దీపికారెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: తెలుగు నేలపై విరిసిన ప్రాచీన శాస్త్రీయ సంప్రదాయ నృత్యం కూచిపూడికిఆమె ఉద్యమం కెరటం. భారతీయ నాట్యాల్లో ఒకటై.. మన జీవన ప్రవాహంగా సాగుతున్న ఈ కళను భక్తి ఉద్యమంగా ప్రపంచ వేదికలపై తీసుకెళుతున్నారునగరానికి చెందిన ప్రముఖ నాట్య గురువు దీపికారెడ్డి. ‘దీపాంజలి’ సంస్థను స్థాపించి వందలాది మంది శిష్యులను తీర్చిదిద్ది.. కూచిపూడిని దశదిశలా వ్యాపింప జేస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా నృత్యకళకు ఆమె చేస్తున్న సేవకుగాను కేంద్ర ప్రభుత్వం 2017 సంత్సరానికి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్న ఆమె తన నాట్య ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలుదీపికారెడ్డి మాటల్లోనే..
అక్కినేని మెచ్చుకున్నారు
ఆరేళ్ల ప్రాయంలోనే కాళ్లకు గజ్జె కట్టాను. రవీంద్రభారతిలో 1976లో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో తొలి ప్రదర్శన ఇచ్చాను. ఆ ప్రోగ్రాంకు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అంతమంది ప్రముఖుల సమక్షంలో రంగప్రవేశం చేశా. నా నాట్యం చూసి అక్కినేని ‘దీపిక గొప్ప నర్తకి అవుతుంది. నాట్యం పట్ల ఉన్న భక్తి ఆపారమైనది. నిరంతరం కొనసాగించేలా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ మెచ్చుకున్నారు. ఆయన సూచన ఎంత గొప్పదో అర్థమైంది. కొన్నాళ్లకు ఆయన చేతులతోనే ‘స్వర్ణకంకణం’ తొడిగించుకున్నాను. ప్రఖ్యాత నాట్యగురువు సుమతీ కౌశల్ నా తొలి గురువు. తర్వాత చెన్నై వెళ్లి వెంపటి చినసత్యం మాస్టారు వద్ద నాట్యకళను అభ్యసించాను. అదీ నా వివాహమైన తరువాత. ఇక 2004లో దీపాంజలి సంస్థను ప్రారంభించి శిష్యులను తీర్చిదిద్దుతున్నాను.
ప్రయోగాలకు శ్రీకారం
పౌరాణిక మహిళామూర్తుల్లో ద్రౌపది, మండోదరి, సావిత్రి, కైకేయి వంటి వారి గురించి లోతుగా అధ్యయనం చేశాను. ఆయా పాత్రల స్వభావం, భావోద్వేగాలను ఆకళింపు చేసుకున్నా. ఢిల్లీలో ‘ద్రౌపది’ ప్రదర్శన తర్వాత అక్కడి ప్రేక్షకులు నన్ను ఆ పాత్రతోనే పిలుస్తుంటే జీవితం సార్థకమైందనిపించింది. కూచిపూడిలో ఏ ప్రయోగం చేసినా మూలాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఖజురహో, కోణార్క్, హంపీ, చిదంబరం, మహాబలిపురం, ముద్ర, చాళుక్య వంటి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి నాట్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చా. సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరఫున మాస్కో, ఫ్రాన్స్ అమెరికా, దక్షిణ కొరియా, బ్యాంకాక్ దేశాల్లో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చా. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సింగపూర్–ఇండోనేషియా పర్యటనల్లోను, రాష్ట్రపతి భవన్, ఉగాది రోజున రాజ్‌భన్, ఐఫా అవార్డుల వేడుక వేదికపైనా, ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ వివిధ నృత్యరీతుల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చే అదృష్టం నాకు దక్కింది.
గురువుగా బాధ్యతతో వ్యవహరిస్తా
అలనాటి నాట్యకారిణి రాధికారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వి.ఆర్.రెడ్డి నా తల్లిదండ్రులు. భర్త శ్యామ్‌గోపాల్ రెడ్డి నన్నెంతో ప్రోత్సహించారు. సామాజిక అంశాలకు సంబంధించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. మాకు అభినవ్, శ్లోక కవల పిల్లలు. అమ్మాయి నాట్యం నేర్చుకుంది. నాతో పాటే దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తోంది. శిక్షణాలయంలో ఓ గురువుగా బాధ్యతతో ఉంటాను. పిల్లలతో స్నేహంగా ఉంటాను. కొంతమందికి నాట్యం నేర్చుకోవాలని ఉన్నా రుసుం చెల్లించలేరు. వారికి ఉచితంగానే నేర్పిస్తాను. నా శిష్యుల్లో పెద్ద, చిన్న, పేద అన్న అంతరం లేకుండా కలిసిపోతారు.
నాట్యంతోసామాజిక చైతన్యం
నేను నాట్యాలయం ప్రారంభించిన తర్వాతే గురువు గొప్పదనం తెలిసింది. పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు మన దగ్గరుండాలి. అందుకే పురాణ ఇతిహాసాలను బాగా చదవడం మొదలు పెట్టా. మిడిమిడి జ్ఞానంతో ఏ చిన్న పొరపాటు చేసినా అభాసుపాలవుతాం కదా. హస్తకళలు, ప్రకృతి వర్ణాలు, వైద్యులపై రూపొందించిన ‘వైద్యో నారాయణ హరి’ వంటి సామాజిక అంశాలనూ కూచిపూడి నాట్యంలో ప్రదర్శించా. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ఇతర విషయాలతో ‘తెలంగాణ వైభవాన్ని’ ప్రదర్శించా. విదేశీ పర్యాటకుల కోసం ‘దర్శనీయ హైదరాబాద్’ పేరిట రూపొందించి ఇచ్చిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హైదరాబాద్ గొప్పతనం, వైభవంతో పాటు రాష్ట్రానికి సంబంధించి సంక్షిప్త చరిత్రను నాట్యం ద్వారా తెలియజెప్పాను.
Comments
Please login to add a commentAdd a comment