జల్సాలు, విలాసాల కోసం బ్యాంక్‌కు బురిడీ.. ఎంతో తెలుసా? | Bank Loan Fraud Name Of Dummy Company At Hyderabad | Sakshi
Sakshi News home page

జల్సాలు, విలాసాల కోసం బ్యాంక్‌కు బురిడీ.. ఎంతో తెలుసా?

Published Tue, Aug 9 2022 3:01 AM | Last Updated on Tue, Aug 9 2022 3:20 PM

Bank Loan Fraud Name Of Dummy Company At Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డమ్మీ కంపెనీలు.. నకిలీ ఉద్యోగులు... వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు... ఇలా రంగంలోకి దిగిన ఓ ముఠా అందినకాడికి రుణాలు, క్రెడిట్‌ కార్డులు తీసుకుంది. ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ వాయిదాలు చెల్లించకుండా బ్యాంకును నిండా ముంచింది. దీనిపై నాచారం ఠాణాలో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు 60 క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు రికవరీలపై దృష్టి పెట్టడంతో ఒకటి రెండు రోజుల్లో ముఠా అరెస్టు ప్రకటించనున్నారు. ఈ గ్యాంగ్‌ బ్యాంకును రూ.2.5 కోట్ల మేర బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది.  

బ్యాంకుల పని తీరు తెలియడంతో... 
వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులు జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నారు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు, రుణాలు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించారు. నాచారం ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేశారు. వరంగల్‌కు చెందిన పలువురికి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించారు. వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశారు. ఈ ‘ఉద్యోగుల్లో’ కొందరు రైతులు, చిన్న చిన్న దుకాణాల యజమానులు కూడా ఉన్నారు. వీరంతా ఉన్నత విద్య అభ్యసించినట్లు నకిలీ వివరాలు సృష్టించిన ముఠా సభ్యులు వాళ్లను సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఇంజినీర్లుగా, హెచ్‌ఆర్‌ నిర్వాహకులుగా మార్చారు.  

వారి పేర్లతో రుణాలు, కార్డులు... 
వారి వివరాలతో గుర్తింపు కార్డులనూ తయారు చేశారు. ఆపై ఆయా పేర్లతో ఓ బ్యాంకులో శాలరీ అకౌంట్స్‌ తెరిచారు. ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్‌ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్‌ పుస్తకాలను తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకుంటూ గడిపారు. ఇలా రూపొందించిన స్టేట్‌మెంట్స్, బోగస్‌ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని బ్యాంకుల నుంచి క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు పొందారు. కొందరిని మేనేజ్‌ చేయడం ద్వారా ఈ క్రెడిట్‌కార్డ్స్, రుణాలు మంజూరయ్యేలా చేశారు. ఇలా మొత్తం దాదాపు రూ.2.5 కోట్ల మేర స్వాహా చేశారు.  

జల్సాలు, విలాసాలు... 
క్రెడిట్‌ కార్డుల్లో వాడిన మొత్తాలు, వ్యక్తిగత రుణానికి సంబం«ధించిన ఈఎంఐలు చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ బృందం రంగంలోకి దిగింది. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారించింది. ఇలా బ్యాంకు నుంచి కాజేసిన సొమ్ముతో ముఠా సభ్యులు జల్సాలు, విలాసాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: అప్పు కావాలి.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ను నమ్మించి రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement