కురుపితామహుడి దేవాలయం | Kurupitamahudi Temple | Sakshi
Sakshi News home page

కురుపితామహుడి దేవాలయం

Published Tue, Feb 7 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

కురుపితామహుడి దేవాలయం

కురుపితామహుడి దేవాలయం

భీష్ముడు... మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణాన్ని పొందిన కురు పితామహుడు.విష్ణుసహస్ర నామాలను చెప్పిన మహానుభావుడు.పాండవులకు నీతిబోధ చేసిన రాజనీతిజ్ఞుడు.తండ్రి వివాహం కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా తనువు చాలించిన పుణ్యపురుషుడు.అలాంటి భీష్ముడికి ఒకే ఒక ఆలయం దేశంలో ఉంది.

భారత కథలో...
శంతనుడు గంగానదిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. అప్పుడు  గంగాదేవి ‘నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు. అలా చేస్తే నేను నిన్ను విడిచివెళ్లిపోతాను’ అంది. అంగీకరించాడు శంతనుడు. పెళ్లయ్యింది. గంగాదేవికి ప్రథమ పుత్రుడు ఉదయించాడు. ఆమె ఆ బిడ్డను తీసుకువెళ్లి గంగలో విడిచింది. ఈ విధంగా ఏడుగురు బిడ్డలను గంగలో విడిచింది. ఎనిమిదవ పుత్రుడిని విడిచి పెడుతుండగా శంతనుడు అడ్డు తగిలాడు. తను విధించిన షరతు ప్రకారం గంగాదేవి శంతనుడిని విడిచి వెళ్లిపోతూ అష్టమ శిశువును తనతో తీసుకువెళ్లి పెంచి పెద్దవాడిని చేస్తానని చెప్పింది. ఆ బిడ్డకు ‘దేవవ్రతుడు’ అని నామకరణం చేసి పెంచి పెద్దవాడిని చేసి శంతనుడికి అప్పచెప్పి వెళ్లిపోయింది. ఒకనాడు శంతనుడు సత్యవతి అనే మత్స్య కన్యను చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు కలగబోయే కుమారుడే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు ఆమె తండ్రి దాసరాజు. ఈ విషయం తెలుసుకున్న గంగానందనుడు తన తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు.  కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యపై శయనించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తానన్నాడు. యుద్ధం ముగిసిన తరవాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతిబోధ చేశాడు. భీష్ముడు శర శయ్య మీద ఉన్నప్పుడే  విష్ణుసహస్ర నామాలను రచించాడని ప్రతీతి. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ 1008 నామాలు పఠించాడు భీష్ముడు. ఆయన జీవితం భారతీయులకు ఒక గ్రంథం లాంటిది.

అరుదైన దేవాలయం...
అలహాబాద్‌ నగర నడిబొడ్డున అత్యంత అరుదైన భీష్మ దేవాలయం ఉంది. యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మపితామహుడిని సందర్శించుకుని, భ్రాతృత్వాన్ని అలవరచుకుంటున్నారు. పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి దారగంజ్‌లోని నాగవాసుకి అత్యంత సమీపంలో దేవాలయానికి భీష్మ దేవాలయం  ఉంది. ఈ దేవాలయాన్ని జె.ఆర్‌.భట్‌ అనే న్యాయవాది నిర్మింపచేశాడు. 1961 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పడుకున్న భంగిమలో ఇక్కడ  దర్శనమిస్తాడు. గంగాభక్తురాలైన ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి వచ్చేదట. ఆమె స్వయంగా భట్‌ దగ్గరకు వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట. ఆమె వేడుకున్న తర్వాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట. అలా గంగానదీ సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.

కురుక్షేత్రలో భీష్మకుండ్‌
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన చోట ఒక పెద్ద నీళ్ల ట్యాంకు ఉంది. దానిని  బన్‌గంగ లేదా భీష్మకుండ్‌ అంటారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి దాహం వేసి మంచినీరు కావాలని కోరడంతో, అర్జునుడు బాణంతో పాతాళగంగను బయటకు తీసుకువచ్చాడని, ఈ భీష్మకుండ్‌ అదేనని స్థానికులు చెబుతారు.
– డా.పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement