
కిక్-2లో కథానాయికగా?
గాసిప్
కృతీసనన్ ఇప్పుడేం చేస్తున్నారు? తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల తర్వాత ఆమె ఇక్కడి తెరపై కనిపించలేదు. ‘హీరో పంతి’ ద్వారా హిందీ తెరకు పరిచయమైన ఈ బ్యూటీ వరుసగా అక్కడి సినిమాలకు ‘సై’ అంటున్నారు. తొలి చిత్రం తర్వాత చేసినే ‘దిల్‌వాలే’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌లో కృతి సక్సెస్‌ని టేస్ట్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఆమెను ఒక బంపర్ ఆఫర్ వరించిందని సమాచారం. కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే చాన్స్ కొట్టేశారట. గతంలో సల్మాన్ నటించిన ‘కిక్’కి కొనసాగింపుగా ఇప్పుడాయన సీక్వెల్ చేయాలనుకుంటున్నారట.
తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంలో కథానాయికగా అవకాశం వస్తే బాగుంటుందని బాలీవుడ్‌లో కొంతమంది నాయికలు ఆశించారు. కానీ, చివరికి కృతీకి వెళ్లిందని సమాచారం. మరి.. ఈ చిత్రం అయినా కృతీకి సక్సెస్‌పరంగా కిక్ ఇస్తుందా? ఆమె కెరీర్‌కి మంచి బ్రేక్ అవుతుందా?... వేచి చూడాలి. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ కృతి ఈ చిత్రానికి అధికారికంగా సైన్ చేయలేదట. చివరి నిమిషంలో చేజారినా ఆశ్చర్యపోవడానికి లేదు.