‘‘నాట్యం కేవలం కళగా మాత్రమే కనిపిస్తుంది. కానీ అది ఒక మాధ్యమం. నిరంతర ప్రవాహం. నాట్యం మన భారతీయ సంస్కృతికి దర్పణం మాత్రమే కాదు, నాట్యం ద్వారా మనం సోషల్ సైన్స్ నేర్చుకుంటాం. మనిషి వికాసాన్ని ప్రతిబింబించే పాఠాలు ఇందులో ఉన్నాయి’’ అంటోంది నాట్యవేదిక మీదకు రంగ ప్రవేశం చేయబోతున్న పద్దెనిమిదేళ్ల ప్రకృతి ప్రశాంత్.
గుజరాతీ కుటుంబం
ప్రకృతి తండ్రి ప్రశాంత్‌ది నాలుగు తరాల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆమె తల్లి ప్రతీక్షకు భరతనాట్యంలో ప్రవేశం ఉంది. శాస్త్రీయ నాట్యం పట్ల ప్రతీక్షకు ఉన్న ఆసక్తి... ప్రకృతికి కూచిపూడిని పరిచయం చేసింది. కూచిపూడి నాట్యకారిణి యామినీ రెడ్డి శిష్యరికంలో ప్రకృతి కూచిపూడి అడుగులు వేసింది. ఎనిమిదేళ్ల వయసులో మొదలైన నాట్యముద్రలు ఇప్పుడు రంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాయి.
పరిణామ క్రమం
‘‘నాట్యసాధన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ప్రదర్శనలో తొలి అంశం గణేశ ప్రార్థన ఉంటుంది. అంటే... మనం మొదలు పెట్టిన పనికి అంతరాయాలు ఎదురవకుండా సజావుగా సాగేలా చేయమని వినాయకుణ్ని కోరుకోవడం. ఇందులో... మన పని విజయవంతంగా పూర్తి కావాలని మనకు మనం సంకల్పం చెప్పుకోవడం ఉంది. మనల్ని మనం పాజిటివ్‌గా మలుచుకోవడమన్నమాట. ఇక దశావతారాల ప్రదర్శన... ప్రాణి పుట్టుక నుంచి మనిషిగా పరిణామం చెందిన విధానాన్ని చెప్తుంది. ప్రాణి సంచారం మొదట నీటిలో మొదలై తర్వాత నేలమీదకు పాకిన తీరును ప్రతిబింబిస్తుంది. ప్రాణి సంచారం నుంచి క్రమానుగతంగా సాగిన మనిషి వికాసాన్ని తెలియచేస్తుంది. మనిషి ఉపయోగించిన ఉపకరణాల ద్వారా ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా అభివృద్ధి చెందిన వైనం తెలుస్తుంది.
చారిత్రక మీరా
మీరాబాయి పాత్రను అభినయించడం అంటే చరిత్రను చదవడమే. రాజపుత్ర కుటుంబాల నేపథ్యంతోపాటు మొఘలు పాలకులను తెలుసుకుంటాం. ఇంకా... ఆధ్యాత్మికతలో ఇమిడి ఉన్న నవవిధ భక్తి మార్గాల గురించి తెలుస్తుంది. ఇందులో నేను ప్రదర్శిస్తున్న ‘తారణ’ హిందూస్తానీ సంగీతం ఆధారంగా కూర్చిన రూపకం. పండిట్ రవిశంకర్ భరతనాట్యంలో కంపోజ్ చేసిన తారణకు మా గురువు (యామినీరెడ్డి) గారి తల్లిదండ్రులు రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడిలో రూపొందించారు. ఇలాంటి కంపోజిషన్స్‌ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాంతాల మధ్య సమైక్యతను కూడా ఒంటపట్టించుకుంటాం. ప్రాంతాల వారీగా అనేక సాహిత్యాలు నాట్యంలో ఇమిడిపోతాయి. సాహిత్యంలో దాగిన తత్వం అలవడడానికి నాట్యసాధన ఓ మార్గం. 14వ శతాబ్దపు అమిర్ ఖుస్రూ సాహిత్యంలోని సూఫీ తత్వాన్ని ప్రేక్షకులకు చేరవేస్తోంది నాట్యం. సాహిత్యం అక్షరాస్యులకు పండితులకే పరిమితం, పామరులకు, నిరక్షరాస్యులకు చేరే మార్గం నాట్యం. అందుకు ప్రతిరూపమే ‘చాప్ తిలక్’.పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లూ ఎంజాయ్ చేసే ప్రదర్శన ‘తారంగం’. ఈ రూపకాన్ని ఇత్తడి పళ్లెం అంచుల మీద చేస్తాం. నాట్యసాధనతో దేహంలోని నాడీ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. నాట్యం గొప్ప సైన్స్ మాత్రమే కాదు. శారీరకంగానూ, మానసికంగానూ సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సాధనం. ఈ ఆదివారం (జూలై 21) శిల్పకళావేదిక (హైదరాబాద్, హైటెక్ సిటీ)లో రంగప్రవేశం ప్రదర్శన ఇస్తున్నాను. ఇందులో గణేశ ప్రార్థన, దశావతారాలు, మీరా భజన్, తారణ, చాప్ తిలక్, తారంగం ఆరు అంశాలను ప్రదర్శిస్తున్నాను’’ అని వివరించింది ప్రకృతి.
