పట్టాభిషేకం పెద్ద మాట. ఏదో పెద్ద పొజిషన్‌లో కూర్చోబెట్టినట్లు!కానీ.. నలుగురూ తిరిగేచోటబిడ్డకు పాలిచ్చే చోటును కల్పించడమైనామహిళకు పట్టాభిషేకమే. ఇదొకటే కాదు.. మహిళా ఉద్యోగులకు, మహిళా ప్రయాణికులకుకొచ్చి మెట్రో ఇచ్చిన ఇంపార్టెన్స్‌ని చూస్తుంటే.. మహిళా సంక్షేమం పట్టాలు ఎక్కినట్లే ఉంది!
అది కేరళలోని ‘అలువ’లో ఉన్న కొచ్చి మెట్రో ట్రైన్ స్టేషన్. ‘‘నీకు తెలుసా ఈ ట్రైన్‌ని లేడీ నడుపుతోంది’’.. స్టేషన్‌లో ఆగి ఉన్న మెట్రో రైలును చూపిస్తూ ఒకామె తోటి స్వీపర్‌తో చెప్తోంది. ‘లోకో పైలట్‌గా మహిళ.. అని గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా’ అనుకుంటూ కౌంటర్ వైపు నడిచారు ప్రయాణికులు. అక్కడ.. టికెట్ కౌంటర్‌లు నడుపుతున్న వాళ్లు కూడా మహిళలే. ‘ఆల్ ఉమన్ రైల్వే స్టేషనా’ అనుకుంటూ ముందుకు నడుస్తుంటే.. మరో వైపు ఎంక్వైరీ డెస్క్. అందులో ఓ ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు వివరాలు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల్లోని బిడ్డ తల్లులు తమ ఇంట్లో గదిలోకి వెళ్లినంత సౌకర్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ‘పాడ్’లలోకెళ్లి పాపాయికి పాలిచ్చి తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఒక్క అలువ మెట్రో స్టేషన్‌లో కనిపించే సన్నివేశం మాత్రమే కాదు. కేరళలో కొచ్చి మెట్రో స్టేషన్‌లన్నింటిలోనూ దాదాపుగా మహిళా సౌకర్యాలు, సదుపాయాలే.
ఉమెన్ ఫ్రెండ్లీ స్టేషన్‌లు
బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్.. తల్లి కూర్చుని బిడ్డను పడుకోబెట్టడానికి వీలయిన చక్కటి సీటు, ఫ్యాన్, ఫోన్ చార్జింగ్ పాయింట్‌లతో చాలా సౌకర్యంగా ఉంది. వీటిని ఉపయోగించుకోవడానికి అదనంగా చార్జి ఏమీ ఉండదు. బిడ్డకు పాలిచ్చే తల్లుల కోసం ఇలాంటి ఏర్పాటు చేయడానికి కారణం చంటి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకే అంటారు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుమి నాదరాజన్. ‘‘కేరళలో చదువుకున్న మహిళలు ఎక్కువ. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఎక్కువే. ఈ పరిణామం పిల్లలకు పాలివ్వడం మీద చూపిస్తోంది. బహిరంగ ప్రదేశాలు పిల్లలకు పాలివ్వడానికి అనువుగా లేకపోవడంతో పాలివ్వగలిగిన తల్లులు కూడా పోతపాలు పడుతున్నారు.
చంటి పిల్లలు ఇంట్లో ఉన్న సమయం మినహా మిగిలిన రోజంతా పోతపాల మీదే పెరగాల్సి వస్తోంది. ఆరోగ్యకరమైన భావితరం కోసం మా వంతు బాధ్యతగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అవసరాన్ని బట్టి ఫీడింగ్ పాడ్‌ల సంఖ్యను పెంచుతాం కూడా’’ అన్నారు నాదరాజన్. ‘‘ఈ స్టేషన్‌లలో పని చేసే వాతావరణం బాగుంది. మహిళలకు చాలా సురక్షితంగా ఉంది. చక్కటి వర్క్ ఎన్విరాన్‌మెంట్ కావడంతో ఉద్యోగ బాధ్యతలను బాగా ఆస్వాదిస్తున్నాం. మాకొచ్చే జీతం మా జీవితాల్లో మంచి మార్పుకు కారణమవుతోంది’’.. అంటారు మెట్రో ఉద్యోగిని రజిత.
ఎకో ఫ్రెండ్లీ
కొచ్చి మెట్రో ట్రైన్ వ్యవస్థలో క్లీనింగ్ ఉద్యోగం నుంచి సీనియర్ మేనేజ్‌మెంట్ విధుల వరకు మహిళలే కీలకం. మేనేజింగ్ డైరెక్టర్ కూడా మహిళే. అందుకే ఆ స్టేషన్ ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంది. మొత్తం పదమూడు వందల మంది మెట్రో ఉద్యోగుల్లో ఎనభై శాతం మహిళలే. అన్నింటికంటే కీలకమైన నిర్ణయం రైళ్లనునడిపే లోకో పైలట్‌లుగా వీలయినంత ఎక్కువ మంది మహిళలను నియమించడం. కొచ్చి మెట్రో రైళ్లలో 39 మంది లోకో పైలట్‌లున్నారు.
వారిలో ఏడుగురు మహిళలు. ఉద్యోగుల నియామకంలోనే కాదు, స్టేషన్‌ల రూపకల్పనలోనే సమగ్రాభివృద్ధి కనిపిస్తుంది. స్టేషన్ నిర్వహణకు అవసరమయ్యే కరెంట్‌లో 35 శాతం సోలార్ ఎనర్జీ ఉపయోగిస్తున్నారు. స్టేషన్ చుట్టూ రెండు వందలకు పైగా పిల్లర్లున్నాయి. వాటికి నిలువెత్తు గార్డెన్ (వర్టికల్ గార్డెన్) పెంచారు. మున్సిపల్ వేస్ట్ నుంచి తయారైన కంపోస్టు ఎరువును ఈ వర్టికల్ గార్డెన్‌కు వాడుతున్నారు. ఈ విధులన్నిటినీ నిర్వహించేవారు ఎక్కువమంది మహిళలే.
మెట్రో ఉపాధి
కొచ్చి మెట్రో రైల్ వ్యవస్థ.. అందులో ఉద్యోగాలు చేసే మహిళలతోపాటు స్వయం సహాయక బృందాల మహిళలకు కూడా మంచి ఉపాధినిస్తోంది. కేరళలో మహిళల స్వయం సహాయక బృందాలను ‘కుదుంబశ్రీ’ బృందాలుగా వ్యవహరిస్తారు. ఈ మహిళలు తమ ఇళ్లలో చక్కటి, పరిశుభ్రమైన భోజనం వండి స్టీలు బాక్సుల్లో సర్ది తెస్తారు. లంచ్ బాక్సులు మధ్యాహ్నానికి రైల్వే ఉద్యోగులకు అందుతాయి. ఈ స్కీమ్ ఉభయతారకంగా ఉంది.
ఉద్యోగులకు మంచి ఇంటి భోజనం అందుతుంది, అదే సమయంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు ఆదాయ మార్గంగానూ ఉంది. మెట్రో స్టేషన్‌లను ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హితంగా మార్చే ప్రయత్నంలో భాగమే స్టీలు బాక్సులను ఉపయోగించాలనే నిబంధన. ఎక్కువ భోజనాల ఆర్డర్ ఉన్న మహిళలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో రైల్లో ప్రయాణిస్తూ ప్రతి స్టేషన్‌లో బాక్సులను డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం మూడు నుంచి ప్రతి స్టేషన్‌లో ఆగుతూ తమ బాక్సులను కలెక్ట్ చేసుకుంటారు.
ఏ షిఫై్టనా ఓకే
సాధారణంగా మహిళలను ఉద్యోగంలో చేర్చుకోవడానికి మగబాస్‌లు మొదటగా చెప్పే అభ్యంతరం ‘వాళ్లు నైట్ షిఫ్ట్‌లు చేయలేరు’ అని. ‘చేయలేరు’ అని మా తరఫున మీరు తీర్పు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తోంది ఈ తరం మహిళ. ఏ షిఫ్టులో పని చేయడానికైనా మేము సిద్ధమేనంటున్నారు. ‘‘నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. అంతగా ఇష్టపడిన పని చేసేటప్పుడు., ఫలానా షిఫ్టులో పని చేయను, ఫలానా షిఫ్టు అయితేనే చేయగలుగుతాను అని కండిషన్‌లు ఎలా పెడతాను. డ్రైవర్‌గా ప్రమోషన్ అందుకోవడం నా లక్ష్యం’’ అంటున్నారు అసిస్టెంట్ లోకో పైలట్ హిమ.
మంజీర
సమాజం కలుపుకోవాలి
ట్రాన్స్‌జెండర్‌లకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చిన ఘనత కూడా కొచ్చి మెట్రోదే. ఇందులో 60 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉద్యోగం చేస్తున్నారు. ‘‘ట్రాన్స్‌జెండర్‌ల పట్ల సమాజం దృష్టి కోణం మారాల్సిన అవసరం ఉంది. సమాజం చూపులు మారాలంటే వాళ్లు కూడా సభ్యసమాజంలో అందరితోపాటు కలిసి అన్ని పనుల్లో కనిపించాలి. వృత్తి ఉద్యోగాల్లో వాళ్లతో కలివిడిగా మెలగడం, వాళ్ల సర్వీస్ పొందడం ద్వారా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను తమలో ఒకరిగా కలుపుకోగలుగుతుంది సమాజం. అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు కొన్నాళ్ల క్రితం వరకు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఎలియాస్ జార్జ్. ముప్పై ఆరేళ్ల కార్తీక రాఘవన్ బయో కెమిస్ట్‌గా ఉద్యోగం మానేసి మెట్రో రైల్ ఉద్యోగంలో చేరారు.
‘‘బయో కెమిస్ట్‌గా ల్యాబ్‌లో రోజంతా ప్రాణం లేని వస్తువులతోనే గడపాలి. నాకు మనుషుల మధ్య ఉద్యోగం చేయాలని ఉండేది. ఏ ఉద్యోగానికి అప్లయ్ చేద్దామన్నా విద్యార్హతలు, అనుభవంతోపాటు తప్పనిసరిగా ఓ కాలమ్ ఉంటుంది. అది జెండర్ కాలమ్. అందులో మగ లేదా ఆడ అనే గడులు మాత్రమే ఉంటాయి. ఏదో ఒకటి టిక్ చేయాలి. మెట్రో రైల్ నోటిఫికేషన్ కాలదోషం పట్టిన నిబంధనలను తుడిచేసింది. మాలాంటి వాళ్లందరికీ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనలను సరళీకరించింది. దాంతో నా చదువుకు సంబంధం లేని ఉద్యోగమైనా సరే, సంతోషంగా అప్లయ్ చేశాను. హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు కార్తీక.
Comments
Please login to add a commentAdd a comment