ప్రేమ లేని 'లవ్'
తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఉంది. అది వాళ్లు ఇవ్వలేదు. వాడి దగ్గర లవ్ ఉంది. కానీ అందులో ప్రేమలేదు. లవ్‌లో ప్రేమ లేకపోవడం ఏంటి? అంతేమరి! ఈ రోజుల్లో లవ్‌కి డెప్త్ ఉండడం లేదు. నాలుగు రోజులు కలిస్తే చాలు ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తున్నారు. ఆ తర్వాత... బాధ్యత తీసుకునే సమయానికి... ఆ లవ్ లో ప్రేమ లేదని అర్థమౌతుంది. ప్రేమ ఒక ఫాస్ట్ ఫుడ్ అయింది. శాటిస్‌ఫ్యాక్షన్ తప్ప, న్యూట్రిషన్ ఉండడం లేదు. ప్రేమ ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అయింది. చూపులకు తప్ప, మనసుకు అందడం లేదు. ఎమోషనల్‌గా నిలబెట్టే ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ రుచిని పిల్లలకు ఒక్కసారి చూపిస్తే... పిల్లలు గుర్తిస్తారు.. అర్థం చేసుకుంటారు.. బయటి ప్రేమలకు... బలి కాకుండా ఉంటారు.
కారు వేగంగా వెళ్తోంది.సుధాకర్ దంపతుల ఆలోచనలు అంతకంటే వేగంగా సాగుతున్నాయి. ‘డ్రైవర్ త్వరగా పోనివ్వు’ అంది వసుంధర.
‘ఈ తొందర అప్పుడే పడి ఉంటే అపూర్వకి ఈ కష్టం వచ్చేది కాదు’ అన్నాడు సుధాకర్. ‘సరే... నేను తొందరగా తెలుసుకోలేదు మరి మీకేమైంది’ రెట్టించింది వసుంధర. ‘నాకేమైందా? ఆఫీసు, బిజినెస్సు సెట్ చేయకపోతే మనకివన్నీ ఉండేవా?’ సుధాకర్ గొంతులో అసహనం. ‘అయితే... నేను చేసిన పని... పని కాదా? నేను లేకుండానే ఇవన్నీ సమకూర్చగలిగారా’ వసుంధర స్వరంలో ఆవేశం. ‘వద్దులే... వసుంధరా! నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే గొడవ’ ‘అవును. గొడవంతా నాదే... అందుకే ఆపూర్వకి ఇంత కష్టం వచ్చింది’ ఏడుపు ఆపుకుంటోంది వసుంధర. ఇంతలో కారు అపూర్వ ఇంటి ముందాగింది.
‘‘అమ్మా..’’ అంటూ ఒక్కసారిగా అమ్మ మీద వాలిపోయింది అపూర్వ. కూతుర్ని గట్టిగా హత్తుకుంది వసుంధర. కూతుర్ని చూసి షాక్ తిన్నాడు సుధాకర్. అపూర్వ ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ల దగ్గర చర్మం నల్లగా కమిలిపోయి ఉంది. కూతుర్ని ఇద్దరూ కాసేపు అనునయించారు. సోఫాలో కూర్చోబెట్టారు. కూతురికి ఇటొకరు, అటొకరు కూర్చున్నారు. ‘‘రాహుల్ ఎక్కడ?’’ అని అడిగాడు సుధాకర్. ‘‘తెలీదు.. కొట్టేసి, వెళ్లిపోయాడు’’ అంది అపూర్వ. ఆమె ఒళ్లంతా వాతలు తేలి ఉన్నాయి. గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అపూర్వ ఏడుపు ఆపుకోలేకపోతోంది. ‘‘వెళ్లిపోదాం... నేనూ మీతో వచ్చేస్తా’’ అంటోంది అమ్మానాన్నలతో. ‘‘ఏమైంది అపూర్వా?’’ అని అడిగింది వసుంధర. ఏమైందో తెలుసుకోవాలంటే కథ కొద్దిగా వెనక్కు నడవాలి.
లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్
అపూర్వ బీటెక్ థర్డ్డ్ ఇయర్. రాహుల్ ఫైనలియర్. ఆ యేడే కాలేజీ మారి కొత్త కాలేజీకి వచ్చింది. అపూర్వ, రాహుల్ క్యాంటిన్‌లోనో, లైబ్రరీలోనో ఒకరికొకరు ఎదురుపడేవారు తప్ప పరిచయం లేదు. ఓ రోజు అనుకోకుండా ఆ పరిచయమూ జరిగిపోయింది. కాలేజ్ క్యాంపస్‌లోనే అపూర్వను కొంతమంది సీనియర్స్ ఏవో కామెంట్స్ చేశారు. అంతే! అక్కడే ఉన్న రాహుల్... వాళ్లని లాగి ఒక్కటిచ్చాడు. ఆ స్టంట్‌కి మిగతా వాళ్లు బిత్తరపోయారు. అపూర్వ అబ్బురపడింది. రెండో రోజు కాలేజీకి మంచి గిఫ్ట్‌తో వచ్చింది. రాహుల్‌కి ఇచ్చింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ‘వాళ్లనెందుకు కొట్టావ్?’ అని అడిగింది. ‘నిన్ను ఏడిపించారు కదా!’ అన్నాడు. ‘నన్ను ఏడిపిస్తే మీకేంటి?’ అని రెట్టించింది.
‘నీతో ఫ్రెండ్‌షిప్ చేయకపోయినా... నిన్ను రోజూ చూస్తుంటాను. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో భలే సందడిగా ఉంటావ్. అది నాకు నచ్చింది’ అన్నాడు. మరికొంత సేపు ఇద్దరి మధ్యా సంభాషణ నడిచింది. ‘ఫ్రెండ్స్?’ అంటూ చేయి చాపింది. ‘ఫ్రెండ్స్’ అంటూ చేయి కలిపాడు. ఆ రోజు నుంచి ఆ ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. అపూర్వ మీద అమితమైన అటెన్షన్ చూపేవాడు రాహుల్. ఆమెకు నచ్చింది చేసేవాడు. మెచ్చింది తెచ్చేవాడు. సొంత అమ్మానాన్న కూడా అపూర్వ మీద ఎప్పుడూ అంత అటెన్షన్ పే చెయ్యలేదు.
ఏదైనా చెబుతుంటే కనీసం వినేవాళ్లు కాదు. నాన్న బిజీ, అమ్మ బిజీ. కోరినవన్నీ సమకూర్చేవారు. కూతురితో టైమ్ మాత్రం స్పెండ్ చేసేవాళ్లు కాదు. ఇలా.. ప్రతి విషయంలో తన పేరెంట్స్‌ని రాహుల్‌తో పోల్చి చూసుకోవడం అలవాటైంది అపూర్వకు. అమ్మానాన్నల కంటే రాహులే తనకు దగ్గరగా ఉన్నట్లు అనిపించేవాడు.సినిమాలు, షికార్లు, పార్టీలు, పబ్‌లు.. అపూర్వ ఏది అడిగినా క్షణాల్లో వచ్చి వాలేవాడు రాహుల్. ఫ్రెండ్షిప్ కాస్తా లవ్‌గా మారిపోయింది. చివరికి ఒకరిని విడిచి ఒకరం ఉండలేమనే నిశ్చయానికీ వచ్చేశారు. పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నారు. రాహుల్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకున్నారు... ఇరువైపుల పెద్దల అనుమతి లేకుండానే... వాళ్లు రాకుండానే!
పెళ్లయ్యాక సెకండ్ ఫైట్
ఫైనలియర్ రిజల్ట్స్ రాకముందే ఫ్రెండ్ సహాయంతో చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు రాహుల్. ఓ నెల రోజులు బాగా గడిచాయి. రెండో నెలలో కీచులాటలు మొదలయ్యాయి. మూడో నెలలో మాటల యుద్ధం ప్రారంభమైంది. పెళ్లికి ముందు అపూర్వ మీద చూపించిన అటెన్షన్‌ను పెళ్లి తర్వాత ఉద్యోగం మీద చూపించాల్సి వచ్చింది రాహుల్‌కి. చాలీచాలని జీతంతో అపూర్వను సంతోష పెట్టడం కత్తి మీద సామైంది రాహుల్‌కి. పార్ట్ టైమ్ జాబూ వెదుక్కున్నాడు. ఆ ఒత్తిడితో తరచు అపూర్వను విసుక్కుంటున్నాడు. పెళ్లికి ముందు ఏం చేసినా మెచ్చుకున్న రాహుల్ ఇప్పుడు ఏం చేయకపోయినా తప్పు పడుతున్నాడు.
తనతో గంటలుగంటలు గడిపిన అతను ఇప్పుడు ఒక్క నిముషంగా కూడా టైమ్ ఇవ్వలేకపోతున్నాడు. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తను తనకు తెలీకుండానే సతాయించేది. ఒక వైపు పని ఒత్తిడి.. ఇంకోవైపు.. తన కన్నా పెద్దవాళ్లు అక్క, అన్న ఉండగానే డబ్బున్న అమ్మాయి దొరికిందని పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్నాడనే నిందలు! అవన్నీ పట్టించుకోక ఇంటికొస్తే అపూర్వ సాధింపు. తట్టుకోలేక తాగుడికి అలవాటుపడ్డాడు. ఇంట్లో అపూర్వ కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఎదురుగా ఉన్న వస్తువులను నేలకేసి కొట్టేవాడు. కోపం ఆవేశంగా మారి చివరకు అపూర్వను చేయి చేసుకునేదాకా వెళ్లింది. కొద్దిరోజులకే అది సర్వసాధారణం అయింది. కొట్టానన్న బాధతో మళ్లీ బార్‌కి వెళ్లేవాడు.
బర్త్‌డే రోజు ఫైనల్ ఫైట్
తాగి ఆఫీస్‌కి వస్తున్నాడని ఒకరోజు రాహుల్‌ని ఉద్యోగంలోంచి తీసేశారు. ఆరోజు అపూర్వ బర్త్‌డే. సాయంకాలం తన కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్ తెస్తాడని ఆశగా ఎదురు చూసింది. కాని అక్కడ సీన్ మారింది. ఉద్యోగం ఊడిపోయిన బాధలో ఫుల్లుగా తాగొచ్చాడు రాహుల్. ఆ విషయాన్ని గ్రహించక... ఒట్టి చేతులతో వచ్చిన భర్త మీద విరుచుకు పడింది. తనంటే కాకుండా తన వెనకున్న డబ్బును చూసి పెళ్లి చేసుకున్నావంటూ తిట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లాం బర్త్‌డేకి ఓ గిఫ్ట్ కొనివ్వలేని నువ్వే భర్తవంటూ ఈసడించుకుంది. దానికి అపూర్వ మీద పిడిగుద్దులతో సమాధానమిచ్చింది రాహుల్ ఆవేశం. హతాశురాలైంది. భరించలేకపోయింది. వెంటనే ఆమ్మానాన్నలకు ఫోన్ చేసింది.
ఆలోచనలో అమ్మానాన్న
రాహుల్‌కి ఫోన్ చేసి, కొన్నాళ్లు అపూర్వ తమతో ఉంటుందని చెప్పి, అతడి అనుమతితో కూతుర్ని ఊరికి తెచ్చేసుకున్నారు సుధాకర్, వసుంధర. లోపల గదిలో అపూర్వ నిద్రపోతోంది. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడిపోయారు. ఇద్దరి ఆలోచనలూ ఒకే విధంగా సాగుతున్నాయి. కూతురి జీవితం ఇలా కావడానికి తామే కారణం అని వారికి అనిపిస్తోంది. అవును... ఆ పిల్ల మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టారని? సొంత కంపెనీని డెవలప్ చేసే పనిలో పడి అపూర్వను పట్టించుకోనేలేదిద్దరూ.
నానమ్మ, అమ్మమ్మ, ఆయాల వంతుల వారీ పెంపకంతో అమ్మానాన్న ప్రేమకు దూరమైంది అపూర్వ. విలువైన సమయానికి బదులు ఖరీదైన కానుకలతో కూతురిని సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పెంకితనం అలవడింది. ఏదడిగితే అది క్షణాల్లో హాజరవకపోతే హఠం చేసేది. ఫ్రెండ్స్‌తో ఎక్కువ గడపడం మొదలుపెట్టింది. పరాయి వాళ్లు తన మీద ఏ కాస్త శ్రద్ధ పెట్టినా.. ఇట్టే చనువు పెంచేసుకునేది. నమ్మేసేది. ఆ క్రమంలోనే రాహుల్ పరిచయం అయ్యాడు. వాళ్ల ప్రేమ వ్యవహారం తెలిసి వారించేసరికే పరిస్థితి చేయి దాటి పోయింది. కూతురి ఆలోచనను కుదురు చేయాల్సింది పోయి పరువు తీసిందని పరాయిదాన్ని చేశారు. ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేశారు. ఎంత తప్పు చేశారు? అపూర్వ నిద్రలో కాస్త కదిలింది. కూతురి కురుల్ని సవరించింది వసుంధర. చక్క దిద్దాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నాడు సుధాకర్.