Trusts
-
వేల కోట్ల టాక్స్ మినహాయింపులు: కాగ్ కీలక నివేదిక
సాక్షి ముంబై: ఛారిటబుల్ ట్రస్టులు 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 18,800 కోట్ల రూపాయల పన్ను మినహాయింపులను పొందాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక వెల్లడించింది.ఇందులో రిజిస్టర్ కాని ట్రస్ట్‌లు 21వేలకుపైగా ఉన్నాయని తెలిపింది. అలాగే 347 ట్రస్టులు, విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నమోదు కానప్పటికీ, విదేశీ విరాళాలు పొందాయని సోమవారం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?) మొత్తం రూ.18,800 కోట్ల మినహాయింపులో, అత్యధికంగా రూ.4,245 కోట్ల మినహాయింపులు ఢిల్లీకి చెందిన 1345 ట్రస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,745 ట్రస్టులు 2వేల 500 కోట్ల మినహాయింపును పొదవాయి.ఉత్తరప్రదేశ్‌లో 2,100 ట్రస్ట్‌లు రూ. 1,800 కోట్ల పన్ను రహిత ఆదాయాన్ని పొందగా, రూ.1,600 కోట్ల మేర చండీగఢ్‌లో 299 ట్రస్టులు పొందాయి. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి 770 కంటే ఎక్కువ ట్రస్ట్‌లు రూ. 1,595 కోట్లకు పైగా మినహాయింపును పొందాయి మరియు గుజరాత్, ఆంధ్ర మరియు కర్ణాటకలలోని ట్రస్ట్‌ల ద్వారా క్లెయిమ్ చేయబడిన ఒక్కొక్కటి రూ. 1,000 కోట్లకు పైగా మినహాయింపులు ఉన్నాయి. కనీసం 347 ట్రస్ట్‌లు ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ని లేనప్పటికీ విదేశీ విరాళాలను పొందినట్లు నివేదించింది. సెక్షన్ 11 కింద తమ ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్‌లు ఐటీ చట్టంలోని సెక్షన్ 12AA కింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. “2014-15 నుండి 2017-18 వరకు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్‌లకు సంబంధించి I-T (సిస్టమ్స్) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అందించిన డేటా ప్రకారం 21,381 కేసులలో సెక్షన్ 11 కింద మినహాయింపు క్లెయిమ్ చేసినట్లు ఆడిట్ గుర్తించింది. అయితే, సెక్షన్ 12AA ప్రకారం నమోదు అందుబాటులో లేదనని నివేదిక పేర్కొంది. ఈ ట్రస్ట్‌లు విదేశీ విరాళాలను స్వీకరించడానికి ఎఫ్సీఆర్ఏ క్రింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది.ఎఫ్సీఆర్ఏ చట్టం కింద నమోదు చేయకుండానే అత్యధికంగా విదేశీ విరాళాలు పొందిన రాష్ట్రాల్లో కర్ణాటక, టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని ఆడిట్లో తేలింది. -
టార్గెట్ రూ.216 కోట్లు!
ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన రూ.200 కోట్లకు పైగా సొమ్ము బ్యాంకుల్లో కొన్నేళ్లుగా కదలకుండా ఉండటాన్ని ఓ ముఠా గమనించింది. వాటిని స్వాహా చేయడానికి స్కెచ్చేసింది. ఇది కనిపెట్టిన పుణే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారితో కూడిన ఓ గ్యాంగ్ ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన సొమ్ముపై కన్నేసింది. ఆయా ట్రస్టుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.216 కోట్లకు పైగా మొత్తాన్ని కొట్టేయడానికి భారీ స్కెచ్ వేసింది. స్టాక్ బ్రోకర్ల ఖాతాల్లోకి మళ్లిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో వారి ద్వారా స్వాహా చేయడానికి రంగంలోకి దిగింది. దీనిపై సమాచారం అందుకున్న మహారాష్ట్రలోని పుణే సైబర్ క్రైమ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. తామే స్టాక్ బ్రోకర్లుగా నటించి 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఉన్నారని పుణే సైబర్ క్రైమ్ విభాగం అధికారి శివాజీ పవార్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రను అనుమానిస్తున్నామని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. పుణేకు చెందిన అనఘా మోడక్ ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నాడు. ఎంబీఏ ఉత్తీర్ణుడైన ఇతను గతంలో కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. అయితే గత ఏడాది కోవిడ్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన ఇతగాడు పెడతోవ పట్టి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన కొందరు వ్యక్తుల నుంచి ఉత్తరాదికి చెందిన ఐదు ట్రస్ట్‌ల సమాచారం అతనికి అందింది. ఆ ట్రస్టులకు రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, అయితే ఏళ్లుగా లావాదేవీలు జరగట్లేదని, వాటిలో పెద్దమొత్తంలో ఉన్న డబ్బులు ఎవ్వరూ డ్రా చేసుకోవట్లేదని తెలిసింది. ఈ సమాచారం లీక్ చేసింది ఆయా బ్యాంకులకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదింటిలో కలిపి రూ.216,29,54,240 సొమ్ము ఉందని, ఇతర వివరాలు పక్కాగా చెప్పడంతో పాటు ఆయా బ్యాంక్ ఖాతాల పిన్ నంబర్లు సైతం అందజేయడంతో వారి హస్తంపై అనుమానం కలుగుతోంది. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ట్రస్ట్‌ల సమాచారంతో కూడిన దాదాపు 20 స్క్రీన్ షాట్లను మోడక్ వాట్సాప్ ద్వారా అందుకున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రస్ట్‌ల అధికారిక ఖాతాల్లో ఉన్న మొత్తాలను నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు కనుక ఓ పథకం వేశాడు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సాయంతో ఆయా బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మొత్తాలను స్టాక్ బ్రోకర్లకు చెందిన కరెంట్ ఖాతాల్లోకి మళ్లించాలనేదే ఆ పథకం. ఈ వ్యవహారంలో సహకరించడానికి, స్టాక్ బ్రోకర్లను సమన్వయ పరచడానికి పరిచయస్తుల ద్వారా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌కు చెందిన మామిడి రాజశేఖర్, వారాసిగూడలోని బౌద్ధనగర్‌కు చెందిన జి.లక్ష్మీనారాయణ, నాగోల్ బండ్లగూడ వాసి యువీ సుబ్రహ్మణ్యంలను భాగస్వాములుగా చేసుకున్నాడు. ఆ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం ద్వారా వాటిలోని నగదును మళ్లించడానికి పథకం వేసిన మోడక్ దానికోసం హ్యాకర్లను సిద్ధం చేసుకున్నాడు. వారికి రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.25 లక్షలు సమీకరించి అడ్వాన్సుగా ఇచ్చాడు. ఇక స్టాక్ బ్రోకర్లను వెతికి పట్టుకోవడం, వారితో బేరసారాలు సాగించడం కోసం మోడక్ కొందరు అనుచరుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తొలుత వివిధ ప్రాంతాల స్టాక్ బ్రోకర్ల ఖాతాలను వాడుకోవాలని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ప్లాన్ మార్చి పుణే ప్రాంతానికే చెందిన వారి కోసం ఆరా తీయడం మొదలెట్టారు. దీంతో ఈ విషయం గత వారం పుణే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిసింది. దీంతో వారే స్టాక్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. అనఘా మోడక్‌ను సంప్రదించిన పోలీసు బృందం తాము తమ ఖాతాలను అందించడానికి సిద్ధంగా ఉన్న ట్లు చెప్పింది. అతడు అంగీకరించి తన వద్ద ఉన్న డేటా బయటపెట్టడంతో పాటు తమ వలలో చిక్కడంతో అదుపులోకి తీసుకుంది. అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా గుజరాత్, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ దాడులు నిర్వహించి ముఠా సభ్యుల్ని అరెస్టు చేసింది. పరారైన బ్యాంకు సిబ్బంది కోసం గాలిస్తోంది. -
ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. అనేక స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టులు అన్నదానం, నిత్యవసరసరుకులు అందిస్తూ సాయాన్ని చేస్తున్నాయి. ఈ సేవ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న 30 వృధాశ్రమాలు మరియు అనాదాశ్రమాల్లో 21 రోజులు సరిపడా నిత్యావసరాలు పంపిణీని 'లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్', 'అభయం ఫౌండేషన్' సభ్యులు అందించారు. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న పోలీసులుకు, ప్రభుత్వ అధికారులుకు, సానిటరీ కార్మికులకు, నిత్యవసర సామాగ్రి అందించే వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు మాస్క్‌లు అందించారు. దాదాపు 5500 మాస్క్‌లను పశ్చిమగోదావరి, కృష్ణా, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో అందించారు. వీటితో పాటు హైదరాబాద్ లో 150 రోజు కూలి కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అభయం పౌండేషన్ ద్వారా మీరు కూడా సాయం అందించాలనుకుంటే 6303251670 నంబర్‌కి కాల్ చేయండి https://www.facebook.com/groups/Abhayam.Group/?ref=bookmarks https://m.facebook.com/story.php?story_fbid=1279274842278130&id=411726419032981 -
నెలవారీ పింఛన్ సేవలకే
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోట: సమాజంలో పేదలు, నిస్సహాయుల కోసం పరితపించి తన భర్త మరణానంతరం వస్తున్న పింఛన్‌ను వారికే అందిస్తూ సాంత్వన కలిగిస్తున్నారు ఎమ్వీరావ్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఆదిలక్ష్మమ్మ. భర్త మరణానంతరం తనకు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పేదలకు పంచాలని భావించి.. తదనుగుణంగా భర్త పేరుతో ఫౌండేషన్‌ను స్థాపించి సమాజసేవలో పునీతులవుతున్నారు. కుమారుడు, కుటుంబసభ్యుల అండతో తమ సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ అన్ని వర్గాల మన్ననలను పొందుతున్నారు. భర్త ఆశయాలు కలకాలం గుర్తుండాలని మండలంలోని చెందోడుకు చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త, దివంగత ముప్పవరకు వెంకటేశ్వరరావు ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయుడు, విద్యావేత్త. పనిచేసిన చోటల్లా అభ్యుదయవాదిగా పేరు గడించారు. సంఘసంస్కర్త, అణగారిన వర్గాల చైతన్యం కోసం పాటుపడ్డారు. అందరూ సంతోషంగా ఉండాలని కష్టనష్టాలను పంచుకుంటూ వారితో మమేకమవుతూ ఆఖరి శ్వాసవరకు జీవించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైరైన అనంతరం స్నేహితులతో కలిసి 2001లో విద్యానగర్‌లో విద్యావికాస్ పాఠశాలను ప్రారంభించారు. విద్యారంగానికి చివరి శ్వాసవరకు సేవచేసి 2008 నవంబర్ 17న మరణించారు. అప్పటి వరకు గృహిణిగా ఇంటిపట్టునే ఉండి కుటుంబబాధ్యతలు నెరవేర్చిన ఆదిలక్ష్మమ్మ తన భర్త ఆశయాలు ప్రజల్లో కలకాలం గుర్తుండాలని సంకల్పించారు. 2009 మార్చిన కుమారుడు, ముగ్గురు కుమార్తెలతో చర్చించి వారి నిర్ణయం మేరకు ఎమ్వీరావ్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో సమాజానికి ఎంతోకొంత సేవ చేస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో 2,250కు పైగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కుటుంబసభ్యుల తోడ్పాటు కలిసిరావడంతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం లభించింది. రక్తదానంపై విరివిగా ప్రచారం చేస్తూ శిబిరాలను ఏర్పాటు చేయడంతో ఉత్తమ మోటివేటర్‌గా నెల్లూరు రెడ్‌క్రాస్ ద్వారా 8 సార్లు, కలెక్టర్ చేతుల మీదుగా రెండు సార్లు అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం వచ్చే పెన్షన్ రూ.22 వేలు కాగా, గ్రాట్యుటీ రూ.10 వేల మొత్తాన్ని సేవల కోసం కేటాయిస్తున్నాను. వేసవిలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు విలువైన సేవలందిస్తున్నారు. మారుమూల పల్లెలు, గిరిజన కాలనీల్లో వసతులు కల్పిస్తూ శక్తివంచన లేకుండా చేతనైన సాయం చేస్తున్నారు. తల్లి దారిలోనే కుమారుడు ముప్పవరకు లీలామోహన్ నడుస్తున్నారు. కుల, మత, ప్రాంతీయతత్వం అడ్డురాదని నిరూపిస్తూ ఫౌండేషన్ సేవలను విస్తృతం చేస్తున్నారు. సాయం అందించడమే లక్ష్యం ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. స్వామి వివేకానందుని బోధనల స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. మనుషులు దూరమైనా వారి జ్ఞాపకాలు మంచి మార్గంలో నడిపిస్తాయి. భర్త ఆశయసాధన కోసం పాటుపడుతున్నా. కొన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. దృఢచిత్తంతో ముందుకు సాగుతూ వందలాది సేవా కార్యక్రమాలను నిర్వహించా. కొడుకు, కోడళ్లతో పాటు మనవరాళ్లతో ఆనందమయమైన జీవనం గడుపుతున్నా. – ఆదిలక్ష్మమ్మ -
స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి జ్యోతినగర్: స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వారు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం సాయి సామాజిక భవనంలో ప్రేమ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ స్వచ్ఛంద సంస్థల శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆశ్రమాలు నిర్వహిస్తున్నవారు పాటించవలసిన అంశాలను తెలియజేశారు. ప్రభుత్వపరంగాఎన్జీవోలకు కలిగే సౌకర్యాలను వివరించారు. ఇష్టానుసారంగా స్వచ్ఛంద సంస్థలను నిర్వహించరాదన్నారు. అనంతరం వృద్ధుల ఆశ్రమానికి మంచాలు, పరుపులను అందజేశారు. ట్రస్టు నిర్వాహకులు స్వప్నా, సీఎస్సార్ డెప్యూటీ మేనేజర్ ఆకుల రాంకిషన్, ఎన్వైపీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, రహమత్‌పాషా, వెంకటేష్, లింగమూర్తి, సాయికృష్ణ, లింగమూర్తి, శ్యాం, ఓంకార్‌తో పాటు వివిధ సంఘాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
మధ్యాహ్నభోజనం ట్రస్టులకిస్తే చూస్తూ ఊరుకోం
స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే సహించేదిలేదు మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ పరిగి: మధ్యాహ్న భోజనం వడ్డించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలు, ట్రాస్టులకు అప్పగించాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పరిగిలో జీపుజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్నం ఏజెన్సీల నోట్లో మట్టికొడుతూ పాఠశాలలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. ఫైలెట్ ప్రాజుక్టు కింద జిల్లాను ఎంచుకుని త్వరలో స్వచ్ఛంద సంస్థల చేత నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండటం లేదని కాగ్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకువెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి వెంకటయ్య, నాయకులు యాదగిరి, మంగమ్మ, నర్సమ్మ, సత్యమ్మ పాల్గొన్నారు. -
చేర్యాల చిత్రం
నకాశీ అనగనగా అంటూ ఒక కథను చెప్పాలన్నా, పల్లె బతుకును హృద్యంగా చిత్రించాలన్నా, పురాణాలను కళ్లకు కట్టేలా చూపెట్టాలన్నా... ఆ చిత్రాలే చెప్పాలి. ఆ బొమ్మలే చూపెట్టాలి... అందుకోసం చేర్యాల వరకు వెళ్లాలి. హైదరాబాద్‌కు 100 కి.మీ. దూరంలో వరంగల్ జిల్లాలో ఉందీ చేర్యాల. స్థానికంగా నకాశీ ఆర్ట్‌గా పేరొందిన ఈ చిత్రకళ ప్రపంచవ్యాప్తంగా చేర్యాల ఆర్ట్‌గా ప్రసిద్ధికెక్కింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శివుడికి కాశీ ఎలాగో.. ఈ నకాశీ కళకు చేర్యాల అలాగ.. అందుకే ప్రపంచమంతా ఈ కళను ఈ ఊరు పేరుతో చేర్యాల ఆర్ట్‌గా పిలుస్తోంది. నకాశీ కళ గురించి వివరంగా చెప్పాలంటే 400 ఏళ్లు వెనక్కు వెళ్లాలి.. ఇరాన్లో పుట్టిన ఈ కళ.. మొఘలాయిలతో పాటు మన దేశంలో అడుగు పెట్టింది. ఉత్తర భారతంలో పెరిగి తెలుగు నేలపై చేర్యాల ఆర్ట్‌గా ఖ్యాతిగాంచింది. సుమధుర ‘చిత్ర’కావ్యం.. ఏదో ఒక ఇతివృత్తాన్ని వివరించే చిత్రాలు, పురాణ పాత్రల బొమ్మలు.. నకాశీ కళలో ప్రధానమైన అంశాలు. ఒకప్పుడు ఎవరైనా ఇతిహాసాల గురించో, వివిధ కులాల పురాణాలు గురించో ప్రేక్షకులకు చెప్పాలంటే వీటినే ఉపయోగించేవారు. అందుకే ఇదే ఆధారంగా నకాశీ కళ పురుడు పోసుకుంది. రామాయణం నుంచి మహాభారతం వరకు, వీధి బాగోతాల నుంచి కుల పురాణాల వరకు నకాశీ చిత్రాలలో సజీవ దృశ్య కావ్యాలుగా కనిపిస్తుంటాయి.. పాత్రలన్నీ మనముందే కదలాడుతున్నట్లు ఉంటాయి. చేర్యాలకు చేరువైందిలా... సుమారు 75 ఏళ్ల కిందట వేములవాడ నుంచి చేర్యాలకు వచ్చి స్థిరపడిన నకాశీ కులస్తుడు దనాల కోట వెంకయ్య ఈ కళకు మెరుగులు దిద్దాడు. తర్వాత ఆయన కుమారుడు వెంకటరమణయ్య అతడి తర్వాత ఆయన వారసులు చంద్రయ్య, వైకుంఠం.. ప్రస్తుతం చంద్రయ్య మనవడు నాగేశ్వర్ ఇలా వారసత్వంగా ఈ కళను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రకృతే ప్రాణం పోస్తుంది.. నకాశీ కళతో రూపొందిన చిత్రాలు, బొమ్మల్లో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. ప్రకృతిలో దొరికే వస్తువులతోనే అవి ప్రాణం పోసుకుంటాయి. నకాశీ కళలో పునికి చెట్టు కొమ్మ.. బొమ్మగా మారుతుంది. చింతగింజల పేస్టు, సుద్ద ముక్కలు, చెక్కపొడి ఆ బొమ్మకు తుది రూపునిస్తాయి. కిరోసిన్ దీపం నుంచి వచ్చే నలుపు, వాగుల్లో దొరికే గవ్వలను దంచగా వచ్చే తెలుపు, ఇండిగో చెట్ల నుంచి వచ్చే నీలం.. రంగులుగా మారుతాయి.. తయారీ ఇలా .. రామాయణం, మహాభారతం లాంటి పెద్ద కావ్యాలను కూడా మినియేచర్లుగా నకాశీ కళతో రూపొందించడం గమనార్హం. ఒక్క రామాయణం రూపొందాలంటే ఇద్దరు కనీసం మూడు నెలలు కష్టపడాల్సిందే. ఇక నకాశీ బొమ్మలు, మాస్కులకు కూడా దాదాపు ఇదే పద్ధతిని అవలంబిస్తారు. ఒక్క బొమ్మ రూపుదిద్దుకోవాలంటే కనీసం ఐదురోజులు పడుతుంది. వీటిని కూడా వివిధ సైజుల్లో చేస్తారు. ఖండాంతరాలు దాటిన ఖ్యాతి నకాశీ కళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. జపాన్, జర్మనీ, రష్యా తదితర దేశాలలో ఈ కళ గుర్తింపు పొందింది. నకాశీ నిపుణులు ఈ కళ అంతరించకుండా ఉండేందుకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆదరణకు నోచుకోక... ఉపాధి లేక.. వీరి కళ ఖండాంతరాలు దాటుతున్నా కడుపు మాత్రం నిండడమే లేదు. కాకతీయులు, నిజాం పాలనలోనూ ప్రోత్సాహం దక్కిన నకాశీ కళకు ఇప్పుడు ప్రభుత్వ ఆదరణ కరువైంది. వీరి ఉత్పత్తులకు మార్కెటింగ్ కూడా దొరకడం లేదు. లేపాక్షి, చెన్నైలోని దక్షిణ చిత్ర సంస్థలు మాత్రమే కాస్తోకూస్తో నకాశీ ఉత్పత్తులను కొంటూ ఆసరాగా నిలుస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 400 ఏళ్ల చరిత్ర ఉన్న నకాశీ కళ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ చేర్యాల ఆర్ట్‌ను ఆదరించ కుంటే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగాంలో ఎవరూ సమాధానం చెప్పలేని ఒక ప్రశ్నగానే మిగిలిపోయే అవకాశం ఉంది. (ఆ ప్రోగ్రాంలో ఈ ప్రశ్న అడిగారు). కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ ప్రాచీన కళను ప్రభుత్వం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. - ప్రవీణ్‌కుమార్ కాసం -
కొమురవెల్లి మల్లన్నకు కోటిదండాలు!