వినయమే భూషణం
మా అమ్మాయి స్కూల్ రోజుల్లో టామ్ బాయ్‌లా ఉండేది. కానీ ఎంతో మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. తనలో నాకు బాగా నచ్చేది ఆ వినయమే. తను ఆటలాడుతున్నప్పుడు ధైర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది, డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ముకుళించుకున్న మొగ్గలా కనిపిస్తుంది. ‘నాట్య తరంగిణి’ డాన్స్‌స్కూల్ ప్రకృతిని సమగ్రంగా తీర్చిదిద్దింది.– ప్రతీక్ష, ప్రకృతి తల్లి
నాట్య నిర్మాణం
ముంబయిలోని కమలా రహేజా విద్యానిధి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో సీటు వచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కి వచ్చి డాన్స్ క్లాసులకు హాజరవుతాను. మా గురువుల కుటుంబమే నాకు స్ఫూర్తి. వారిలాగానే డాన్స్ కోసం జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తయ్యేటప్పటికీ నా ఆలోచనలకు కొత్తరూపు వస్తుంది. ఇంటిని చూడగానే ఇది నాట్యకారుల ఇల్లు అనిపించేలా డిజైన్ చేయగలగాలనేది నా కోరిక.– ప్రకృతి,కూచిపూడి నాట్యకారిణి
ఆలోచనలకు ఆకృతి
ప్రకృతి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నీరజ్ పబ్లిక్‌స్కూల్‌లో చదివింది. టెన్నిస్ బాగా ఆడేది. స్పోర్ట్స్ పర్సన్ అవుతుందనుకున్నారు తల్లిదండ్రులు. స్కూల్‌లో మూడు సబ్జెక్టుల్లో టాపర్‌గా ఉంటూ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా ఉండేది. స్కూల్ హెడ్ గర్ల్ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించింది. చిరక్‌లో ప్లస్‌టూలో 94 శాతం తెచ్చుకుంది. ప్రకృతి కెరీర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ... ‘‘ఈ తరం పిల్లలు తమ కెరీర్‌ని తమకు తామే నిర్ణయించుకోగలుగుతున్నారు. తల్లిదండ్రులమనే హోదాలో అమ్మానాన్నలు తమ ఇష్టాలను పిల్లల మీద రుద్దడం సరికాదు. పైగా ఈ తరం పిల్లలు తల్లిదండ్రులకు అ అవకాశం ఇవ్వడం లేదు కూడా. టెన్త్ క్లాస్ వరకు నేను చూసిన ప్రకృతి వేరు, ప్లస్ వన్, ప్లస్ టూలో నేను చూసిన ప్రకృతి వేరు. ఆ రెండేళ్లలో తన కెరీర్ మీద ప్రకృతికి స్పష్టమైన ఆకృతి వచ్చింది. ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో కూడా డాన్స్ క్లాసులకు వెళ్లేది. డాన్స్ తనకు స్ట్రెస్ బస్టర్‌గా ఉంటుంది. డాన్స్‌కు దూరం కానని చెప్పేసింది. అలాగే డాన్స్ కోసం చదువుకు దూరం కానని కూడా చెప్పింది. ప్లస్ టూ సెలవుల్లో మూడు నెలల పాటు ఢిల్లీలో ఉండి రంగప్రవేశానికి ప్రాక్టీస్ చేసింది. పెద్దల ఆశీర్వాదం కోసం వేదిక మీదకు వస్తోంది. ప్రకృతి మా ఇంట్లో తొలితరం కళాకారిణి’’ అన్నారు ప్రతీక్ష ఉద్వేగంగా.– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment