Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ.
తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు.
37 ఏళ్ల క్రితం
‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది.
కళ నేర్పిన చదువు
వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది.
నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది.
ఏడాదికి పైగా...
రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు.
దేశమంతా ప్రయాణించాను
ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది.
జంట మాస్క్‌లు
చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది.
కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ.
– నిర్మలారెడ్డి