బంగారమంటి బండారు మల్లన్న ఆలయంలో పసుపును బండారుగా పిలుస్తారు. స్వామిని దర్శించుకునే పసుపు బండారిని భక్తుల నుదుట బొట్టుగా పెడతారు. ఆలయ రాజగోపురం, ప్రహరీగోడ, పట్నాల మండపం, ముఖమండపం, దేవస్థాన కాటేజీలు అన్నీ పసుపురంగుతో ఉంటాయి. స్వామివారి అరచేతిలోని పసుపును నుదుటున పెట్టుకుంటే రోగాలు రాకుండా రక్షిస్తాడని భక్తుల నమ్మకం. తెలంగాణలో కొమురవెల్లి మల్లన్న ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజలిల్లుతోంది. గజ్జెలలాగులతో జానపదులు, పాశ్చాత్య వేషధారణతో నాగరికులైన భక్తులకు తరతరాలుగా ఆరాధ్య దైవంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. వరంగల్, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలో మల్లన్న క్షేత్రం వెలిసింది. శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం చాలా ప్రాచీన కాలం నాటిదని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం శ్రీమల్లికార్జునస్వామి, ఆయన సతీమణులైన బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ నిత్యం పూజలందుకుంటున్నారు. ఇతర ఏ శైవక్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ స్వామి ఇరుపక్కలా అమ్మవార్ల స్వరూపాలతో దర్శనమిస్తారు.ఈ క్షేత్రంలోని శ్రీమల్లన్న నాభిలో పుట్టులింగం ఉందని ప్రతీతి. మల్లన్న ఆలయం చుట్టూ అష్టైభైరవులు కాపలాగా ఉండి, దుష్టశక్తుల నుండి ప్రజలను కాపాడుతుంటారని భక్తుల విశ్వాసం. రెండు రకాల పూజలు ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం (సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం)తో మొదలై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) అగ్నిగుండాలతో మూడు నెలల జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మల్లన్న స్వామి యాదవులకు కులదైవంగా భావించి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాదవులు, ఇతర కులస్తులు ప్రతి ఏటా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. తెలంగాణ జానపదుల జాతర మల్లన్న క్షేత్రంలో రెండు రకాల పూజలుంటాయి. మల్లన్న యాదవుల ఆడబిడ్డ గొల్లకేతమ్మను, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మలను పాణిగ్రహణం చేశారని క్షేత్రపురాణం చెబుతోంది. అందుకనే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో లింగబలిజలు పూజలు నిర్వహిస్తుండగా ఆలయ ప్రాంగణంలోని గంగిరేగుచెట్టు వద్ద ఒగ్గు పూజారులు రంగురంగుల ముగ్గులతో పట్నాలు వేసి పసుపు బియ్యంతో స్వామికి వంటలు వండి మొక్కులు చెల్లిస్తుంటారు. స్వామికి భక్తులు పట్నం వేయడంలో తంగేడు ఆకుపిండిని ప్రత్యేకంగా వాడతారు. భక్తులు కొత్తకుండలో బోనం వండి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కుండను ఇంటికి తీసుకెళ్లివాడుకుంటే శుభం చేకూరుతుందని నమ్మకం. అదేవిధంగా గంగిరేగు చెట్టు వద్ద భక్తులు పట్నం వేసిన ముగ్గుపిండిని తమ పొలాలలో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని కర్షకుల విశ్వాసం. మల్లన్న మహిమ నలుదిశలా వ్యాపించడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సగటున అరవైఐదు లక్షల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. భద్రాద్రి రాముని తలంబ్రాల తరహాలో... తెలంగాణ జానపదుల ఆరాధ్యదైవం కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కళ్యాణాన్ని జరిపేందుకు ప్రభుత్వం అన్ని సన్నహాలను ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా జరిగే మల్లన్న కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారి కల్యాణానికి హాజరై స్వామివారితో పాటు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో కళ్యాణం ఏర్పాట్లు మొదలయ్యాయి. జయనామ సంవత్సరం మార్గశిర మాసం చివరి ఆదివారం అనగా 21వ తేది ఉదయం 10:45 గంటలకు వీరశైవ సంప్రదాయం ప్రకారం శ్రీమల్లికార్జునస్వామి, మేడాలదేవి, కేతమ్మదేవిల వివాహమహోత్సవ ఏర్పాట్లు మొదలు కానున్నాయి. కర్ణాటకకు చెందిన షట్‌స్థల బ్రహ్మ శ్రీశ్రీశ్రీ వీరశైవ శివాచార్య మహాస్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఉదయం 5:00 గంటలకు దృష్టికుంభం, రాత్రి 7-00 గంటలకు శ్రీస్వామివారి శకటోత్సవం జరుగుతాయి. ప్రతిరోజూ అభిషేకాది ప్రత్యేక పూజలు ఉంటాయి. ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారాముల కళ్యాణాన్ని తలపించేలా కొమురవెల్లిలో మల్లన్న కళ్యాణం చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు దాదాపు అరకోటికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. - తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి, హన్మకొండ