చేర్యాల చిత్రం
నకాశీ
అనగనగా అంటూ ఒక కథను చెప్పాలన్నా, పల్లె బతుకును హృద్యంగా చిత్రించాలన్నా, పురాణాలను కళ్లకు కట్టేలా చూపెట్టాలన్నా... ఆ చిత్రాలే చెప్పాలి. ఆ బొమ్మలే చూపెట్టాలి... అందుకోసం చేర్యాల వరకు వెళ్లాలి. హైదరాబాద్‌కు 100 కి.మీ. దూరంలో వరంగల్ జిల్లాలో ఉందీ చేర్యాల. స్థానికంగా నకాశీ ఆర్ట్‌గా పేరొందిన ఈ చిత్రకళ ప్రపంచవ్యాప్తంగా చేర్యాల ఆర్ట్‌గా ప్రసిద్ధికెక్కింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శివుడికి కాశీ ఎలాగో.. ఈ నకాశీ కళకు చేర్యాల అలాగ.. అందుకే ప్రపంచమంతా ఈ కళను ఈ ఊరు పేరుతో చేర్యాల ఆర్ట్‌గా పిలుస్తోంది.
నకాశీ కళ గురించి వివరంగా చెప్పాలంటే 400 ఏళ్లు వెనక్కు వెళ్లాలి.. ఇరాన్‌లో పుట్టిన ఈ కళ.. మొఘలాయిలతో పాటు మన దేశంలో అడుగు పెట్టింది. ఉత్తర భారతంలో పెరిగి తెలుగు నేలపై చేర్యాల ఆర్ట్‌గా ఖ్యాతిగాంచింది.
సుమధుర ‘చిత్ర’కావ్యం..
ఏదో ఒక ఇతివృత్తాన్ని వివరించే చిత్రాలు, పురాణ పాత్రల బొమ్మలు.. నకాశీ కళలో ప్రధానమైన అంశాలు. ఒకప్పుడు ఎవరైనా ఇతిహాసాల గురించో, వివిధ కులాల పురాణాలు గురించో ప్రేక్షకులకు చెప్పాలంటే వీటినే ఉపయోగించేవారు. అందుకే ఇదే ఆధారంగా నకాశీ కళ పురుడు పోసుకుంది. రామాయణం నుంచి మహాభారతం వరకు, వీధి బాగోతాల నుంచి కుల పురాణాల వరకు నకాశీ చిత్రాలలో సజీవ దృశ్య కావ్యాలుగా కనిపిస్తుంటాయి.. పాత్రలన్నీ మనముందే కదలాడుతున్నట్లు ఉంటాయి.
చేర్యాలకు చేరువైందిలా...
సుమారు 75 ఏళ్ల కిందట వేములవాడ నుంచి చేర్యాలకు వచ్చి స్థిరపడిన నకాశీ కులస్తుడు దనాల కోట వెంకయ్య ఈ కళకు మెరుగులు దిద్దాడు. తర్వాత ఆయన కుమారుడు వెంకటరమణయ్య అతడి తర్వాత ఆయన వారసులు చంద్రయ్య, వైకుంఠం.. ప్రస్తుతం చంద్రయ్య మనవడు నాగేశ్వర్ ఇలా వారసత్వంగా ఈ కళను కొనసాగిస్తూ వస్తున్నారు.
ప్రకృతే ప్రాణం పోస్తుంది..
నకాశీ కళతో రూపొందిన చిత్రాలు, బొమ్మల్లో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. ప్రకృతిలో దొరికే వస్తువులతోనే అవి ప్రాణం పోసుకుంటాయి. నకాశీ కళలో పునికి చెట్టు కొమ్మ.. బొమ్మగా మారుతుంది. చింతగింజల పేస్టు, సుద్ద ముక్కలు, చెక్కపొడి ఆ బొమ్మకు తుది రూపునిస్తాయి. కిరోసిన్ దీపం నుంచి వచ్చే నలుపు, వాగుల్లో దొరికే గవ్వలను దంచగా వచ్చే తెలుపు, ఇండిగో చెట్ల నుంచి వచ్చే నీలం.. రంగులుగా మారుతాయి..
తయారీ ఇలా ..
రామాయణం, మహాభారతం లాంటి పెద్ద కావ్యాలను కూడా మినియేచర్లుగా నకాశీ కళతో రూపొందించడం గమనార్హం. ఒక్క రామాయణం రూపొందాలంటే ఇద్దరు కనీసం మూడు నెలలు కష్టపడాల్సిందే. ఇక నకాశీ బొమ్మలు, మాస్కులకు కూడా దాదాపు ఇదే పద్ధతిని అవలంబిస్తారు. ఒక్క బొమ్మ రూపుదిద్దుకోవాలంటే కనీసం ఐదురోజులు పడుతుంది. వీటిని కూడా వివిధ సైజుల్లో చేస్తారు.
ఖండాంతరాలు దాటిన ఖ్యాతి
నకాశీ కళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. జపాన్, జర్మనీ, రష్యా తదితర దేశాలలో ఈ కళ గుర్తింపు పొందింది. నకాశీ నిపుణులు ఈ కళ అంతరించకుండా ఉండేందుకు శిక్షణ కూడా ఇస్తున్నారు.
ఆదరణకు నోచుకోక... ఉపాధి లేక..
వీరి కళ ఖండాంతరాలు దాటుతున్నా కడుపు మాత్రం నిండడమే లేదు. కాకతీయులు, నిజాం పాలనలోనూ ప్రోత్సాహం దక్కిన నకాశీ కళకు ఇప్పుడు ప్రభుత్వ ఆదరణ కరువైంది. వీరి ఉత్పత్తులకు మార్కెటింగ్ కూడా దొరకడం లేదు. లేపాక్షి, చెన్నైలోని దక్షిణ చిత్ర సంస్థలు మాత్రమే కాస్తోకూస్తో నకాశీ ఉత్పత్తులను కొంటూ ఆసరాగా నిలుస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 400 ఏళ్ల చరిత్ర ఉన్న నకాశీ కళ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ చేర్యాల ఆర్ట్‌ను ఆదరించ కుంటే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగాంలో ఎవరూ సమాధానం చెప్పలేని ఒక ప్రశ్నగానే మిగిలిపోయే అవకాశం ఉంది. (ఆ ప్రోగ్రాంలో ఈ ప్రశ్న అడిగారు). కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ ప్రాచీన కళను ప్రభుత్వం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
- ప్రవీణ్‌కుమార్ కాసం