కొమురవెల్లి మల్లన్నకు కోటిదండాలు!
బంగారమంటి బండారు
మల్లన్న ఆలయంలో పసుపును బండారుగా పిలుస్తారు. స్వామిని దర్శించుకునే పసుపు బండారిని భక్తుల నుదుట బొట్టుగా పెడతారు. ఆలయ రాజగోపురం, ప్రహరీగోడ, పట్నాల మండపం, ముఖమండపం, దేవస్థాన కాటేజీలు అన్నీ పసుపురంగుతో ఉంటాయి. స్వామివారి అరచేతిలోని పసుపును నుదుటున పెట్టుకుంటే రోగాలు రాకుండా రక్షిస్తాడని భక్తుల నమ్మకం.
తెలంగాణలో కొమురవెల్లి మల్లన్న ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజలిల్లుతోంది. గజ్జెలలాగులతో జానపదులు, పాశ్చాత్య వేషధారణతో నాగరికులైన భక్తులకు తరతరాలుగా ఆరాధ్య దైవంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. వరంగల్, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలో మల్లన్న క్షేత్రం వెలిసింది.
శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం చాలా ప్రాచీన కాలం నాటిదని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం శ్రీమల్లికార్జునస్వామి, ఆయన సతీమణులైన బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ నిత్యం పూజలందుకుంటున్నారు. ఇతర ఏ శైవక్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ స్వామి ఇరుపక్కలా అమ్మవార్ల స్వరూపాలతో దర్శనమిస్తారు.ఈ క్షేత్రంలోని శ్రీమల్లన్న నాభిలో పుట్టులింగం ఉందని ప్రతీతి. మల్లన్న ఆలయం చుట్టూ అష్టైభైరవులు కాపలాగా ఉండి, దుష్టశక్తుల నుండి ప్రజలను కాపాడుతుంటారని భక్తుల విశ్వాసం.
రెండు రకాల పూజలు
ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం (సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం)తో మొదలై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) అగ్నిగుండాలతో మూడు నెలల జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మల్లన్న స్వామి యాదవులకు కులదైవంగా భావించి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాదవులు, ఇతర కులస్తులు ప్రతి ఏటా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. తెలంగాణ జానపదుల జాతర మల్లన్న క్షేత్రంలో రెండు రకాల పూజలుంటాయి. మల్లన్న యాదవుల ఆడబిడ్డ గొల్లకేతమ్మను, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మలను పాణిగ్రహణం చేశారని క్షేత్రపురాణం చెబుతోంది. అందుకనే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో లింగబలిజలు పూజలు నిర్వహిస్తుండగా ఆలయ ప్రాంగణంలోని గంగిరేగుచెట్టు వద్ద ఒగ్గు పూజారులు రంగురంగుల ముగ్గులతో పట్నాలు వేసి పసుపు బియ్యంతో స్వామికి వంటలు వండి మొక్కులు చెల్లిస్తుంటారు. స్వామికి భక్తులు పట్నం వేయడంలో తంగేడు ఆకుపిండిని ప్రత్యేకంగా వాడతారు. భక్తులు కొత్తకుండలో బోనం వండి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కుండను ఇంటికి తీసుకెళ్లివాడుకుంటే శుభం చేకూరుతుందని నమ్మకం. అదేవిధంగా గంగిరేగు చెట్టు వద్ద భక్తులు పట్నం వేసిన ముగ్గుపిండిని తమ పొలాలలో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని కర్షకుల విశ్వాసం.
మల్లన్న మహిమ నలుదిశలా వ్యాపించడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సగటున అరవైఐదు లక్షల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు.
భద్రాద్రి రాముని తలంబ్రాల తరహాలో...
తెలంగాణ జానపదుల ఆరాధ్యదైవం కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కళ్యాణాన్ని జరిపేందుకు ప్రభుత్వం అన్ని సన్నహాలను ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా జరిగే మల్లన్న కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారి కల్యాణానికి హాజరై స్వామివారితో పాటు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో కళ్యాణం ఏర్పాట్లు మొదలయ్యాయి. జయనామ సంవత్సరం మార్గశిర మాసం చివరి ఆదివారం అనగా 21వ తేది ఉదయం 10:45 గంటలకు వీరశైవ సంప్రదాయం ప్రకారం శ్రీమల్లికార్జునస్వామి, మేడాలదేవి, కేతమ్మదేవిల వివాహమహోత్సవ ఏర్పాట్లు మొదలు కానున్నాయి. కర్ణాటకకు చెందిన షట్‌స్థల బ్రహ్మ శ్రీశ్రీశ్రీ వీరశైవ శివాచార్య మహాస్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఉదయం 5:00 గంటలకు దృష్టికుంభం, రాత్రి 7-00 గంటలకు శ్రీస్వామివారి శకటోత్సవం జరుగుతాయి. ప్రతిరోజూ అభిషేకాది ప్రత్యేక పూజలు ఉంటాయి. ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారాముల కళ్యాణాన్ని తలపించేలా కొమురవెల్లిలో మల్లన్న కళ్యాణం చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు దాదాపు అరకోటికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా.
- తాండ్ర కృష్ణగోవింద్
సాక్షి, హన్మకొండ