహిష్టుని అంటుగా చూడడం, దానిమీద కొనసాగుతున్న నిర్బంధపూరిత మత, సాంస్కృతిక విశ్వాసాలు–మానవ హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంది. సృష్టిలో ఏ ప్రాణికీ సాధ్యంకాని రీతిలో బంధనాలను ఆమోదించి అత్యంత హేయమైన గదుల్లోనూ, రోడ్లమీదా బహిష్టు సమయాలను గడిపే ఆ స్త్రీలకి, వారు కోరిన పద్ధతుల్లో తాత్కాలికంగా కొద్దిసదుపాయాలను కల్పిం చడం ఎంతవరకు సాధ్యమన్నది ఆలోచించాలి. మిత్రులు వరదరాజు, శ్రీనివాస్, రాజారావు చెప్పినట్లు, ‘మనుషుల్లో మెరుగైన జీవి తం కోసం తపన ఉంటుంది, ఇపుడు ముట్టుగుడిసె బాగుపడితే, రేపు ముట్టుసమస్యని పరిష్కరించుకోవడానికి ఆలోచిస్తారు. ప్రతి చలనం కొత్త చైతన్యానికి దారి తీస్తుంది’.
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే
Comments
Please login to add a commentAdd a comment