టార్గెట్‌ రూ.216 కోట్లు! | Telangana: Target Rs.216 Cr Fraud In Trust Bank Accounts | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ రూ.216 కోట్లు! దొంగిలించేందుకు యత్నం

Published Thu, Mar 25 2021 3:12 AM | Last Updated on Thu, Mar 25 2021 5:17 AM

Telangana: Target Rs.216 Cr Fraud In Trust Bank Accounts - Sakshi

ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన రూ.200 కోట్లకు పైగా సొమ్ము బ్యాంకుల్లో కొన్నేళ్లుగా కదలకుండా ఉండటాన్ని ఓ ముఠా గమనించింది. వాటిని స్వాహా చేయడానికి స్కెచ్చేసింది. ఇది కనిపెట్టిన పుణే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారితో కూడిన ఓ గ్యాంగ్‌ ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన సొమ్ముపై కన్నేసింది. ఆయా ట్రస్టుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.216 కోట్లకు పైగా మొత్తాన్ని కొట్టేయడానికి భారీ స్కెచ్‌ వేసింది. స్టాక్‌ బ్రోకర్ల ఖాతాల్లోకి మళ్లిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో వారి ద్వారా స్వాహా చేయడానికి రంగంలోకి దిగింది. దీనిపై సమాచారం అందుకున్న మహారాష్ట్రలోని పుణే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. తామే స్టాక్‌ బ్రోకర్లుగా నటించి 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఉన్నారని పుణే సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారి శివాజీ పవార్‌ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రను అనుమానిస్తున్నామని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయన కథనం ప్రకారం..

  • పుణేకు చెందిన అనఘా మోడక్‌ ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నాడు. ఎంబీఏ ఉత్తీర్ణుడైన ఇతను గతంలో కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు చేశాడు. అయితే గత ఏడాది కోవిడ్‌ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన ఇతగాడు పెడతోవ పట్టి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు.
  • ఈ క్రమంలో ముంబైకి చెందిన కొందరు వ్యక్తుల నుంచి ఉత్తరాదికి చెందిన ఐదు ట్రస్ట్‌ల సమాచారం అతనికి అందింది. ఆ ట్రస్టులకు రెండు ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, అయితే ఏళ్లుగా లావాదేవీలు జరగట్లేదని, వాటిలో పెద్దమొత్తంలో ఉన్న డబ్బులు ఎవ్వరూ డ్రా చేసుకోవట్లేదని తెలిసింది.
  • ఈ సమాచారం లీక్‌ చేసింది ఆయా బ్యాంకులకు చెందిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదింటిలో కలిపి రూ.216,29,54,240 సొమ్ము ఉందని, ఇతర వివరాలు పక్కాగా చెప్పడంతో పాటు ఆయా బ్యాంక్‌ ఖాతాల పిన్‌ నంబర్లు సైతం అందజేయడంతో వారి హస్తంపై అనుమానం కలుగుతోంది.  
  • బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ట్రస్ట్‌ల సమాచారంతో కూడిన దాదాపు 20 స్క్రీన్‌ షాట్‌లను మోడక్‌ వాట్సాప్‌ ద్వారా అందుకున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రస్ట్‌ల అధికారిక ఖాతాల్లో ఉన్న మొత్తాలను నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు కనుక ఓ పథకం వేశాడు.
  • ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల సాయంతో ఆయా బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న మొత్తాలను స్టాక్‌ బ్రోకర్లకు చెందిన కరెంట్‌ ఖాతాల్లోకి మళ్లించాలనేదే ఆ పథకం.
  • ఈ వ్యవహారంలో సహకరించడానికి, స్టాక్‌ బ్రోకర్లను సమన్వయ పరచడానికి పరిచయస్తుల ద్వారా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌కు చెందిన మామిడి రాజశేఖర్, వారాసిగూడలోని బౌద్ధనగర్‌కు చెందిన జి.లక్ష్మీనారాయణ, నాగోల్‌ బండ్లగూడ వాసి యువీ సుబ్రహ్మణ్యంలను భాగస్వాములుగా చేసుకున్నాడు.
  • ఆ బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయడం ద్వారా వాటిలోని నగదును మళ్లించడానికి పథకం వేసిన మోడక్‌ దానికోసం హ్యాకర్లను సిద్ధం చేసుకున్నాడు. వారికి రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.25 లక్షలు సమీకరించి అడ్వాన్సుగా ఇచ్చాడు. ఇక స్టాక్‌ బ్రోకర్లను వెతికి పట్టుకోవడం, వారితో బేరసారాలు సాగించడం కోసం మోడక్‌ కొందరు అనుచరుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
  • తొలుత వివిధ ప్రాంతాల స్టాక్‌ బ్రోకర్ల ఖాతాలను వాడుకోవాలని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ప్లాన్‌ మార్చి పుణే ప్రాంతానికే చెందిన వారి కోసం ఆరా తీయడం మొదలెట్టారు. దీంతో ఈ విషయం గత వారం పుణే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలిసింది. దీంతో వారే స్టాక్‌ బ్రోకర్ల అవతారం ఎత్తారు. 
  • అనఘా మోడక్‌ను సంప్రదించిన పోలీసు బృందం తాము తమ ఖాతాలను అందించడానికి సిద్ధంగా ఉన్న ట్లు చెప్పింది. అతడు అంగీకరించి తన వద్ద ఉన్న డేటా బయటపెట్టడంతో పాటు తమ వలలో చిక్కడంతో అదుపులోకి తీసుకుంది. అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా గుజరాత్, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ దాడులు నిర్వహించి ముఠా సభ్యుల్ని అరెస్టు చేసింది. పరారైన బ్యాంకు సిబ్బంది కోసం గాలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement