కౌసల్యజ | Kuchipudi artists Rajaradevi - Kausalya daughter bhavana | Sakshi
Sakshi News home page

కౌసల్యజ

Published Wed, Sep 12 2018 12:05 AM | Last Updated on Wed, Sep 12 2018 12:05 AM

Kuchipudi artists Rajaradevi - Kausalya daughter bhavana - Sakshi

కూచిపూడి కళాకారులు రాజారెడ్డి – కౌసల్యల కుమార్తె భావన

అచ్చుగుద్దినట్లు పోలికలొస్తే..‘నోట్లోంచి ఊడిపడింది’ అంటారు!అలాగైతే.. ఈ అమ్మాయి.. భావనను‘నడకల్లోంచి ఊడిపడింది’ అనాలి.అమ్మ నేర్పిన నడకలు... అమ్మను చూసి నేర్చుకున్న నడకలు!కూచిపూడిలో గొప్ప డాన్సర్‌... భావన. అంతకన్నా గొప్ప.. కౌసల్య కూతురిగా ‘కౌసల్యజ’ అనే భావన!

‘‘నడక, నాట్యం రెండూ ఒకేసారి నేర్చుకున్నాను’’ అన్నారు భావనారెడ్డి. నాట్యం ఆమెకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందనిపిస్తుంది. కానీ భావన మాత్రం అమ్మానాన్నల జన్యువుల్లోంచే వచ్చిందంటారు. ‘‘ఫలానా వయసులో నాట్యసాధన మొదలు పెట్టాను... అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే... నడకతోపాటే నాట్యం కూడా అలవడింది. నడక రాకముందు నుంచే నాట్యాన్ని చూస్తున్నాను. మా ఇంట్లో రోజూ నాట్యసాధన జరుగుతుండేది. ఇంటి వెనుక వైపు విశాల స్థలంలో డాన్స్‌ క్లాసులు జరుగుతుండేవి’’ అని చెప్పారు. నాలుగున్నర ఏళ్లకు తొలి ప్రదర్శన ఇచ్చిన భావన ఖజురహో, కోణార్క్, కాళిదాస సమరోహ్‌లలో జరిగే డాన్స్‌ ఫెస్టివల్స్‌లో కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చారు. ఢాకాలో జరిగిన బెంగాల్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్, లండన్‌లోని సాడ్లర్స్‌ వెల్స్‌ ఫెస్టివల్స్‌తోపాటు అమెరికా, కెనడా, యూరప్, యునైటెడ్‌ ఎమిరేట్స్, ఆసియా ఖండాల్లో విస్తృతంగా పర్యటించి లెక్కకు మించిన ప్రదర్శనలిచ్చారు. ప్రధానమంత్రులు, వేల్స్‌ యువరాజుతోపాటు అనేకమంది విదేశీ ప్రముఖుల సమక్షంలో మన తెలుగు కళను ప్రదర్శించి మెప్పు పొందారు. ఇవన్నీ మూడు పదుల లోపే. విదేశాల్లో యంగ్‌ఉమన్‌ అచీవర్స్‌ అవార్డు, నార్త్‌ పవర్‌లిస్ట్‌ అవార్డు, టెక్సాస్‌ తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ నుంచి లైఫ్‌టైమ్‌ అవార్డులు అందుకున్నారు. అన్నింటికంటే తనకు మనదేశంలో సంగీత నాటక అకాడమీ నుంచి అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన ‘బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ 2017’ అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారామె. న్యూయార్క్, న్యూ ఢిల్లీలో ప్రదర్శనల తర్వాత కొంత విరామం తీసుకుని అమ్మమ్మను చూడటానికి ఆదిలాబాద్‌కి వెళ్లారామె. ఆదిలాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తూ సోమవారం రోజు హైదరాబాద్‌లో అక్క యామిని దగ్గర ఆగారు. ఆ సందర్భంగా సాక్షితో మాట్లాడారు.

టీనేజ్‌కి వచ్చాకే స్టేజ్‌ ఫియర్‌!
భావన ప్రఖ్యాత కూచిపూడి నాట్యకారులు పద్మభూషణ్‌ రాజారెడ్డి, కౌసల్య (రాధారెడ్డి చెల్లెలు)ల పుత్రిక. నడకలో అడుగులు, నాట్యపు అడుగుల మధ్య తేడా తెలియని వయసులోనే వేదికనెక్కడంతో స్టేజ్‌ ఫియర్‌ అనేది తెలియనే లేదామెకి. ఇంట్లో జరిగే డాన్సు క్లాసుకి, వేదిక మీద ప్రదర్శనకి మధ్య తేడా తెలియని వయసది. అయితే బాల్యంలో లేని స్టేజి ఫియర్‌ టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత ఆవరించింది. నలుగురి ముందు ప్రాక్టీస్‌ చేసేటప్పుడు కూడా ఏదో తెలియని సిగ్గు కలవరపెట్టేది. దానిని అధిగమించి ప్రదర్శన ఇవ్వడానికి తనకు తానే ధైర్యం చెప్పుకునేదాన్నంటారామె. స్టేజ్‌ మీదకు వెళ్లిన తర్వాత ప్రేక్షకులు చూస్తున్నారనే భావనను అదిమిపెట్టి తాను ప్రదర్శిస్తున్న పాత్ర మీదనే మనసు లగ్నం చేసేదాన్నని, క్రమంగా వయసు పరిణతితో అధిగమించగలిగానని చెప్పారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో బి.కామ్‌. ఆనర్స్‌ చదివిన భావన.. నాట్య ప్రదర్శనల కోసం తరచూ విదేశాలకు వెళ్లొస్తుంటారు. 

ఒకే ఒక ఉత్తరం
‘‘ఏడేళ్ల వయసులో అమ్మతోపాటు పెర్ఫార్మ్‌ చేశాను. అమ్మ కౌసల్య... రాముడి తల్లి కౌసల్య పాత్ర చేస్తోంది, నేను రాముడి పాత్ర చేశాను. వేదిక మీద తల్లి పాత్రలో సొంత తల్లితో నాట్యం చేయడం మరచిపోలేని అనుభూతి. ఆ ప్రదర్శన పూనాలో జరిగింది. ఆ ప్రదర్శనలో నా నాట్యాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీలో మా ఇంటికి నా పేరుతో ఉత్తరం వచ్చింది. నాకు వచ్చిన ఒకే ఒక్క ఫాన్‌మెయిల్‌ అది. అమ్మ పాత్రలో అమ్మతో కలిసి చేయడం ఒక సంతోషమైతే, అదే పెర్ఫార్మెన్స్‌కి నా పేరుతో ఉత్తరం రావడం తీపి జ్ఞాపకం.

ఇంకా బాగా చేయాల్సింది
కృష్ణుడి పాత్రలో నటించడం చాలా ఇష్టం. అప్పుడే టీనేజ్‌లో కొచ్చాను. వారణాసిలో కాళీయమర్దన రూపకాన్ని ప్రదర్శించాను. యశోద పాత్రను అమ్మ ప్రదర్శించింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలే వచ్చాయి,  నిపుణుల నుంచి కూడా ఎటువంటి విమర్శలూ రాలేదు, కానీ నాకే ఎందుకో ‘ఇంకా బాగా చేయాల్సింది’ అని పదే పదే అనిపించింది. కృష్ణుడిగా ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉండింది. పూర్తిగా న్యాయం చేయలేకపోయానేమోనని ఏడ్చాను. నాకు కృష్ణుడి మీదున్న ఇష్టం వల్లే అలా అనిపించిందో ఏమో కానీ ఆ ప్రదర్శన ఇప్పటికీ గుర్తు ఉంది. బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన ఏదని ఎవరడిగినా సరే, నాకు అసంతృప్తిని మిగిల్చిన ఆ ప్రదర్శనే మనసులో మెదలుతుంది. అమ్మానాన్నలేమో ‘నీకు బాగా చేయలేదనిపిస్తే... బాగా చేస్తున్నాను అనే తృప్తి కలిగే వరకు ప్రాక్టీస్‌ చేయడమే పరిష్కారం. మన పెర్ఫార్మెన్స్‌ మీద మనకు సంతృప్తి కలిగితేనే ప్రేక్షకులను సమాధానపరచగలుగుతాం. అదే గీటురాయి’ అన్నారు.

విరామమన్నదే లేదు
రోజూ ఒక గంట యోగా, రెండు గంటలు డ్యాన్స్, ఓ గంట కీళ్ల పటుత్వాన్ని పెంచే ఎక్సర్‌సైజ్‌ చేస్తాను. ఆహార నియమాలు పెద్దగా పాటించను. నేను మంచి భోజన ప్రియురాలిని. డ్యాన్స్‌ చేస్తాను కాబట్టి కేలరీలు ఎప్పటికప్పుడు బర్న్‌ అయిపోతుంటాయి. ఇన్నేళ్లలో డ్యాన్స్‌కి ఒక్క వారం కూడా విరామం రాలేదు. మూడు రోజులు దాటితే కాళ్లుచేతులు లాగినట్లవుతాయి’’ అంటూ తన చేతి వేళ్లతో నాట్య ముద్రలను చూపిస్తూ నవ్వారు భావన.

పాడటం... ఆడటం హాబీ
కూచిపూడి నాట్యం నా జీవితంలో భాగమైపోయిందనడం తప్పు, అదే నాకు జీవితం. పాటలు పాడటం, బ్యాడ్మింటన్‌ ఆడటం ఇష్టం. సినిమాలు బాగా చూస్తాను. ఇంగ్లిష్‌ పాటలు, కర్ణాటక సంగీతంలో పాడాను.హాలీవుడ్‌ సినిమాల్లో పాడటం, ఇంగ్లిష్‌ పాటలకు కూచిపూడి నాట్యంలో కొరియోగ్రఫీ చేయడం హాబీగానే చేశాను.  ప్రొఫెషన్‌గా తీసుకోవడం లేదు. కూచిపూడి నాట్యానికి ఇప్పటి తరం కనెక్ట్‌ అయ్యేటట్లు భామాకలాపం రూపకాన్ని చేశాను. ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేయాలని ఉంది. అందుకు నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నాన్న, అమ్మల దగ్గర నేర్చుకున్న జ్ఞానమే. ఇంకా శాస్త్రీయంగా నేర్చుకోవడానికి కూచిపూడి గ్రామంలోని కూచిపూడి యూనివర్సిటీలో డ్యాన్స్‌ కోర్సు చేయాలనుకుంటున్నాను. 
– భావనారెడ్డి, కూచిపూడి కళాకారిణి
– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement