చిత్రా బెనర్జీ
ఒక పేరుండని అమెరికన్ పట్టణంలో, బేస్‌మెంట్‌లో ఉన్న ఇండియన్ వీసా ఆఫీసు అది. మధ్యాహ్నం మూడు అవుతుంది. ఉన్నట్టుండి భూకంపం వస్తుంది. తొమ్మిదిమంది అక్కడ చిక్కుకుంటారు. ఆఫీసులోకి నీరు రావడం మొదలవుతుంది. ఫోన్లు పని చేయడం మానేస్తాయి.
అక్కడ ఉన్నవారందరూ, భిన్నమైన నేప«థ్యాలు, సంస్కృతులకు చెందినవారు. వారిలో ఉమ సిన్హా కూడా ఉంటుంది.
అమెరికాలో పాతికేళ్ళు ఉండి, స్వస్థలం అయిన కోల్‌కతా తిరిగి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పోరితే, అయిష్టంగానే వీసా కోసం వచ్చిన ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థిని ఉమ. ఆ తొమ్మండుగురిలో, ప్రతీ ఒక్కరూ మిగతావారి ‘రూపురేఖల, కుల/మత భిన్నత్వాల ఆధారంగా’ తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ‘ఈ పట్టణంలో భిన్నమైన జాతులవారు ఒకే చోట యాదృచ్ఛికంగా కలిసి ఉండటం అసాధారణమైనదేమీ కాదు. అయినప్పటికి, ఇదేదో యూఎన్ సమ్మిట్‌లా అనిపిస్తోంది’ అనుకుంటుంది ఉమ.
అందరిలోనూ మొదట గాభరా, ఆ తరువాత స్వార్థం మొదలయినప్పుడు – ‘బతికి ఉండాలంటే ఒకే ఒక్క దారి మితంగా ఉన్న తిండీ, నీరు పంచుకోవడమే’ అంటూ, ఆర్మీలో పని చేసిన ఆఫ్రికన్ అమెరికన్ అయిన ‘కామెరాన్’ ఆ గుంపుకి నాయకత్వం వహిస్తాడు ‘వన్ అమేజింగ్ థింగ్ నవలలో.
తను చదువుతున్న ఛాసర్ రాసిన, ‘కాంటర్బరీ టేల్స్’ పుస్తకం వల్ల ప్రేరణ పొందిన ఉమ అందరికీ సూచిస్తుంది: ‘ప్రతీ ఒక్కరికీ ఏదో కథ ఉండే ఉంటుంది. కనీసం ఒక ‘ఆశ్చర్యకరమైన సంగతి’ అయినా ఎదుర్కోకుండా ఎవరి జీవితమూ సాగదు. మీ మీ కథలు చెప్తే, సమయం గడుస్తుంది. భయమూ తగ్గుతుంది’. మిగిలిన వారు ముందు ప్రతిఘటించినప్పటికీ, కథలు మొదలవుతాయి. ‘ఉమ ఎప్పుడూ అంతే. అపరిచితుల జీవితాలపైన అనవసరమైన ఆసక్తి పెంచుకునే యువతి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, నేలమీదున్న ఇళ్ళని చూసి వాటి నివాసుల బతుకులను ఊహించుకునేది’ అంటారు రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని.
అందరూ తమ ప్రేమ, పెళ్ళి, కుటుంబం గురించిన కథలు చెప్తారు. వారి జీవితాల్లో ఉన్న సిగ్గు పడవలసిన రహస్యాలూ, అంతర్గత సంఘర్షణలూ, అనుభూతులూ బయట పడటం మొదలవుతుంది. గుంపు చేయవలసినదల్లా వాటిని వినడమే.
ఏ ఒక్క కథ మీదా దృష్టి నిలపదు నవల. కథలూ విశేషమైనవి కావు. ఆ గుంపులో ఒకరైన జియాంగ్, ‘మనం పూర్తిగా మారిపోయి ఉండి కూడా దాన్ని గుర్తించకపోవచ్చు. మనం ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాల వల్ల మనం రాయిగా మారామనుకుంటాం. కానీ, మన జీవితాల్లోకి ప్రేమ నెమ్మదిగా ప్రవేశించి, లోలోపలే మనల్ని తునకలుగా చేసే గొడ్డలిగా మారుతుంది’ అన్న మాటలు, మిగతావారి మీద ప్రభావం చూపినప్పుడు, ఆ జీవన్మరణపు పరిస్థితిలో తాము చెప్పిన కథల వల్లే, తమని తాము అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు వారు.
సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారనుకున్న తల్లిదండ్రుల్లో, తండ్రి తనకి ఫోన్ చేసి తల్లికి విడాకులిస్తున్నానని చెప్పాడన్న తన కథను ఉమ చెబుతుంది. కథలు పూర్తయేటప్పటికి రక్షణ దళం వచ్చిందని తెలుస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరి నేపథ్యానికున్న కులం, ప్రాపంచిక దృక్పథం, చర్మపు రంగు కూడా మూలపడతాయి. వారి కథల ద్వారానే ఆ పాత్రలను నిర్వచిస్తారు దివాకరుని. అందరి దృష్టికోణాలకి ప్రామాణికతను ఆపాదిస్తారు. కథలు మనకి సాధికారతనిచ్చి, విముక్తి కలిగించి మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఇస్తాయంటారామె. పుస్తకంలో ఉన్న శైలి స్పష్టమైనది. భాష సరళమైనది. నిర్దిష్టమైన ముగింపేదీ ఉండని ఈ నవలని ‘హేషెట్ బుక్స్’ 2010లో ప్రచురించింది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment