kuchipudi artist
-
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
కూచిపూడి నాట్య శిఖరం కేశవ ప్రసాద్ కన్నుమూత
మొవ్వ(కూచిపూడి): కూచిపూడి నాట్య శిఖరం, నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ (70) మృతి చెందారు. ప్రసాద్ అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలిని స్థాపించి వేల సంఖ్యలో నాట్య ప్రదర్శనలిచ్చారు. కూచిపూడిలోని కృష్ణా వర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, శ్రీ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి ఆలయ ధర్మకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. మార్చిలో గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలో చికిత్స పొంది తిరిగొచ్చిన ఆయన మే లో కరోనా బారినపడ్డారు. స్థానిక సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కూచిపూడి నాట్య కుటుంబంలో జన్మించిన కేశవ ప్రసాద్ బీఏ (సంస్కృతం) చేశారు. పెడసనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కూచిపూడి నాట్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. చదవండి: మెడి‘కిల్స్’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
ప్రణమ్య సూరీ నాట్య ప్రదర్శన
డల్లాస్ : ప్రముఖ నాట్య కళాకారిణి ప్రనమ్య సూరీ నాట్య ప్రదర్శన డూప్రీ థియోటర్లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్లో ఆదివారం జరిగింది. ‘‘లాస్య గతిక’’ అనే నాట్య రూపకాన్ని ఆమె ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆమె తల్లి, గురువు డా. శ్రీలతా సూరీ హాజరయ్యారు. ప్రణమ్యా సూరి పలు ప్రతిష్టాత్మకమైన వేదికలమీద నాట్యప్రదర్శనలు ఇచ్చారు. వీటిలో నాట్యంజలి డాన్స్ ఫెస్టివల్ (చిదంబరం), దేవదాసి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ (భువనేశ్వర్,) కజురాహో ఫెస్టివల్, కోనార్క్ డాన్స్ ఫెస్టివల్, సుర్ సింగర్ సంసద్ & హరిదాస్ సమ్మెలన్ (ముంబై), వివిద ఐసీసీఆర్ కార్యక్రమాలు ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శించారు. ఢిల్లీ, కటక్, వైజాగ్, మంగ్లోర్, హైదరాబాద్, కుచిపుడి నృత్యోత్సవ్, నాడా నీరజనమ్ (తిరుమల) తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె పలు అవార్డులు అందుకున్నారు. నాట్య విశారద, శృంగార మణి, నలంద నృత్య నిపున, నాట్య సరధి, యువరత్న తదితర ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఈమె ఎకోస్ ఆఫ్ ఇండియా లాంటి పలు ఎన్జీఓ సంస్థలను స్థాపించడమే కాకుండా నృత్య ప్రదర్శన చేస్తు విరాళాలు సేకరిస్తున్నారు. -
అభినయ శిల్పం
‘‘నాట్యం కేవలం కళగా మాత్రమే కనిపిస్తుంది. కానీ అది ఒక మాధ్యమం. నిరంతర ప్రవాహం. నాట్యం మన భారతీయ సంస్కృతికి దర్పణం మాత్రమే కాదు, నాట్యం ద్వారా మనం సోషల్ సైన్స్ నేర్చుకుంటాం. మనిషి వికాసాన్ని ప్రతిబింబించే పాఠాలు ఇందులో ఉన్నాయి’’ అంటోంది నాట్యవేదిక మీదకు రంగ ప్రవేశం చేయబోతున్న పద్దెనిమిదేళ్ల ప్రకృతి ప్రశాంత్. గుజరాతీ కుటుంబం ప్రకృతి తండ్రి ప్రశాంత్‌ది నాలుగు తరాల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆమె తల్లి ప్రతీక్షకు భరతనాట్యంలో ప్రవేశం ఉంది. శాస్త్రీయ నాట్యం పట్ల ప్రతీక్షకు ఉన్న ఆసక్తి... ప్రకృతికి కూచిపూడిని పరిచయం చేసింది. కూచిపూడి నాట్యకారిణి యామినీ రెడ్డి శిష్యరికంలో ప్రకృతి కూచిపూడి అడుగులు వేసింది. ఎనిమిదేళ్ల వయసులో మొదలైన నాట్యముద్రలు ఇప్పుడు రంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాయి. పరిణామ క్రమం ‘‘నాట్యసాధన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ప్రదర్శనలో తొలి అంశం గణేశ ప్రార్థన ఉంటుంది. అంటే... మనం మొదలు పెట్టిన పనికి అంతరాయాలు ఎదురవకుండా సజావుగా సాగేలా చేయమని వినాయకుణ్ని కోరుకోవడం. ఇందులో... మన పని విజయవంతంగా పూర్తి కావాలని మనకు మనం సంకల్పం చెప్పుకోవడం ఉంది. మనల్ని మనం పాజిటివ్‌గా మలుచుకోవడమన్నమాట. ఇక దశావతారాల ప్రదర్శన... ప్రాణి పుట్టుక నుంచి మనిషిగా పరిణామం చెందిన విధానాన్ని చెప్తుంది. ప్రాణి సంచారం మొదట నీటిలో మొదలై తర్వాత నేలమీదకు పాకిన తీరును ప్రతిబింబిస్తుంది. ప్రాణి సంచారం నుంచి క్రమానుగతంగా సాగిన మనిషి వికాసాన్ని తెలియచేస్తుంది. మనిషి ఉపయోగించిన ఉపకరణాల ద్వారా ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా అభివృద్ధి చెందిన వైనం తెలుస్తుంది. చారిత్రక మీరా మీరాబాయి పాత్రను అభినయించడం అంటే చరిత్రను చదవడమే. రాజపుత్ర కుటుంబాల నేపథ్యంతోపాటు మొఘలు పాలకులను తెలుసుకుంటాం. ఇంకా... ఆధ్యాత్మికతలో ఇమిడి ఉన్న నవవిధ భక్తి మార్గాల గురించి తెలుస్తుంది. ఇందులో నేను ప్రదర్శిస్తున్న ‘తారణ’ హిందూస్తానీ సంగీతం ఆధారంగా కూర్చిన రూపకం. పండిట్ రవిశంకర్ భరతనాట్యంలో కంపోజ్ చేసిన తారణకు మా గురువు (యామినీరెడ్డి) గారి తల్లిదండ్రులు రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడిలో రూపొందించారు. ఇలాంటి కంపోజిషన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాంతాల మధ్య సమైక్యతను కూడా ఒంటపట్టించుకుంటాం. ప్రాంతాల వారీగా అనేక సాహిత్యాలు నాట్యంలో ఇమిడిపోతాయి. సాహిత్యంలో దాగిన తత్వం అలవడడానికి నాట్యసాధన ఓ మార్గం. 14వ శతాబ్దపు అమిర్ ఖుస్రూ సాహిత్యంలోని సూఫీ తత్వాన్ని ప్రేక్షకులకు చేరవేస్తోంది నాట్యం. సాహిత్యం అక్షరాస్యులకు పండితులకే పరిమితం, పామరులకు, నిరక్షరాస్యులకు చేరే మార్గం నాట్యం. అందుకు ప్రతిరూపమే ‘చాప్ తిలక్’.పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లూ ఎంజాయ్ చేసే ప్రదర్శన ‘తారంగం’. ఈ రూపకాన్ని ఇత్తడి పళ్లెం అంచుల మీద చేస్తాం. నాట్యసాధనతో దేహంలోని నాడీ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. నాట్యం గొప్ప సైన్స్ మాత్రమే కాదు. శారీరకంగానూ, మానసికంగానూ సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సాధనం. ఈ ఆదివారం (జూలై 21) శిల్పకళావేదిక (హైదరాబాద్, హైటెక్ సిటీ)లో రంగప్రవేశం ప్రదర్శన ఇస్తున్నాను. ఇందులో గణేశ ప్రార్థన, దశావతారాలు, మీరా భజన్, తారణ, చాప్ తిలక్, తారంగం ఆరు అంశాలను ప్రదర్శిస్తున్నాను’’ అని వివరించింది ప్రకృతి. వినయమే భూషణం మా అమ్మాయి స్కూల్ రోజుల్లో టామ్ బాయ్‌లా ఉండేది. కానీ ఎంతో మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. తనలో నాకు బాగా నచ్చేది ఆ వినయమే. తను ఆటలాడుతున్నప్పుడు ధైర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది, డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ముకుళించుకున్న మొగ్గలా కనిపిస్తుంది. ‘నాట్య తరంగిణి’ డాన్స్స్కూల్ ప్రకృతిని సమగ్రంగా తీర్చిదిద్దింది.– ప్రతీక్ష, ప్రకృతి తల్లి నాట్య నిర్మాణం ముంబయిలోని కమలా రహేజా విద్యానిధి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో సీటు వచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కి వచ్చి డాన్స్ క్లాసులకు హాజరవుతాను. మా గురువుల కుటుంబమే నాకు స్ఫూర్తి. వారిలాగానే డాన్స్ కోసం జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తయ్యేటప్పటికీ నా ఆలోచనలకు కొత్తరూపు వస్తుంది. ఇంటిని చూడగానే ఇది నాట్యకారుల ఇల్లు అనిపించేలా డిజైన్ చేయగలగాలనేది నా కోరిక.– ప్రకృతి,కూచిపూడి నాట్యకారిణి ఆలోచనలకు ఆకృతి ప్రకృతి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నీరజ్ పబ్లిక్స్కూల్లో చదివింది. టెన్నిస్ బాగా ఆడేది. స్పోర్ట్స్ పర్సన్ అవుతుందనుకున్నారు తల్లిదండ్రులు. స్కూల్లో మూడు సబ్జెక్టుల్లో టాపర్‌గా ఉంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా ఉండేది. స్కూల్ హెడ్ గర్ల్ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించింది. చిరక్లో ప్లస్‌టూలో 94 శాతం తెచ్చుకుంది. ప్రకృతి కెరీర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ... ‘‘ఈ తరం పిల్లలు తమ కెరీర్‌ని తమకు తామే నిర్ణయించుకోగలుగుతున్నారు. తల్లిదండ్రులమనే హోదాలో అమ్మానాన్నలు తమ ఇష్టాలను పిల్లల మీద రుద్దడం సరికాదు. పైగా ఈ తరం పిల్లలు తల్లిదండ్రులకు అ అవకాశం ఇవ్వడం లేదు కూడా. టెన్త్ క్లాస్ వరకు నేను చూసిన ప్రకృతి వేరు, ప్లస్ వన్, ప్లస్ టూలో నేను చూసిన ప్రకృతి వేరు. ఆ రెండేళ్లలో తన కెరీర్ మీద ప్రకృతికి స్పష్టమైన ఆకృతి వచ్చింది. ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో కూడా డాన్స్ క్లాసులకు వెళ్లేది. డాన్స్ తనకు స్ట్రెస్ బస్టర్‌గా ఉంటుంది. డాన్స్‌కు దూరం కానని చెప్పేసింది. అలాగే డాన్స్ కోసం చదువుకు దూరం కానని కూడా చెప్పింది. ప్లస్ టూ సెలవుల్లో మూడు నెలల పాటు ఢిల్లీలో ఉండి రంగప్రవేశానికి ప్రాక్టీస్ చేసింది. పెద్దల ఆశీర్వాదం కోసం వేదిక మీదకు వస్తోంది. ప్రకృతి మా ఇంట్లో తొలితరం కళాకారిణి’’ అన్నారు ప్రతీక్ష ఉద్వేగంగా.– వాకా మంజులారెడ్డి -
విదేశీ వేదికపై తెలుగు సంస్కృతీ వారధి
సాక్షి,సిటీబ్యూరో: తెలుగు నేలపై విరిసిన ప్రాచీన శాస్త్రీయ సంప్రదాయ నృత్యం కూచిపూడికిఆమె ఉద్యమం కెరటం. భారతీయ నాట్యాల్లో ఒకటై.. మన జీవన ప్రవాహంగా సాగుతున్న ఈ కళను భక్తి ఉద్యమంగా ప్రపంచ వేదికలపై తీసుకెళుతున్నారునగరానికి చెందిన ప్రముఖ నాట్య గురువు దీపికారెడ్డి. ‘దీపాంజలి’ సంస్థను స్థాపించి వందలాది మంది శిష్యులను తీర్చిదిద్ది.. కూచిపూడిని దశదిశలా వ్యాపింప జేస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా నృత్యకళకు ఆమె చేస్తున్న సేవకుగాను కేంద్ర ప్రభుత్వం 2017 సంత్సరానికి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్న ఆమె తన నాట్య ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలుదీపికారెడ్డి మాటల్లోనే.. అక్కినేని మెచ్చుకున్నారు ఆరేళ్ల ప్రాయంలోనే కాళ్లకు గజ్జె కట్టాను. రవీంద్రభారతిలో 1976లో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో తొలి ప్రదర్శన ఇచ్చాను. ఆ ప్రోగ్రాంకు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అంతమంది ప్రముఖుల సమక్షంలో రంగప్రవేశం చేశా. నా నాట్యం చూసి అక్కినేని ‘దీపిక గొప్ప నర్తకి అవుతుంది. నాట్యం పట్ల ఉన్న భక్తి ఆపారమైనది. నిరంతరం కొనసాగించేలా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ మెచ్చుకున్నారు. ఆయన సూచన ఎంత గొప్పదో అర్థమైంది. కొన్నాళ్లకు ఆయన చేతులతోనే ‘స్వర్ణకంకణం’ తొడిగించుకున్నాను. ప్రఖ్యాత నాట్యగురువు సుమతీ కౌశల్ నా తొలి గురువు. తర్వాత చెన్నై వెళ్లి వెంపటి చినసత్యం మాస్టారు వద్ద నాట్యకళను అభ్యసించాను. అదీ నా వివాహమైన తరువాత. ఇక 2004లో దీపాంజలి సంస్థను ప్రారంభించి శిష్యులను తీర్చిదిద్దుతున్నాను. ప్రయోగాలకు శ్రీకారం పౌరాణిక మహిళామూర్తుల్లో ద్రౌపది, మండోదరి, సావిత్రి, కైకేయి వంటి వారి గురించి లోతుగా అధ్యయనం చేశాను. ఆయా పాత్రల స్వభావం, భావోద్వేగాలను ఆకళింపు చేసుకున్నా. ఢిల్లీలో ‘ద్రౌపది’ ప్రదర్శన తర్వాత అక్కడి ప్రేక్షకులు నన్ను ఆ పాత్రతోనే పిలుస్తుంటే జీవితం సార్థకమైందనిపించింది. కూచిపూడిలో ఏ ప్రయోగం చేసినా మూలాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఖజురహో, కోణార్క్, హంపీ, చిదంబరం, మహాబలిపురం, ముద్ర, చాళుక్య వంటి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి నాట్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చా. సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరఫున మాస్కో, ఫ్రాన్స్ అమెరికా, దక్షిణ కొరియా, బ్యాంకాక్ దేశాల్లో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చా. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సింగపూర్–ఇండోనేషియా పర్యటనల్లోను, రాష్ట్రపతి భవన్, ఉగాది రోజున రాజ్‌భన్, ఐఫా అవార్డుల వేడుక వేదికపైనా, ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ వివిధ నృత్యరీతుల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చే అదృష్టం నాకు దక్కింది. గురువుగా బాధ్యతతో వ్యవహరిస్తా అలనాటి నాట్యకారిణి రాధికారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వి.ఆర్.రెడ్డి నా తల్లిదండ్రులు. భర్త శ్యామ్‌గోపాల్ రెడ్డి నన్నెంతో ప్రోత్సహించారు. సామాజిక అంశాలకు సంబంధించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. మాకు అభినవ్, శ్లోక కవల పిల్లలు. అమ్మాయి నాట్యం నేర్చుకుంది. నాతో పాటే దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తోంది. శిక్షణాలయంలో ఓ గురువుగా బాధ్యతతో ఉంటాను. పిల్లలతో స్నేహంగా ఉంటాను. కొంతమందికి నాట్యం నేర్చుకోవాలని ఉన్నా రుసుం చెల్లించలేరు. వారికి ఉచితంగానే నేర్పిస్తాను. నా శిష్యుల్లో పెద్ద, చిన్న, పేద అన్న అంతరం లేకుండా కలిసిపోతారు. నాట్యంతోసామాజిక చైతన్యం నేను నాట్యాలయం ప్రారంభించిన తర్వాతే గురువు గొప్పదనం తెలిసింది. పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు మన దగ్గరుండాలి. అందుకే పురాణ ఇతిహాసాలను బాగా చదవడం మొదలు పెట్టా. మిడిమిడి జ్ఞానంతో ఏ చిన్న పొరపాటు చేసినా అభాసుపాలవుతాం కదా. హస్తకళలు, ప్రకృతి వర్ణాలు, వైద్యులపై రూపొందించిన ‘వైద్యో నారాయణ హరి’ వంటి సామాజిక అంశాలనూ కూచిపూడి నాట్యంలో ప్రదర్శించా. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ఇతర విషయాలతో ‘తెలంగాణ వైభవాన్ని’ ప్రదర్శించా. విదేశీ పర్యాటకుల కోసం ‘దర్శనీయ హైదరాబాద్’ పేరిట రూపొందించి ఇచ్చిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హైదరాబాద్ గొప్పతనం, వైభవంతో పాటు రాష్ట్రానికి సంబంధించి సంక్షిప్త చరిత్రను నాట్యం ద్వారా తెలియజెప్పాను. -
కౌసల్యజ
అచ్చుగుద్దినట్లు పోలికలొస్తే..‘నోట్లోంచి ఊడిపడింది’ అంటారు!అలాగైతే.. ఈ అమ్మాయి.. భావనను‘నడకల్లోంచి ఊడిపడింది’ అనాలి.అమ్మ నేర్పిన నడకలు... అమ్మను చూసి నేర్చుకున్న నడకలు!కూచిపూడిలో గొప్ప డాన్సర్... భావన. అంతకన్నా గొప్ప.. కౌసల్య కూతురిగా ‘కౌసల్యజ’ అనే భావన! ‘‘నడక, నాట్యం రెండూ ఒకేసారి నేర్చుకున్నాను’’ అన్నారు భావనారెడ్డి. నాట్యం ఆమెకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందనిపిస్తుంది. కానీ భావన మాత్రం అమ్మానాన్నల జన్యువుల్లోంచే వచ్చిందంటారు. ‘‘ఫలానా వయసులో నాట్యసాధన మొదలు పెట్టాను... అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే... నడకతోపాటే నాట్యం కూడా అలవడింది. నడక రాకముందు నుంచే నాట్యాన్ని చూస్తున్నాను. మా ఇంట్లో రోజూ నాట్యసాధన జరుగుతుండేది. ఇంటి వెనుక వైపు విశాల స్థలంలో డాన్స్ క్లాసులు జరుగుతుండేవి’’ అని చెప్పారు. నాలుగున్నర ఏళ్లకు తొలి ప్రదర్శన ఇచ్చిన భావన ఖజురహో, కోణార్క్, కాళిదాస సమరోహ్లలో జరిగే డాన్స్ ఫెస్టివల్స్‌లో కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చారు. ఢాకాలో జరిగిన బెంగాల్ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్, లండన్‌లోని సాడ్లర్స్ వెల్స్ ఫెస్టివల్స్తోపాటు అమెరికా, కెనడా, యూరప్, యునైటెడ్ ఎమిరేట్స్, ఆసియా ఖండాల్లో విస్తృతంగా పర్యటించి లెక్కకు మించిన ప్రదర్శనలిచ్చారు. ప్రధానమంత్రులు, వేల్స్ యువరాజుతోపాటు అనేకమంది విదేశీ ప్రముఖుల సమక్షంలో మన తెలుగు కళను ప్రదర్శించి మెప్పు పొందారు. ఇవన్నీ మూడు పదుల లోపే. విదేశాల్లో యంగ్ఉమన్ అచీవర్స్ అవార్డు, నార్త్ పవర్‌లిస్ట్ అవార్డు, టెక్సాస్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నుంచి లైఫ్‌టైమ్ అవార్డులు అందుకున్నారు. అన్నింటికంటే తనకు మనదేశంలో సంగీత నాటక అకాడమీ నుంచి అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన ‘బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2017’ అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారామె. న్యూయార్క్, న్యూ ఢిల్లీలో ప్రదర్శనల తర్వాత కొంత విరామం తీసుకుని అమ్మమ్మను చూడటానికి ఆదిలాబాద్‌కి వెళ్లారామె. ఆదిలాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తూ సోమవారం రోజు హైదరాబాద్‌లో అక్క యామిని దగ్గర ఆగారు. ఆ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. టీనేజ్‌కి వచ్చాకే స్టేజ్ ఫియర్! భావన ప్రఖ్యాత కూచిపూడి నాట్యకారులు పద్మభూషణ్ రాజారెడ్డి, కౌసల్య (రాధారెడ్డి చెల్లెలు)ల పుత్రిక. నడకలో అడుగులు, నాట్యపు అడుగుల మధ్య తేడా తెలియని వయసులోనే వేదికనెక్కడంతో స్టేజ్ ఫియర్ అనేది తెలియనే లేదామెకి. ఇంట్లో జరిగే డాన్సు క్లాసుకి, వేదిక మీద ప్రదర్శనకి మధ్య తేడా తెలియని వయసది. అయితే బాల్యంలో లేని స్టేజి ఫియర్ టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత ఆవరించింది. నలుగురి ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏదో తెలియని సిగ్గు కలవరపెట్టేది. దానిని అధిగమించి ప్రదర్శన ఇవ్వడానికి తనకు తానే ధైర్యం చెప్పుకునేదాన్నంటారామె. స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత ప్రేక్షకులు చూస్తున్నారనే భావనను అదిమిపెట్టి తాను ప్రదర్శిస్తున్న పాత్ర మీదనే మనసు లగ్నం చేసేదాన్నని, క్రమంగా వయసు పరిణతితో అధిగమించగలిగానని చెప్పారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బి.కామ్. ఆనర్స్ చదివిన భావన.. నాట్య ప్రదర్శనల కోసం తరచూ విదేశాలకు వెళ్లొస్తుంటారు. ఒకే ఒక ఉత్తరం ‘‘ఏడేళ్ల వయసులో అమ్మతోపాటు పెర్ఫార్మ్ చేశాను. అమ్మ కౌసల్య... రాముడి తల్లి కౌసల్య పాత్ర చేస్తోంది, నేను రాముడి పాత్ర చేశాను. వేదిక మీద తల్లి పాత్రలో సొంత తల్లితో నాట్యం చేయడం మరచిపోలేని అనుభూతి. ఆ ప్రదర్శన పూనాలో జరిగింది. ఆ ప్రదర్శనలో నా నాట్యాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీలో మా ఇంటికి నా పేరుతో ఉత్తరం వచ్చింది. నాకు వచ్చిన ఒకే ఒక్క ఫాన్మెయిల్ అది. అమ్మ పాత్రలో అమ్మతో కలిసి చేయడం ఒక సంతోషమైతే, అదే పెర్ఫార్మెన్స్కి నా పేరుతో ఉత్తరం రావడం తీపి జ్ఞాపకం. ఇంకా బాగా చేయాల్సింది కృష్ణుడి పాత్రలో నటించడం చాలా ఇష్టం. అప్పుడే టీనేజ్‌లో కొచ్చాను. వారణాసిలో కాళీయమర్దన రూపకాన్ని ప్రదర్శించాను. యశోద పాత్రను అమ్మ ప్రదర్శించింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలే వచ్చాయి, నిపుణుల నుంచి కూడా ఎటువంటి విమర్శలూ రాలేదు, కానీ నాకే ఎందుకో ‘ఇంకా బాగా చేయాల్సింది’ అని పదే పదే అనిపించింది. కృష్ణుడిగా ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉండింది. పూర్తిగా న్యాయం చేయలేకపోయానేమోనని ఏడ్చాను. నాకు కృష్ణుడి మీదున్న ఇష్టం వల్లే అలా అనిపించిందో ఏమో కానీ ఆ ప్రదర్శన ఇప్పటికీ గుర్తు ఉంది. బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన ఏదని ఎవరడిగినా సరే, నాకు అసంతృప్తిని మిగిల్చిన ఆ ప్రదర్శనే మనసులో మెదలుతుంది. అమ్మానాన్నలేమో ‘నీకు బాగా చేయలేదనిపిస్తే... బాగా చేస్తున్నాను అనే తృప్తి కలిగే వరకు ప్రాక్టీస్ చేయడమే పరిష్కారం. మన పెర్ఫార్మెన్స్ మీద మనకు సంతృప్తి కలిగితేనే ప్రేక్షకులను సమాధానపరచగలుగుతాం. అదే గీటురాయి’ అన్నారు. విరామమన్నదే లేదు రోజూ ఒక గంట యోగా, రెండు గంటలు డ్యాన్స్, ఓ గంట కీళ్ల పటుత్వాన్ని పెంచే ఎక్సర్సైజ్ చేస్తాను. ఆహార నియమాలు పెద్దగా పాటించను. నేను మంచి భోజన ప్రియురాలిని. డ్యాన్స్ చేస్తాను కాబట్టి కేలరీలు ఎప్పటికప్పుడు బర్న్ అయిపోతుంటాయి. ఇన్నేళ్లలో డ్యాన్స్‌కి ఒక్క వారం కూడా విరామం రాలేదు. మూడు రోజులు దాటితే కాళ్లుచేతులు లాగినట్లవుతాయి’’ అంటూ తన చేతి వేళ్లతో నాట్య ముద్రలను చూపిస్తూ నవ్వారు భావన. పాడటం... ఆడటం హాబీ కూచిపూడి నాట్యం నా జీవితంలో భాగమైపోయిందనడం తప్పు, అదే నాకు జీవితం. పాటలు పాడటం, బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం. సినిమాలు బాగా చూస్తాను. ఇంగ్లిష్ పాటలు, కర్ణాటక సంగీతంలో పాడాను.హాలీవుడ్ సినిమాల్లో పాడటం, ఇంగ్లిష్ పాటలకు కూచిపూడి నాట్యంలో కొరియోగ్రఫీ చేయడం హాబీగానే చేశాను. ప్రొఫెషన్‌గా తీసుకోవడం లేదు. కూచిపూడి నాట్యానికి ఇప్పటి తరం కనెక్ట్ అయ్యేటట్లు భామాకలాపం రూపకాన్ని చేశాను. ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేయాలని ఉంది. అందుకు నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నాన్న, అమ్మల దగ్గర నేర్చుకున్న జ్ఞానమే. ఇంకా శాస్త్రీయంగా నేర్చుకోవడానికి కూచిపూడి గ్రామంలోని కూచిపూడి యూనివర్సిటీలో డ్యాన్స్ కోర్సు చేయాలనుకుంటున్నాను. – భావనారెడ్డి, కూచిపూడి కళాకారిణి – వాకా మంజులారెడ్డి -
తెలుగు తేజం మానస
ఆమె అడుగులు నటరాజకు నాట్యాభిషేకం చేస్తాయి.ఆమె పాద మంజీరాలు భరతముని నాట్యాశాస్త్రానికి చిరునామాగామారుతాయి. ఆమె ప్రదర్శించే అంశాలు భారతీయ నృత్య సంప్రదాయ విలువలను చాటుతాయి. ఆమె ప్రముఖ నాట్య కళాకారిణి అచ్యుత మానస, నగరానికి చెందిన అచ్యుత మానస ఈ నెల 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు గ్రీసులోని ప్రపంచ ప్రఖ్యాత ఎథెన్స్ ప్రాంతంలో 51 అంతర్జాతీయ వేదికమీద కూచిపూడి నాట్యంలోని తరంగం అంశంగా ప్రదర్శన(అంతర్జాతీయ డాన్స్ కౌన్సిల్) ఇవ్వటానికి వెళుతున్నసందర్భంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. విజయవాడ కల్చరల్: 25 సంవత్సరాల నాట్యప్రస్ధానం, ఆరేళ్ల వయస్సులోనే నృత్యంలో శిక్షణ ప్రారంభం, తల్లి రాజ్యలక్ష్మి తండ్రి రవిచంద్ర(పోలీస్ ఉన్నతాధికారి)ప్రేరణతో నాట్యరంలోకి ప్రవేశించిన అచ్యుత మానస నాట్యాచార్యులు కాజ వెంకటసుబ్రహ్మమణ్యం పర్యవేక్షణలో కూచిపూడి, భరతనాట్యం, కథక్ అంశాలను అలవొకగా ప్రదర్శంచగల తెలుగు తల్లి ముద్దుబిడ్డ అచ్యుత మానస. నాట్యమేకాదు, అటు చిత్రలేఖనం, సంగీతం, యోగాలో విశేష ప్రతిభ కనపరుస్తున్న అచ్యుత మానస దేశవిదేశాలలో 1200పైగా ప్రదర్శనలు ఇచ్చింది. పురస్కారాలు యునెస్కో బెస్ట్ కల్చరల్ అంబాసిడర్‌గా ఎంపిక, 2016లో నాట్యరంలో ఉగాది పురస్కారం, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు, కళాసరస్వతి, నాట్యమయూరి, నాట్యకళామయి బిరుతులతో సత్కరించాయి. ఉచిత శిక్షణ కూచిపూడి మై లైఫ్ పేరుతో దిగువ తరగతికి వారికి నాట్యంలో శిక్షణ ఇచ్చివారిని అంతర్జాతీయ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కొత్తగా కూచిపూడి నాట్య కళాక్షేత్ర అనే నృత్య అకాడమీని స్థాపించారు. ఔత్సాహికుల కోసం సీడీల నిర్మాణం భావితరాలకు భారతీయ నృత్య సంప్రదాయమైన కూచిపూడిని అందించటానికి కూచిపూడి నాట్యాభినయ వేదం మోక్షం అనే సీడీని తయారుచేసి జీయర్ స్వామి, దర్శకుడు విశ్వనా«థ్, విశ్వంజీ చేతులమీదుగా ఆవిష్కరించి దాని ద్వారా వచ్చిన సొమ్మును మై లైఫ్ పేరుతో శిక్షణ తీసుకొనే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు ప్రతినిధిగా.. జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఎథెన్స్(అంతర్జాతీయ స్టేడియం)లో 51వ అంతర్జాతీయ డాన్స్ రెసెర్చి సంస్థ 50 దేశాల ప్రతినిధులతో సమ్మేళనం నిర్వహిస్తోంది. అదే వేదిక మీద అచ్యుత మానస భారతదేశ ప్రతినిధిగా కూచిపూడి అంశంగా ప్రసంగించనున్నది. జీవితాశయం ఉన్నత విలువలుగల భారతీయ మహిళాగా ఎదగాలని, భారతీయ నృత్యసంప్రదాయ రీతులు ప్రపంచమంతా పాకాలని, అతి పేద వారికి కూడా సంప్రదాయ నృత్యరీతులను నేర్పించి భావితరాలకు ఉన్నత విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశయమని ఆమె వివరించారు. -
లండన్‌లో కేతనశర్మ నృత్యప్రదర్శన
ఒంగోలు కల్చరల్: స్థానిక సాయిబాబా సెంట్రల్ స్కూలులో 8వ తరగతి చదువుతున్న వ్యామజాల కేతన్ శర్మ సోమవారం న్యూలండన్‌లోని మహాలక్ష్మి ఆలయంలో కూచిపూడి నృత్యనర్తన చేశాడు. ఎస్బీఐ, సిగ్నల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రముఖ కూచిపూడి నృత్యశిక్షకురాలు, శ్రీనళినీప్రియ కూచిపూడి నృత్యనికేతన్ ప్రిన్సిపాల్ ఎస్.వి. శివకుమారి, వ్యామజాల శ్రీనివాసరావుల కుమారుడైన కేతన్ శర్మ కూచిపూడి నృత్యంలోని క్లిష్టమైన అంశాలను సైతం ప్రదర్శించి నిర్వాహకుల అభినందనలకు పాత్రుడైనాడు. నిర్వాహకులు కేతన్ శర్మతోపాటు ఆతడి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఎస్బీఐ లండన్ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరావు, ఇండియా ఎంబసీ ప్రతినిధులతోపాటు సరస్వతీబొట్ల వెంకట శేషయ్య, హైమావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు భాను శిష్ట్ల, ప్రభాకర్, కాజా , ఎస్బీఐ, షహనాజ్ ప్రతినిధులకు కేతన్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. -
రష్యా కళాకారిణి బ్యాగ్ మాయం
గచ్చిబౌలి: రష్యాకు చెందిన కూచిపూడి కళాకారిణి బ్యాగ్ మాయమైంది. నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రష్యాకు చెందిన అలీఫా కుచ్తోవా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వచ్చారు. బ్యాగ్‌ను స్టేడియంలోని మేకప్ రూమ్‌లో పెట్టి నాట్యం చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30కి వేదికపైకి వెళ్లారు. నాట్య ప్రదర్శన ముగించుకొని మేకప్ రూమ్‌కి వెళ్లి చూడగా బ్యాగ్ కనిపించ లేదు. బ్యాగులో పాస్పోర్టుతో పాటు డబ్బులు, పలు గుర్తింపు కార్డులున్నాయని బాధితురాలు తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కన్నీరుపెట్టుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.